ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 13, 2020 , 00:23:31

అప్పుడు భూమి ఉండీ కూలోన్ని... ఇప్పుడు మారాజును..

అప్పుడు భూమి ఉండీ కూలోన్ని... ఇప్పుడు మారాజును..

గలగలా పారేటి గంగమ్మ తల్లి రంగనాయకుల గుట్ట చెంతకు చేరింది. గంగమ్మ అలల సప్పుడు ఇనవడినప్పుడల్లా గతం గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతుంది.

నాకున్నది పన్నెండెకురాల భూమి. ఈ భూమిని సాగు చేసేందుకు నేను వడ్డ తిప్పలు కొన్ని కాదు. 1984ల.. ఆల్లీల్ల దగ్గర మిత్తికి పైసల్‌ తెచ్చి ఏడాదికో బోరేసిన. ఆ కాలంల లక్షా, రెండు లక్షల దాకా అప్పయ్యింది. బోరేసుడుండటే 50 పీట్లో, అరువై పీట్లో అనుకునేరు. ఏ బోరు కూడా 300 పీట్లకు తక్కువెయ్యలేదు. ఒక్క బోరుల కూడా సక్కగా నీళ్లు వల్లే.. మొత్తం ఐదు బోర్లేసిన, ఒకదాంట్లనయితే ఇంచున్నర మందమే నీళ్లు వడ్డయ్‌. ఆ నీళ్లతోటి ఒక్క నారుమడి కూడా తడువకపొయ్యేది. నీళ్లచ్చుడు లేదు, పంట వండేది లేదు. అప్పులోల్లు ఇజ్జతిమానం తీసుడు... ఇజ్జతికి సావలేక అప్పులోల్లకు తిరుగు కాయిదాలు కూడా రాసిచ్చిన రోజులు. కొన్నొద్దులైతే సిద్దిపేట్ల సుతారీ పన్జేసిన. రోజుకు మూడు రూపాల కైకిలి. ఆ కాలంల చిన్నప్పుడే పెండ్లి చేసేటోళ్లు.. ఇరువై ఏండ్లప్పుడు పెండ్లయింది. నేనొక్కన్ని బతుకుడే కట్టంరా అయ్యా అంటే ఇప్పుడు నాకో దంటను తల్గవెట్టిర్రు. ఎవుసాన్ని నమ్ముకుంటే కట్టిరుగది, పాము సావదని అర్థమైంది. ఇగ వలస పోవుడే దిక్కనుకొన్న. అప్పుడు నాకు 21 ఏండ్లు. పట్నం పోయినం ఇద్దరాలుమొగలం. పద్నాలుగేండ్లు పట్నంల చేపల మార్కెట్ల అమాలీ పన్జేసిన. అక్కన్నే మాకు ముగ్గురు పిల్లలు పుట్టిర్రు. కొన్నొద్దులు బతుకు బండిని నెట్టుకొచ్చినంక పట్నంల అమాలీ పని కూడా కరువైంది. ఇగ వేరే దిక్కు లేక మళ్లా సుతారి పనే చేద్దామనుకొని రెండు వెయ్యిల సంవత్సరంల ఇంటిబాట వట్టినం. 

