మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jun 11, 2020 , 00:12:39

పశు సంవర్ధనం

పశు సంవర్ధనం

మన శీతోష్ణ పరిస్థితుల్లో పెరిగే నల్లగొర్రె (దక్కనీ) జాతిని కాపాడేందుకు వనపర్తి జిల్లాలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ఇక్కడి పరిస్థితులకు తట్టుకుని నిలిచే లక్షణాలున్న దక్కనీ గొర్రెలు మాంసంతో పాటు ఉన్నికి పేరెన్నికగన్నవి.  మార్కెట్‌ పరిస్థితులను తట్టుకోవడానికి  మరింత ఎక్కువ మాంసం, నాణ్యమైన ఉన్ని లభించే జీవాలను అభివృద్ధి చేసేందుకు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సముచితమైన నిర్ణయం. తెలంగాణ అవతరణకు ముందు కూడా మన దగ్గర ఒకటి రెండు పరిశోధనా కేంద్రాలున్నప్పటికీ నిరాదరణకు గురయ్యాయి. మన దేశీయ నల్లగొర్రెను కూడా పట్టించుకోలేదు. దీంతో ఇవి అంతరించడం మొదలైంది. పరాయి పాలనలో తెలంగాణ సమాజమే కాదు, వృక్ష జంతుజాలం కూడా వివక్షకు గురయ్యాయి. స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి కానవస్తున్నది. 

రుచికర మాంసం, ఉన్నితోపాటు వ్యవసాయానికి ఎరువును ఇవ్వడంలో పూర్వం నల్లగొర్రెలు కీలక పాత్ర పోషించేవి. బ్రిటిష్‌ కాలం నుంచి 1980 దశకం వరకు భారత సైన్యం నల్ల గొర్రె ఉన్నితో చేసిన గొంగళ్లనే కొనుగోలు చేసేది. మంచుపర్వత శిఖరాలైనా, సరిహద్దులో ఎముకలు కొరికే చలిలోనైనా సైనికులకు దక్కనీ గొర్రెల ఉన్నితో చేసిన గొంగడి వెచ్చదనాన్ని ఇచ్చేది. వివాహం సందర్భంగా వరుడికి గొంగడిని కూడా పెట్టడం తెలంగాణలోని పలు సామాజిక వర్గాలలో ఆచారంగా ఉన్నది. గొర్రెనే కాదు, దేశీయ పశుగణంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టిసారించింది. కరువు పరిస్థితులను కూడా తట్టుకొని బతికే తూరుపు జాతి ఎద్దు లేదా ఆవు కిలోమీటరు దూరంలో ఉన్న నీటి వనరును పసిగట్టగలదంటారు. ఇరువై ఏండ్ల వయసు వరకు పనిచేయడం ఈ జాతి ప్రత్యేకత. అయితే పాల ఉత్పత్తిని పెంచడానికి పరిశోధనలు జరుగవలసి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్థానిక జీవ జాతులకు భద్రత, గుర్తింపు లభిస్తున్నది. 

తెలంగాణ అవతరణ తరువాత పశుగణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. రెండు విడుతలలో లక్షల గొర్రెలను ఉచితంగా పంపిణీ చేయడం అపూర్వం. గొర్రెల సంఖ్యలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. మాంసం ఉత్పత్తిలో ఒక ఏడాదిలోనే అరువైశాతం వృద్ధి సాధించడం అసాధారణమే. మాంసం తలసరి వినియోగంలో కూడా మన రాష్ర్టానిదే ప్రథమస్థానం. జాతీయ స్థాయిలో తలసరి వినియోగం 5.4 కిలోలు ఉంటే, మన రాష్ట్ర సగటు 9.2 కిలోలు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కేంద్ర ప్రభుత్వ పెద్దలే ప్రశంసించడం గమనార్హం. ఆహారం రంగంలో ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చుకునే దశను అధిగమించి వీలైతే విదేశాలకు ఎగుమతి చేసే స్థితికి మన రాష్ర్టాన్ని తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అవగాహన చేసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి వివిధ వర్గాల ప్రజలు ముందుకు రావాలి. 


logo