శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jun 14, 2020 , 00:03:06

గాజు రెక్కల తూనీగ

గాజు రెక్కల తూనీగ

వీధుల్నిండా నిశ్శబ్దం ప్రవహిస్తుంటుంది

నగరపు పొడారిన పెదాలపైనుంచొక 

నిర్లిప్తగీతం

సన్నగా రోజూ జారుతుంటుంది

మనిషి మనిషికి ఎదురుపడ్డం

ఇక్కడొక అరుదైన దృశ్యం

ప్రక్కప్రక్క ఇళ్లన్నీ

శూన్యమనే కృష్ణబిలంలో 

సడిలేక పడివుంటాయి

ప్రేమగా పలకరించుకోవడం

మెత్తగా నవ్వుకోవడం 

పెద్దగా అలవాటులేని నగరంలో

పల్లెల్లోంచి వచ్చిన 

పచ్చని సీతాకోకచిలుకలు

ఉక్కిరిబిక్కిరవుతుంటాయి

పాడడం మర్చిపోయిన పక్షుల

సగం విరిగిన రెక్కల టపటపలే

గొప్ప సంగీతంగా కీర్తించబడుతుంది

ఏకాంతం

మర్రిచెట్టు ఊడలా ఇళ్లంతా వ్యాపించి

వెర్రిగా నవ్వుకుంటుంది

వారాంతపు ఆతృతలో

నగరం 

విచ్చలవిడిగా ఊగిపోతుంటుంది

సౌఖ్యాలూ సౌకర్యాలూ

విరగకాసిన మహానగరంలో

అంతెత్తున నిలబడ్డ 

ఆకాశహార్మ్యాల నీడల మధ్య

జీవితం మాత్రం

ఎప్పటికీ గాజు రెక్కల తూనీగే!logo