ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 14, 2020 , 00:03:09

మన పోతన మధురిమ

మన పోతన మధురిమ

అష్టాదశ పురాణాల్లో శ్రీమద్భాగవతం తలమానికం. దీనికున్న ప్రశస్తి, వ్యాప్తి మరే పురాణానికీ లేదు. భాగవతం భగవత్తత్వాన్ని, భక్తుల చరిత్రలను అత్యంత రసరమ్యంగా, సులభ సుందరంగా, వీనుల విందుగా ప్రతిపాదించగడమే ఈ లోకప్రియతకు కారణం. ఈ కావ్యరచనలోని మధురిమలను పద్యం తర్వాత పద్యంగా.... వారం తర్వాత వారంగా.... ఆస్వాదిద్దాం...

భగవంతుని అవతారాలో కృష్టావతారం పరిపూర్ణ అవతారం- ‘పరిపూర్ణతమః సాక్షాత్‌ శ్రీకృష్టో భగవాన్‌ స్వయం’- కృష్ణుడు సాక్షాత్‌ పరబ్రహ్మమని భాగవత సిద్ధాంతం. భాగవతం భక్తి శాస్త్రం. భక్తికి పర్యాయమే భాగవతం. కర్మ, భక్తి, జ్ఞానాలు ముక్తికి మార్గాలు. ఈ మూడింటిలో కూడా అనన్య భక్తి మాత్రమే ముక్తి ప్రాప్తికి సులభమూ, శక్తివంతమైన స్వతంత్రయుక్తి అని భాగవత పురాణ సూక్తి. ‘జ్ఞానదేవ తు కైవల్యం’ అని కదా సిద్ధాంతం. అలాంటప్పుడు కేవలం భక్తి, ముక్తినెలా ఇవ్వగలదు? ’భక్తిః జ్ఞానాయ కల్పతే- జ్ఞానాకారేణ పరిణమతే’ అని సమాధానం. అంటే భాగవతం భక్తిశాస్త్రమైనా చివరకు జ్ఞానంగానే పర్యవసిస్తుందట. భాగవతం ప్రతిపాదించే వస్తువు (థీమ్‌) జ్ఞాన పర్యవసాన భక్తి. భక్తిద్వైతంతో ప్రారంభమైనా అద్వైతంతోనే ముగుస్తుంది. భక్తితో ‘దాసోహం-  దాసోహం’ అని భావిస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహించి ‘దాసోహం’లోని ‘దా’ కారం దొంగిలిస్తాడు. కృష్ణుడు చోరాగ్రగణ్యుడు కదా! భక్తి దాసోహం. జ్ఞానం సోహం. ‘అతః ప్రయత్నశ్చ భక్తౌ’- కాన, అట్టి అనన్య భక్తికై ప్రయత్నించడమే సాధకుని విధి. ఇదే భాగవత సిద్ధాంత సారం, శాస్త్ర సారం కూడా-

శ్లో॥ కర్మణా జాయతే భక్తిః భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్‌ ప్రజాయతే ముక్తిః ఇతి శాస్ర్తార్థ నిర్ణయః

(సత్కర్మలు ఆచరించడం ద్వారా అంతఃకరణం పవిత్రమవగా భక్తి కలుగుతుంది. ఆ భక్తి జ్ఞానానికి దోహదం చెయ్యగా, జ్ఞానం వల్ల ముక్తి చేకూరుతుంది. ఇది సర్వశాస్త్ర సిద్ధాంత సారం)

గుడులు కట్టించిన కంచెర్ల గోపరాజు, రాగాలు కూర్చిన కాకర్ల త్యాగరాజు, పుణ్యకృతి చెప్పిన బమ్మెర పోతరాజు- ఈ రాజత్రయం తెలుగునాట భక్తి సామ్రాజ్యాన్ని ఏలిన మకుటం లేని మహారాజులు. వారి దృష్టిలో - ‘సుకవితా యద్యస్తి రాజ్యేన కిం’- ఉదాత్తమైన కవిత్వముండగా రాజ్యంతో పనేమిటి? ఉదాత్త కవిత్వమే రాజ్యం. సంస్కృత భాగవతం తెనిగించిన పోతన పరమ భాగవతుడు. ‘సహజ పాండిత్యుడు’ అనే బిరుదుగలవాడు. భక్తి కవితా సుధానిధి. పుట్టుకవి. ప్రజాకవి. సిద్ధపురుషుడు. పోతన పద్యాలు బ్రహ్మానంద రసగుళికలు. అజ్ఞాన తిరిమి నాశకర దీప కళికలు. భాగవత ఆంధ్రీకరణ పోతన వంటి ‘భక్తి కవి’కి లభించడం తెలుగు భాష చేసుకున్న పూజ. విశ్వనాథవారి పలుకుల్లో పోతన ‘తెలుగువారి పుణ్యముల పేటి’. తనకు పూర్వులైన మహాకవులు భారత, రామాయణాలను, మరికొన్ని పురాణాలను తెలిగించారే కానీ భాగవత పురాణం జోలికి పోక తన కోసం దానిని మిగల్చడం తన జన్మజన్మల సుకృత విశేషంగా భావించి పరవశించిపోయాడు. ‘నా జననంబున్‌ సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండగన్‌'. జన్మరాహిత్యం ద్వారా జన్మ సాఫల్యం పొందుతానని పొంగిపోయాడు. ఆశ్చర్యకరంగా పోతనకే కాక ఆయన భాగవతానికి కూడా మరుజన్మ లేకుండా పోయింది! ఈ ఐదువందల సంవత్సరాల సుదీర్ఘకాలంలో మరి ఏ కవీ భాగవతాన్ని తెలిగించే తెగువ చూపలేకపోయాడు కదా!

