శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jun 14, 2020 , 23:44:46

గొప్ప కళాకారుడు గొప్ప మనిషి

గొప్ప కళాకారుడు గొప్ప మనిషి

ఆయన (నేరెళ్ళ వేణుమాధవ్‌)కు కళ అంటే ప్రాణం. ఆయన కుటుంబంలో 14వ సంతానం. చిన్ననాటి నుంచే కళపై మక్కువ ఉండేదట. 19వ ఏటనే తల్లీదండ్రి ఇద్దరూ మరణించారు. అయినా తనకు నచ్చిన కళను సాధన చేస్తూ ఉండేవారు. ఆయన (మిమిక్రీని) ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ఇదొక కళ అని కూడా ఆయనకు తెలువదట. అయినా ఎంతో మంది సలహాలు తీసుకొని స్వతహగా ఈ కళను అభివృద్ధి చేసుకున్నారు.

ఆయన జీవితంలో ముఖ్యమైనది కళే, కళే వారి ఊపిరి. ఎవరితో మాట్లాడినా, ఏ పని చేస్తున్నా, ఏదో ఒక ఐటం(మిమిక్రీ) ప్రాక్టీస్‌ చేస్తూనే ఉండేవారు. వారి ప్రిన్సిపాల్‌ రామశర్మగారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు. ‘నువ్వు గొప్ప కళాకారుడివి అవుతావని దీవించారట’ ‘ఏమండి ఎప్పుడూ ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటారు’ అనడిగితే ‘నిద్రలేపి అడిగినా కూడా ఐటం చేయగలిగేటట్టు ఉండాలి’ అనేవారు. నిరంతరం ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌.. కళ తప్ప ఇంకో ప్రపంచం లేదు వారికి. జీవితంలో కానీ కళలో కానీ ‘పూర్తిగా బాధ్యతగా వ్యవహరించాలి. ఒక కళాకారునిగా పూర్తిగా బాధ్యతతో కాన్సంట్రేట్‌ చేసి ప్రదర్శన ఇవ్వకపోయినా, తప్పుగా ప్రజెంట్‌ చేసినా ఒక విఫల కళాకారుడిగా ముద్రపడిపోతుంది. మళ్లీ మనం ఎంత కృషిచేసి ప్రదర్శన ఇచ్చినా ఆ ముద్ర చెరిగిపోదన్నారు. కళ పట్ల ఎంత కోరిక ఉండేదంటే ఎంత ఎత్తుకు ఎదుగాలంటే అంతకంటే ఉన్నతంగా సాధన చేయాలనేవారు. ఆయన కళ  పరిమితం కాకుండా ఉండేందుకు అనేక భాషలను నేర్చుకున్నారు. చిన్నతనం నుంచి ఉర్దూ మీడియంలో చదువడం వల్ల ఆ భాష బాగా వచ్చు. తెలుగు చెప్పనక్కర్లేదు. ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడంలో కూడా వారికి ప్రవేశం ఉంది. 

ఆయన చివరిరోజుల్లో ఒకసారి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వైద్యం జరుగుతుండగా బీపీ డౌన్‌ అయింది. ‘ఏదో ఒక్కటి మాట్లాడుతూ ఉండండి’ అని డాక్టర్లు చెప్పారు. నేను ఏది మాట్లాడిన నెమ్మదిగా ‘ఊ..ఊ..’ అనేవారే కానీ దానికి సమాధానం ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో మిమిక్రీ ఆర్టిస్టు అంజన్‌కుమార్‌ వచ్చారు. ఈ విషయం ఆయనకు చెవి దగ్గర చెప్పగానే కళ్లుతెరిచి అతనితో మాట్లాడటం మొదలుపెట్టారు. ‘మిమిక్రీ గురించి మాట్లాడవయ్యా అని నేను సైగ చేస్తే అతను ప్రోగ్రాం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈయన కూడా ప్రోగ్రాంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. అదిచూసి డాక్టర్లే ఆశ్చరపోయారు. ఇంకా ఇద్దరు కళాకారులు బయట ఉన్నారు అనగానే ఐసీయూలో ఉన్నా కూడా డాక్టర్లు అనుమతించారు. దాదాపు 2 గంటలు మాట్లాడుతూనే ఉన్నారు. బీపీ నార్మల్‌ అయింది. ఆయనకు కళకు ఉన్న బంధం అటువంటింది. కోలుకొని ఇంటికి డిశ్చార్జ్‌ అయి వస్తుంటే హాస్పిటల్‌ డైరెక్టర్లు, స్టాఫ్‌ లాంజ్‌లో కుర్చీవేసి ఆయనను కూర్చోబెట్టి సన్మానం చేశారు. ‘ఎంత అదృష్టమండి ఇప్పుడు కూడా సన్మానం పొందుతున్నారు’ అని నేను అంటే ‘నాకు కాదు నా కళకు సన్మానం’ అన్నారు నిగర్వంగా. 

