మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jun 13, 2020 , 00:23:42

తల్లి తెలంగాణ ప్రార్థన

తల్లి తెలంగాణ ప్రార్థన

వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ

వరదాయని సుమధారిణి వఱలు కల్పవల్లీ /వందనమిదె/

శృంఖలాలు ఛేదించిన శూర ధీర నీవమ్మా

పంటసిరుల పొంగించే బతుకమ్మవు నీవమ్మా

కృష్ణమ్మను కొంగువేసి గోదావరి నడికట్టుగ

మంజీరగ మానేరుగ మమ్ము గాచు మా తల్లీ /వందనమిదె/

శాతవాహన రాజ్య సిరిపొలము నీ చీర

కాకతీయ వైభవమది ఘనమైన మకుటమ్ము

అమరవీరుల రుధిరమె అలరారే పారాణి  

ఆది తెలుగుల చరిత అవతారమె నీవూ /వందనమిదె/

సోమనాథుని జానుతెనుగు తేనెల జాలు

పోతన్న భాగవత పూదేనె మధురిమలు

మల్లినాథయ వ్యాఖ్య యశోభూషణ యశము

కావ్యాలు శాస్ర్తాలు కళలు విరిసిన గడ్డ /వందనమిదె/

యాదాద్రి నరసన్న ఏడుపాయల దుర్గ

భద్రాద్రీ రామయ్య బాసరలో చదువులమ్మ

కొండగట్టు అంజన్న కొరివిలోన వీరభద్ర

కోరి కొలుచు దేవుళ్ళు కొలువుందురు నీలోనే /వందనమిదె/

రామప్ప ఉలి కళలు రాగ రాగిణి చెలువు

వేయి స్తంభాల గుడి ఏకశిల నగర సిరి

చార్మినారు భాగ్యలక్ష్మి చేయిచేయి కలుపు నేల

బౌద్ధజైనఇస్లాములు పరిఢవిల్లిన నేల 

శిల్పకళ వాస్తు కళ చెలవొందిన దీనేల /వందనమిదె/

ఆ చరిత ఆ ఘనత ఆ స్ఫూర్తి ఆ కీర్తి

ఆ కళల అనురక్తి ఆ అక్షర ఘనశక్తి

ఆ పంట సిరులన్ని అమరి చెలువొందగా

పాలుపొంగిన రీతి మమ్ముల నడుపవె తల్లి /వందనమిదె/
logo