సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Jun 12, 2020 , 00:14:40

అందరికీ ఆదాయ ఫలాలు

అందరికీ ఆదాయ ఫలాలు

గ్రామీణ ఉపాధి పథకానికి, ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం నిధులు పెంచడంసమంజసమైనదే. వీటికి పెట్టే ఖర్చు కన్నా ప్రయోజనాలే అధికం. ఈ రెండు మూల స్తంభాలను ఆసరా చేసుకొని సామాజిక భద్రతా వ్యవస్థను మరింత విస్తృతపరుచవలసిన అవసరం ఉన్నది. దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి ఈ రెండు సరిపోవు. మూడవ స్తంభం అవసరం ఉన్నది.

కరోనాను కట్టడి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని పేద ప్రజల జీవనంపై పెద్ద దెబ్బ పడింది. చాలామంది ఆదాయం పడిపోయింది. కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. దీంతో పేదలకు సామాజిక రక్షణ అవసరమని అంగీకరించిక తప్పదు. ఈ కోణంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది. కానీ అవి సరిపోవు. సామాజిక భద్రతా చర్యలు తీసుకోవడం కేవలం పేదలను  ఆదుకోవడం కోసమే కాదు, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం సాధ్యపడుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థ సార్వత్రిక నగదు బదిలీ మొదలైన పథకాల వల్ల ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుతుంది. వస్తువుల డిమాండ్‌ పెరుగుతుంది. మార్కెట్‌ వైఫల్యాన్ని చక్కదిద్దడానికి దోహదపడుతాయి. తద్వారా రుణాల అందుబాటు పెరుగుతుంది. మార్కెట్లోకి ధైర్యంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజా పంపిణీ వ్యవస్థ-2 సామాజిక భద్రతకు రెండు మూలస్తంభాల వంటివి. ఒకటి ఉపాధి హామీనిస్తే మరొకటి ఆహార భద్రతను ఇస్తుంది. జీడీపీలో ఉపాధి హామీ పథకం వల్ల 0.5 శాతం, ఆహారభద్రత పథకం వల్ల ఒక శాతం ఉంటుంది. ఈ పథకాల వల్ల ప్రజా ధనం వృథా తప్ప, ప్రయోజనం ఉండదని కొందరు అంటుంటారు. ఉత్పత్తి పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలె తప్ప, ఇటువంటి ఉపాధి హామీ పథకాల వల్ల ప్రజయోనం ఉండదనే అభిప్రాయం బలంగా ఉన్నది. అయితే ఈ ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ పేదరికం తగ్గిందని విస్తృత అధ్యయనంలో తేలింది. గ్రామీణ ఉపాధి, వేతనాలు పెరుగడం వల్లనే ఆదాయాలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతంలో ఆస్తులు, రుణాలు వ్యవసాయేతర వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. సామాజిక భద్రతా పథకాల ద్వారా పేదల ఆదాయాలు పెరిగితే ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావాలుంటాయి. ఆహార ధాన్యాల ధరలు పెరిగినప్పుడు, ప్రజా పంపిణీ వ్యవస్థ వల్ల సామాన్యులు తట్టుకోగలుగుతారు. పౌష్ఠికాహారం లోపం కూడా తొలిగిపోతుంది. ఈ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆర్థిక పెరుగుదలకు దోహదపడుతుంది.

గ్రామీణ ఉపాధి పథకానికి, ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం నిధులు పెంచడాన్ని సమంజసమైనదే. వీటికి పెట్టే ఖర్చు కన్నా ప్రయోజనాలే అధికం. ఈ రెండు మూలస్తంభాలను ఆసరా చేసుకొని సామాజిక భద్రతా వ్యవస్థను మరింత విస్తృత పరుచవలసిన అవసరం ఉన్నది. దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి ఈ రెండు సరిపోవు. మూడవ స్తంభం అవసరం ఉన్నది. సామాజిక నగదు బదిలీ వంటి పథకం వల్ల పేదరికం తగ్గడమే కాకుండా ఆర్థిక పురోగతి సాధ్యపడుతుంది. ప్రత్యక్ష ఆదాయ బదిలీ పథకానికి ఈ మధ్య మద్దతు పెరుగుతున్నది. 2016-17 ఆర్థిక సర్వే కూడా సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) పథకాన్ని ప్రతిపాదించింది. ఆర్థిక సంక్షోభం పెరుగుతుండటంతో ఇలాంటి ప్రతిపాదనలు మళ్లీ ముందుకువస్తున్నాయి. నిర్వహణలో లోపాలుండవు. ఆదాయ బదిలీ పథకం వల్ల పేదలకు ఉపయోగం ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. 

కొంతమంది వలసలను నిరోధించాలంటారు. నగరాలు అభివృద్ధి చోదకాలు. నగరాలకు చేరడం ద్వారా పేదరికం తొలిగిపోతుంది. ఐజీడీ మూలంగా వలసలను ప్రోత్సహించినట్టవుతుంది. దేశంలో ఎక్కడున్నా అందేవిధంగా సామాజిక భద్రతా వ్యవస్థను రూపొందించడం వల్ల వలస కార్మికులకు భరోసా ఏర్పడుతుంది. ఈ పథకం ముందే అమలులో ఉన్నట్టయితే లాక్‌డౌన్‌ సందర్భంగా వలసలు ఉండకపోయేవి.