ఆయనకు పదవుల మీద వ్యామోహం లేదు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనకు ఫోన్‌ చేశారు. అప్పటికి మా ఇంట్లో ఫోన్‌ కూడా లేదు. పక్కవాళ్లకు ఫోన్‌చేసి ‘వేణుమాధవ్‌గారితో మాట్లాడించండి’ అని పీవీ గారు చెప్పగానే వాళ్లు వచ్చి విషయం చెప్పారు. ఈయన వెళ్లి మాట్లాడారు. విషయమేమంటే అప్పటికే ఈయన ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ‘నిన్ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తాం. నీకేమి అభ్యంతరం లేదు కదా’ అన్నారట. అప్పుడు ఈయన ‘కొద్దిగా టైం ఇవ్వండి’ అని దగ్గరి స్నేహితులతో చర్చించి రెండురోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేస్తే ‘సరే అన్నారు’. దానికి పీవీ నవ్వి ‘ఏమయ్యా ఎవరైనా ఎమ్మెల్సీ పదవీ ఇస్తాననంటే ఎగిరి గంతేస్తారు.. నీవేంటి ఎవరి సలహా తీసుకొని ఒప్పుకున్నావ్‌' అని అన్నారట. 

కళాకారులను ఎంత ఎంకరేజ్‌ చేసేవారంటే ఆయనలాగా ఎవ్వరూ చేయరు. ఎంతోమంది ఏకలవ్య శిష్యులు వారి ప్రదర్శనను వీరు చూడాలని వచ్చి ప్రదర్శించేవారు. ఆయన పట్ల ఎంతో భయంతో, భక్తిభావంతో ఉండేవారు. కానీ ఇయన మాత్రం వారిని దగ్గరికి తీసుకొని వారి భుజంపై చేయి వేసి ‘చెప్పునాయనా చెప్పు’ అంటూ ప్రోత్సహించేవారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ‘వాళ్లు ఇమిటేట్‌ చేసిన క్యారెక్టర్‌, వాయిస్‌ ఐదు శాతం కూడా బాగా లేదు కదండీ’ అంటే ‘వాళ్లు ఎంతో భక్తితో, ప్రేమతో గురువు గారి మెప్పు పొందాలని వచ్చారు. బాగా లేదంటే ఈ కళనే వదిలేస్తారు. వాళ్లను ఎంకరేజ్‌ చేస్తే కళ బతుకుతుందనేవారు. 2002లో ఆయనే నేరెళ్ల వేణుమాధవ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటుచేశారు. పేద కళాకారులను ఆదుకోవాలని, వారిని గుర్తించాలని ఈ ట్రస్టును ఏర్పాటుచేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక కళలో నిష్ణాతులైన కళాకారులను గుర్తించి సన్మానం చేయాలని నిర్ణయించారు. తాను ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రపంచ దేశాలు తనను గౌరవించి సత్కరించినప్పుడు ఎంత సంతోషపడ్డారో, ఎంతగా తృప్తిపడ్డారో తొలి సంవత్సరం ఒక పేద కళాకారుడికి తనవంతుగా చేసిన సన్మానం అనంతరం అంతే సంతోషపడ్డారు. 

ఆయన సంస్కారం చాలా గొప్పది. ఆటోడ్రైవర్‌ను కూడా ‘డ్రైవర్‌గారు’ అని సంబోధించేవారు. ‘ప్రతీ వాడిలోనూ ఏదో ఒక సుగుణం ఉంటుంది దాన్ని చూడాలి కానీ వాళ్ల లోపాలను ఎన్నకూడదు’ అని నాకు చెప్పేవారు. జీవితంలో ఆయన పొందని సన్మానం, సత్కారం ఏమీ లేవు. కానీ కళ పట్ల ఆయనకు ఇంకా అసంతృప్తి ఉండేది. ఇంకా ఏదో చేయాలి. ఇంకా ఏదో సాధించాలి అని చివరి వరకు అనుకునేవారు (గద్గద స్వరంతో) పరిమితమైన ఆయుష్షుతో సంపూర్ణ పురుషోత్తముడిగా అయ్యారు. 

- నేరెళ్ల వేణుమాధవ్‌ సతీమణి శోభావతి 

ఇంటర్వ్యూ: నూర శ్రీనివాస్‌, వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ


logo