శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jun 14, 2020 , 00:03:07

తొలి సినీ గీత రచయిత చందాల కేశవదాసు

తొలి సినీ గీత రచయిత చందాల కేశవదాసు

‘భలే మంచి చౌక బేరము’ అన్న పాటను వినని తెలుగువారు ఉండరేమో. ఆ పాట రాసిన కేశవదాసు సామాన్యులా! ఓ తరాన్ని తన కళా విన్యాసంతో ఉర్రూతులూగించిన ప్రతిభామూర్తి. తెలుగునాట తొలి సినీగీత రచయిత. జూన్‌ 20న వారి జయంతి సందర్భంగా ఓ చిరు నివాళి. వారి రచనల మీద పీహెచ్‌డీ చేసిన పురుషోత్తమాచార్యగారు అందిస్తున్న ప్రత్యేక కథనం....

మనందరికీ తెలిసిన చందాల కేశవదాసు కవి, రచయిత. నిజానికి ఆయన అష్టమూర్తి! ఎనిమిది రకాలుగా బహుముఖప్రజ్ఞ కలవారు... కవి, అష్టావధాని, హరికథా భాగవతార్‌, భాగవత సప్తాహ నిర్వాహకులు, రంగస్థల నటుడు, నాటకదర్శకుడు, సినీ, నాటకరచయిత, ఆయుర్వేద వైద్యుడు! అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. ఒకసారి పోలంపల్లి గ్రామంలో తన ‘కనక్తార’ నాటకంలో అక్కడి నటులకు శిక్షణ ఇచ్చి, వారితో ప్రదర్శింపజేసి... తద్వారా వచ్చిన ఆరువేల రూపాయలను ఆ ఊరిలో గ్రంథాలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన వదాన్యుడు. 

సమున్నత శిఖరం

కేశవదాసు రంగస్థలం మీద గిడ్డూఖాన్‌ మొదలుకొని దశరథుని వరకు ఎన్నో పాత్రలను ధరించారు. ప్రతి పాత్రా తనకు కొట్టిన పిండే! 1943లో జగ్గయ్యపేటలో కనక్తార నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అందులో నటించవలసిన వేమూరి గగ్గయ్య రాలేకపోయారు. దాంతో అప్పటికప్పుడు వేదికనెక్కి ప్రతినాయకపాత్ర ఆయిన క్రూరసేనునిగా నటించి వేదికను దద్దరిల్లజేశారు. ఈ నాటకాన్నే 1937లో సరస్వతీ టాకీసువారు సినిమాగా తీశారు. సముద్రాల రాఘవాచార్య ఈ సినిమా ద్వారానే రచయితగా పరిచయమయ్యారు. దీన్నే మళ్లీ 1956లో గోకుల్‌ ప్రొడక్షన్‌ వారు తీయగా ఎస్‌.వి. రంగారావు, ఎస్‌.వరలక్ష్మి  వంటి ఉద్ధండులు నటించారు. దీనికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఇలా ఎందరో ఉజ్వల భవిష్యత్తుకు దారిచూపిన ఘనత వారి రచనలది. ఇక 1931లో తొలి తెలుగు టాకీకి పాటలను అందించిన కేశవదాసు రికార్డు ఎలాగూ ఉంది.

ఆ రచనలే ప్రామాణికం

చాలా సందర్భాలలో కేశవదాసు నాటకానికో, సినిమాకో రాసిన పద్యాలూ, పాటలూ.... అదే ఇతివృత్తంతో వచ్చే చిత్రాలకి అడుగుజాడలుగా నిలిచేవి. దాసరి కోటిరత్నం 1935లో తీసిన సతీ అనసూయ సినిమాకు ఆయన మాటలు, పాటలు రాశారు. తరువాత కాలంలో ఎవరు అనసూయ సినిమా తీసినా అదే కథాసంవిధానాన్ని అనుసరించారు. పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి ‘రాధాకృష్ణ’ నాటకానికి 21 పాటలు రాశారు. దాన్నే 1939లో లక్ష్మీ సినీటోన్‌ వారు సినిమాగా తీశారు. సోమరాజు రామానుజరావు ‘సతీసక్కుబాయి’ నాటకానికి రాసిన పాటలను 1935, 1955, 1965లలో తీసిన ‘సతీసక్కుబాయి’ చిత్రాలలోనూ నేరుగానో, ఛాయామాత్రంగానో ఉపయోగించుకున్నారు.

కేశవదాసు తమ ప్రదర్శనలు, రచనల ద్వారా వచ్చిన సొమ్ము అంతటినీ తమ్మర దేవాలయ నిర్మాణానికి, పేదలకు అన్నదానానికి వినియోగించారు. శేష జీవితాన్ని ఆయుర్వేద వైద్యుడిగా నాయకన్‌గూడెంలో నిరాడంబర జీవితాన్ని గడిపి తనువు చాలించారు. ఇప్పటికీ ఆయన సమాధి నాయకన్‌గూడెంలో ఉన్నది. వారి నివాళిగా ఆ ప్రదేశాన్ని మరింత అభివృద్ధి చేయవలసి ఉంది.


logo