అప్పుడు మన రాష్ర్టానికి చంద్రబాబు ముఖ్యమంత్రి. కరెంటు లేదు, కాల్వ లేదు, చెరువుల్లేవు, తాగనీకి నీళ్లు కూడా లెవ్వు. చేదబాయిలల్ల నీళ్లు చేదుకచ్చుకొని తాగుదుం. నాదొక్కని బాధే కాదు, ఇమామ్‌బాద్‌ మొత్తం అదే బాధ. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అప్పుడు మాకు ఎమ్మెల్యే. ఆయన మాకు ఎమ్మెల్యే అయినంకనే నల్లా నీళ్లను చూసినం. హైదరాబాద్‌ల చూసిన నల్లాను మళ్లా మా ఊళ్లే చూసిన. మన రాష్ట్రం మనకచ్చింది. ఇప్పుడు మా భూమినానుకొనే రంగనాయకుల సాగర్‌ డ్యాం పడ్డది. ఈ డ్యాం ఇక్కడ వడుడు మాకు శానా అదృష్టం. మేం ఏ జన్మల చేసుకున్న పుణ్యమో. ఈ రంగనాయకుల సాగర్‌ల నా మూడెకరాల భూమి పోయింది. అయినా పర్లేదనుకొని శానా సంతోషంగిచ్చిన. ఒక్క మూడెకురాలే కాదు, సిద్దిపేట నుంచి సిరిసిల్లకు, రంగనాయకుల సాగర్‌ గుట్ట మీదికి, రంగనాయకుల సాగర్‌నుంచి పట్నం వొయ్యే తొవ్వ కోసం 20 గుంటల భూమి కూడా ఇచ్చిన. ఈ భూమి ఇయ్యడానికి కారణం హరీశ్‌రావు సార్‌. ఓ రోజు ఆయనొచ్చి ‘ఏం సంగతే... జనార్దనన్నా ఎట్లున్నవే, అంత మంచిదేనా?’ అనుకుంటా మందలిచ్చిండు. ముచ్చట వెట్టుకుంటనే రంగనాయకుల సాగర్‌ ప్రాజెక్టు గురించి, దానికి వొయ్యేటందుకు తొవ్వ గురించి చెప్పి, భూమి నువ్వియ్యాల్నే, నువ్వొక్కనివి త్యాగం జేత్తే ఎంత మంది రైతులు సంతోషంగుంటరో చెప్పిండు. ఉత్తగేం ఇయ్యకు, నువ్వు భూమిస్తే ప్రభుత్వం నిన్ను తప్పక ఆదుకుంటదని మాటిచ్చిండు. ఆయన మాట నేను జవదాటలె. హరీశ్‌ సారన్నా, కేసీఆర్‌ సారన్నా నాకు మస్తు నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యలె వాళ్లు. మూడెకరాల కింద ఎకరానికి ఆరు లక్షల యాభై వేల సొప్పున మొత్తం 19 లక్షల యాభై వేలు ఒక్కటేమొకాన అచ్చినయ్‌. ఈ తొవ్వకిచ్చిన 20 గుంటల బదులు ఇంకో దగ్గర ఇరువై గుంటల భూమే అడిగిన. ఇస్తమని కాయితం కూడా రాసిచ్చిర్రు. అది కూడా వస్తదనే నమ్మకం ఉంది. ఎందుకంటే సార్లమీద ఎంత నమ్మకమో చెప్పిన గదా.

ఇప్పటి ముచ్చట సూద్దాం. రంగనాయకుల సాగర్‌ల వోయిన భూమి సంగతి పక్కనవెడితే ఇంకా ఎనిమిదెకరాలపైనే ఉన్నది. పండుక్కో, పబ్బానికో, పెండ్లికో, పేరంటానికో సుట్టాలు పిలిస్తే కూడా పోం. మాకు మా పొలం దగ్గరికి వోతనే తుర్తయితది. తెల్లారి లెవ్వంగనే పొలం కాడికొస్తం. ఇరువై నాలుగు గంటలు నీళ్ల సప్పుడే ఇంటున్నం. నీళ్లెక్కువున్నయ్‌ కావట్టి సలికాలంల సన్‌ఫ్లవర్‌ పండిస్తున్న. ఒక్క ఎకురంల అయితే ఎప్పటికీ కూరగాయలుంటయి. మాకు కూరగాయలే జీవనాధారం. అందుకే పుదీనా, కొత్తిమీర, పాలకూర, గంగవాయిలి కూర, సుక్క కూర, ఆనిగపు కాయలు పండిస్తా. మొన్నటిదాకా మక్క ఎక్కువ పండించేది. కానీ, మొన్న కేసీఆర్‌ సార్‌ సన్నరకాల వరి పండియ్యిమన్నడు గదా. ఐదెకరాలకు సరిపోయే సన్నరకాల వడ్లు మండె పోసిన. రేపో మాపో నారు మడి, అలుకుత కూడా. కందులు, పత్తి కూడా ఏసే టైమొచ్చింది. అవిసుత పండిస్తా. రంగనాయకుల సాగర్‌ ప్రాజెక్టు చేయవట్టి ఇంటిల్లిపాది సంతోషంగున్నం. మా ఇద్దరాలుమొగలతోడు, ఎప్పటికీ నా శేన్ల నలుగురైదుగురాడోళ్లు పన్జేస్తరు. ఒకప్పుడు నేనొకనిదగ్గర పన్జేసేది. ఇప్పుడు మారాజు లెక్కున్న. నాకేం తక్కువ!

- అక్షరీకరణ: గడ్డం సతీష్‌


logo