ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 12, 2020 , 00:14:40

పిల్లల వికాసం కీలకం

పిల్లల వికాసం కీలకం

ప్రపంచ అభివృద్ధికి ప్రధాన ప్రాథమ్యాల్లో బాలకార్మిక వ్యవస్థను, బాలల అక్రమ రవాణాను నిర్మూలించడం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ సంపూర్ణ స్వేచ్ఛను సాధించకుండా ప్రపంచ అభివృద్ధిని గానీ, దేశ, రాష్ర్టాల అభివృద్ధినిగానీ సాధించలేం. తక్కువ వనరులున్న దేశాల్లో పేదరికం స్థాయి తీవ్రంగా ఉందని, అలాగే ఆయా దేశాల్లో బాల కార్మికుల సమస్య ఎక్కువగా ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక-2015 పేర్కొన్నది. కైలాశ్‌ సత్యార్థి చిల్డ్డ్రన్స్‌ ఫౌండేషన్‌ (కేఎస్‌సీఎఫ్‌) 2020 నివేదిక ప్రకారం భారతదేశంలో బాల కార్మికుల సమస్యకు విద్య లేకపోవడం ప్రధాన కారణంగా ఉన్నది. విద్య పూర్తిస్థాయిలో పిల్లలకు అందకపోవడం వల్ల బాలకార్మికుల సమస్య తీవ్రతను తగ్గించుకోలేకపోతున్నట్లు పేర్కొన్నది. 

ఫ్యాబ్రిక్‌, వ్యవసాయం, మైనింగ్‌, వస్త్ర పరిశ్రమ, ఇటుకబట్టి, కార్పెట్‌, నేత ఇతర పరిశ్రమలలో పెద్ద సంఖ్యలో పిల్లలు పనులలో నిమగ్నమై ఉన్నారు. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ర్టాల్లో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. బాల కార్మిక వ్యవస్థను దేశం నుంచి నిర్మూలించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం.. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) కన్వెన్షన్‌ 182, కన్వెన్షన్‌ 138 రెండింటినీ ఆమోదించింది. బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం, 1986ను సవరించారు. కొత్త జాతీయ ప్రణాళిక, పిల్లల కోసం జాతీయ విధానం అమలు చేయడానికి 2016లో రోడ్‌ మ్యాప్‌ రూపొందించినప్పటికీ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దిశలో అనుకున్న ఫలితాలు రావడం లేదు. ప్రామాణికంగా పనిచేయించే విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చినా, అందుకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో బాల కార్మికులు వివిధ పరిశ్రమలలో పనిలో మగ్గుతున్నారు.

జనాభా లెక్కల (2011) ప్రకారం భారతదేశంలో 5-14 ఏండ్ల లోపు బాలల సంఖ్య 25.96 కోట్లు. ఇందులో కోటీ పది లక్షల మంది (అంటే బాలల జనాభాలో 3.9 శాతం) రకరకాలుగా పనిచేస్తున్నారు. 4.27 కోట్ల మంది పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారు. దేశంలో బాలకార్మికుల సంఖ్య 2001-2011 మధ్య కొంత తగ్గుముఖం పట్టింది. బాల కార్మికుల పునరావాసానికి సంబంధించిన సమస్యలు కూడా తీవ్రస్థాయిలో ఉన్నాయి. బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ అధ్యయనం వివరాల ప్రకారం మొత్తం 1,151 మంది బాలకార్మికులను రక్షిస్తే కేవలం 524 మందికి మాత్రమే విడుదల సర్టిఫికెట్లు అందాయి. ఇప్పటివరకు వివిధ రాష్ర్టాల్లో ఉన్న ఈ పిల్లలలో ఎవ్వరికి కూడా ద్రవ్య పరిహారం అందలేదని కేఎస్‌సీఎఫ్‌-2019 పేర్కొన్నది.

కరోనా ప్రభావం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అంతటా తీవ్రమైన ఆర్థికఅవ్యవస్థకు దారితీస్తున్నది. ఈ మానవతా సంక్షోభం ఆర్థిక దుర్బలత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బాల కార్మికవ్యవస్థ, అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉన్నది. చీప్‌ లేబర్‌ కోసం డిమాండ్‌ తీవ్రతరమవుతుంది. సుస్థిరాభివృద్ధి సాధనలో భాగంగా 2021ను బాల కార్మికవ్యవస్థ నిర్మూలన సంవత్సరంగా ఐఎల్‌ఓ ప్రకటించింది. బాల కార్మికవ్యవస్థ నిర్మూలనలో కొన్ని కీలక చర్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆపై అంతరాలను గుర్తించి, విధానాలను సవరించాలి. సమర్థ ఉపశమన ప్రణాళికలను రూపొందించాలి. ప్రభుత్వసంస్థల పనితీరు, అమలును బలోపేతం చేయాలి. ఫలితంగా ఇంటర్‌-ఏజెన్సీ కన్వర్జెన్స్‌ కూడా వస్తుంది. పిల్లల సంపూర్ణ పునరావాసంపై దృష్టిని సారిస్తేనే అది సామాజిక ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది.

(వ్యాసకర్త: బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ రాష్ట్ర సమన్వయకర్త) (నేడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినం)logo