దేశంలో సార్వత్రిక ఆదాయ బదిలీ పథకం ప్రాచుర్యం పొందకపోవటానికి కారణాలున్నాయి. కొంతమంది భారీ ఎత్తున నగదు బదిలీని సూచించారు. ఈ మొత్తం జీడీపీలో 3.5 నుంచి పది శాతం మేర ఉంటుంది. అయితే ప్రభుత్వ బొక్కసంపై భారం తగ్గించటానికి ఇప్పుడున్న సామాజిక భద్రతా పథకాలను రద్దుచేసి వాటి స్థానంలో ఈ నగదు బదిలీ పథకాలను ప్రవేశపెట్టాలని కొందరు సూచించారు. రాజకీయపరంగా చూస్తే, ఇది సాధ్యమయ్యేది కాదు. పైగా ఇప్పటికే అమలులో ఉన్న రెండు సామాజిక భద్రతా పథకాలు ఎంతో ఉపయోగకరమైనవని అధ్యయనాల్లో తేలింది. అందువల్ల  ఆదాయ బదిలీ పథకం ద్వారా కొద్దిపాటి నగదును మాత్రమే చెల్లించాలి. ఈ నగదు బదిలీ ఇప్పుడున్న పథకాలకు అనుబంధమైనదే తప్ప ప్రత్యామ్నాయం కాదు. లాక్‌డౌన్‌ను  అమలు పరుస్తున్న ఇటువంటి తరుణంలో పేదలను ఆదుకోవడం,ఆర్థికవ్యవస్థను వృద్ధి చేసుకోవడం అనే రెండు లక్ష్యాలు నెరవేర్చుకోవాలి. ఇందులో ఒకటి తాత్కాలికమైనది అయితే రెండవది దీర్ఘకాలికమైనది. సార్వత్రిక నగదు బదిలీ పథకం వల్ల రెండూ నెరవేరుతాయి.

సార్వత్రిక ఆదాయ బదిలీ విధానాలు రెండు రకాలుగా ఉంటాయి. ఇందులో ఒకటి- సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌-యూబీఐ). రెండవది సమ్మిళిత అభివృద్ధి ఫలం (ఇంక్లూజివ్‌ గ్రోత్‌ డివిడెండ్‌- ఐజీడీ). సార్వత్రిక కనీస ఆదాయం అంటే, ఒక మనిషి జీవించడానికి అవసరమైనంత కనీస ధనం అందించడం. కానీ సమ్మిళిత అభివృద్ధి ఫలం అంటే- సార్వత్రికత, ప్రగతిశీలత, భాగస్వామ్య సంపద అనే లక్ష్యాలకు అనుగుణమైనది. కానీ పేదలకు సమ్మిళిత అభివృద్ధి ఫలం మరింత విలువైనది. మొత్తం ఆర్థికవ్యవస్థ వృద్ధితో పాటు జనాభా అంతటికి తమవంతుగా అందే ఫలం.

కుటుంబానికి నెలకు రూ.120 లేదా 500 బదిలీ చేస్తే పేదరికం కొంత తగ్గుతుంది, వారి వినియోగం పెరుగుతుంది. సార్వత్రి ఆదాయ బదిలీ వల్ల కొద్దిమంది ప్రజలకే లబ్ధి చేకూర్చినట్టుగా ఉండదు. దీనివల్ల భారతదేశ స్తోమత, విశ్వసనీయత వెల్లడవుతుంది. ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు అవకాశాల కోసం ప్రజలపై ఒత్తిడి పెరుగుతుంది. సామాజిక వైషమ్యాలు పెరిగి సంక్షోభం నెలకొంటుంది. ఈ ఐజీడీ వల్ల సామాజిక సంక్షోభం తలెత్తదు. కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన నేటి ఆర్థిక పరిస్థితికి ఐజీడీ అమలుచేయడం తగినట్టుగా ఉంటుంది. కేవలం పేదలను ఆదుకోవడమే కాదు, పటిష్టమైన సామాజిక భద్రతావ్యవస్థ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. 

కొంతమంది వలసలను నిరోధించాలంటారు. నగరాలు అభివృద్ధి చోధకాలు. నగరాలకు చేరడం ద్వారా పేదరికం తొలిగిపోతుంది. ఐజీడీ మూలంగా వలసలను ప్రోత్సహించినట్టవుతుంది. దేశంలో ఎక్కడున్నా అందేవిధంగా సామాజిక భద్రతా వ్యవస్థను రూపొందించడం వల్ల వలస కార్మికులకు భరోసా ఏర్పడుతుంది. ఈ పథకం ముందే అమలులో ఉన్నట్టయితే లాక్‌డౌన్‌ సందర్భంగా వలసలు ఉండకపోయేవి.

ప్రధాని మోదీ సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదం ఇచ్చారు. ఐజీడీని అమలు చేయడం అంటే దానికి వాస్తవరూపం ఇవ్వడమే. సార్వత్రిక అభివృద్ధి ఫలం (ఐజీడీ) మూలంగా పేదలకు ఉపశమనం లభించి ఆత్మవిశ్వాసం చేకూరుతుంది. డిమాండ్‌, ఉత్పత్తి కూడా పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక పునరుజ్జీవనం జరుగుతుంది. సామాజిక సౌహార్ద్రత కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక సంపద పెరుగుదలకు పునాదులు పడుతాయి.

(‘హిందుస్థాన్‌ టైమ్స్‌' సౌజన్యంతో)logo