మహాకవి పోతన వ్యాసభాగవత ఆంధ్రీకరణకు ఉపక్రమిస్తూ పరమశివుని, పరమేష్ఠి బ్రహ్మదేవుని, విఘ్నేశ్వరుని, చదువుల రాణి వాణిని, ‘మహత్త కవిత్వ పటుత్వ సంపదలు’ ప్రసాదించమని ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మను, శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవిని, సూర్య స్కందులను ఇలా ఇష్టదేవతలందరినీ ప్రార్థించి, వాల్మీకి, వ్యాస, కాళిదాసాదులకు కైమోడ్చి, తనకు మార్గదర్శకులైన నన్నయ, తిక్కనాది పూర్వకవులందరినీ మనసారా సంభావించి, సమకాలికులను అభినందించి, భావి కవులకు శుభం పలికాడు. ‘విశ్వశ్రేయః కావ్యం’- కావ్య ప్రయోజనం లోక కళ్యాణమే కనుక ‘జగద్ధితంబుగ’ తాను వెలయించిన భాగవతాన్ని, ధనకనకవస్తువాహన, గజారోహన, రథారోహణాది నశ్వర సుఖాలను, సత్కారాలను ఆశించి అవనీపతులకు (రాజులకు) అంకితమివ్వక శ్రీపతినే తన కృతిపతిగా స్వీకరించాడు. వృత్తికి హలాన్ని, ప్రవృత్తికి కలాన్ని స్వీకరించి ఆదర్శ గృహస్థుగా ఆంధ్రలోకానికి ఆరాధ్యదైవమయ్యాడు కవి కృషీవలుడు. 

గంటమొ? చేతిలోది ములుగఱ్ఱయొ? నిల్కడ యింటిలోననో?

పంటపొలానో? చేయునది పద్యమొ? సేద్యమొ? మంచమందు గూ

ర్చుంటివొ? మంచె యందొ? కవివో? గడితేరిన కర్షకుండవో?

రెంటికి జాలియుంటివి సరే కలమా హలమా ప్రియంబగున్‌?

అని ఎంతో కుతూహలంతో పోతన కవితాప్రియులైన జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘కరుణశ్రీ’ గారు పోతనను నిలదీశారు.

ఒక చంద్రగ్రహణ పర్యదినాన గౌతమీ గంగలో స్నానం చేసి గంగాధరుణ్ని ధ్యానిస్తూ ఉండగా మనసులో ధరణిజా సమేతంగా దశరథరాముడు దర్శనమిచ్చి- “నేను రామభద్రుణ్ని. నా పేర సంస్కృత భాగవతాన్ని ఆంధ్రభాషలోకి అనువదించు, నీ సంసార బంధాలు సమసిపోతాయి” అని ఆశీర్వదించి అంతర్ధానమైనాడట! పోతన సంభ్రమాశ్చర్యాలకు లోనై, మెల్లిగా తెప్పరిల్లి, విషయం గ్రహించి- ‘అహోభాగ్యమహాభాగ్యం!’ ఆహా! ఏమి నా భాగ్యం! పలికేది పవిత్ర భాగవత పురాణమా? పలికించే ప్రభువు రామభద్రుడు? నే పలికిన అవిద్యా బంధనాలు పరిహారమవుతాయా? అలాంటప్పుడు మనోవ్యధలు పెంచే వృథా కథలు పలకటం దేనికి? సర్వధా హరికథలే పలుకుతా అని మురుసుకున్నాడు. అందుకే ‘విద్యావతాం భాగవతే పరీక్షా’- పండితుల పాండిత్యానికి గీటురాయి భాగవతం అంటారు.

క. హరివార్త లెఱుగు వారికి,హరిపదములు తలచువారి కనవరతంబున్‌ హరి కథలు వినెడివారికి మరణాగత మోహ సంభ్రమము లేదనఘా.

‘హరిలీలలు అవగతం చేసుకొనేవారు, హరిచరిత్రలు ఆలకించేవారు, హరి చరణాలను స్మరించేవారు మరణసమయంలో ఎటువంటి వేదనా, ఆవేదనా, తొందరపాటు, తొట్రుపాటు, ఏపాటూ పొందరయ్యా!


logo