శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jun 11, 2020 , 00:12:40

చేతులెత్తేసిన కేంద్రం

చేతులెత్తేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా రోజూ సగటున తొమ్మిదివేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో సింగపూర్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, రష్యా, జర్మనీ, చైనాల వలె సడలింపులను రద్దుచేసి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలుపరిస్తే కరోనా విస్తృతికి అడ్డుకట్ట పడేదేమో. కానీ కేంద్ర ఆదేశాల ప్రకారం ఆంక్షలను మరింత సడలించారు.

దేశవ్యాప్తంగా గత రెండువారాల్లో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య అరవై ఐదు శాతానికిపైగా పెరుగడం ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నవారి సంఖ్య లక్షా ముప్ఫై మూడు వేలు దాటింది. ప్రాణాలు కోల్పోయినవారు 7700పైనే.గత మూడునెలల్లో చికిత్స పొంది ఆరోగ్య వంతులైన వారు దాదాపు 1,35,205 మంది. రోగనిరోధక శక్తివల్ల వీరంతా ఆరోగ్యంగా ఉన్నారు. 

గత పది రోజుల్లో దేశవ్యాప్తంగా రోజూ సగటున తొమ్మిదివేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో సింగపూర్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, రష్యా, జర్మనీ, చైనాల వలె సడలింపులను రద్దుచేసి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలుపరిస్తే కరోనా విస్తృతికి అడ్డుకట్ట పడేదేమో. కానీ కేంద్ర ఆదేశాల ప్రకారం ఆంక్షలను మరింత సడలిస్తూ దేవాలయాలు, ప్రార్థనాస్థలాలు, షాపింగ్‌మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లను జూన్‌ 8 నుంచి తెరిచారు. లాక్‌డౌన్‌ 5వ దశలో విదేశీ విమానయానం, మెట్రో రైళ్లు, సినిమాహాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, సమావేశాలు, బార్లు మొదలైనవాటిపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు.

నెలలకొద్దీ లాక్‌డౌన్‌ వలన పేదలు, దినసరి కూలీలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమల వారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనేది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. కూలీలు, పేదలకు కనీసం ఆరునెలలైనా తిండిపెట్టలేని స్థితిలో భారత ప్రభుత్వం ఉందా? తొలి దశ లాక్‌డౌన్‌ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు సుమారు 10 లక్షల కోట్ల మేర హెలికాప్టర్‌ మనీ పేదల అకౌంట్లలో జమ చేస్తే (వివిధ లాక్‌డౌన్‌ దశల్లో) కరోనాను కొంతయినా ఆపగలిగే వారం.  ప్రభుత్వం కరోనా సహాయం పేరుతో ప్రకటించిన డబ్బు కూడా రాష్ర్టాలను, ప్రజలను నిరుత్సాహపరిచింది. దాదాపు అన్ని దేశాలు ప్రజల అకౌంట్లలో నేరుగా డబ్బు జమచేసినాయి. ఒక్కో కుటుంబానికి నెలనెలా తెలంగాణ ప్రభుత్వం రూ.1500, వలస కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 అకౌంట్లలో జమచేసింది. ప్రజలకు కేంద్రం అందించిన సహాయం నామమాత్రమే. 

ప్రజలను, రాష్ర్టాలను గాలికి వదిలేసిన కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నివారణ విషయంలో కూడా చేతులెత్తేసి ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ శరణ్యమని పరోక్షంగా సంకేతాలిస్తున్నది. కరోనా వ్యాక్సిన్‌ ఏడు నెలల్లో అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు, బయోటెక్‌ పరిశ్రమల వారు ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్‌ లేకుండా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యపడదని ప్రపంచ నిపుణులంతా దాదాపు ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇంగ్లండ్‌ మొదట్లో హెర్డ్‌ ఇమ్యూనిటీపై ఆశపెట్టుకున్నది. కానీ ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు, రాజకుటుంబీకులకు వైరస్‌ సోకడం, దినదినానికి పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో, వైద్యసదుపాయాలు అందించటంలో విఫలం కావటంతో చివరికి ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’పై ఆశలను వదులుకొని లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేసింది. ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేశ్‌కుమార్‌ వ్యాక్సిన్‌ ఇస్తేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమవుతుంది అని అభిప్రాయపడ్డారు. ‘ఏఐఐఎంఎస్‌'లో వైద్యనిపుణులు డాక్టర్‌ ప్రసూన్‌ ఛటర్జీ ‘ప్రభుత్వాలకు సలహాలిచ్చే మేధావులు ఎందుకు హెర్డ్‌ ఇమ్యూనిటీ గురించి ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు’ అని విచారం వ్యక్తం చేశారు. 

మన దేశంలో మరణాల రేటు మూడు నుంచి ఐదు శాతం ఉన్నది. యువతలో సగం మందికి కరోనా వైరస్‌ సోకినా సుమారు రెండు కోట్ల మంది మృత్యువాత పడకతప్పదు. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ భ్రమలో ఇంతమందిని పోగొట్టుకోవటం విజ్ఞత అవుతుందా?పేద ప్రజలను ఆదుకునేలా, ఆర్థిక వ్యవస్థను నిలకడగా ఉంచేలా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చాలి. 


ఒక వ్యక్తిలో ఉన్న రోగ నిరోధక శక్తిని ఇమ్యూనిటీగా ఒక గుంపు లేదా కమ్యూనిటీ ప్రజల రోగ నిరోధక శక్తిని ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’గా వ్యవహరిస్తారు. ఒక్కో మనిషి ఆహారపు అలవాట్లపై, శరీర వ్యాయామంపై, ఆరోగ్యస్థితిపై ఆ వ్యక్తి రోగనిరోధక శక్తిని అంచనా వేస్తారు. సాధారణంగా యువకుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. 50 ఏండ్లలోపు వయస్సు వారు దేశంలో 82శాతం ఉండగా, 50-59 ఏండ్ల వయస్సు వారు 8శాతం, 60 ఏండ్లకు పైబడినవారు కేవలం పదిశాతం మాత్రమే ఉన్నారు. పదేండ్లలోపు, 60ఏండ్లకు పైబడ్డ వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. యువతలో ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ని తేగలిగితే పిల్లలనూ, వృద్ధులనూ వైరస్‌నుంచి కాపాడవచ్చు. రోగనిరోధక శక్తి బాగా ఉన్న వ్యక్తికి కరోనా వైరస్‌ సోకితే అతని శరీరంలో వైరస్‌ చైన్‌ ముక్కలై బలహీన పడుతుంది. ఆ వ్యక్తి ద్వారా వృద్ధులకు, పిల్లలకు సోకినా ఆ వైరస్‌ వారినేమీ చేయలేదు. 

నిపుణులు చెప్తున్నదాన్ని బట్టి ఒక్కో జబ్బును నివారించటానికి ఒక్కో పద్ధతి ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ అవసరమవుతుంది. తట్టు లేదా పొంగు వ్యాధి విషయంలో గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందటంతో ఒక వ్యక్తి నుంచి సుమారు 20 మందికి వైరస్‌ సోకేది. వ్యాక్సిన్‌ కనిపెట్టిన తర్వాత జనాభాలో 90శాతం మందికి వ్యాక్సినేషన్‌ చేయడంతో ఆ వ్యాధి నివారణ సాధ్యమైంది. ఫ్లూ వైరస్‌ సోకినప్పుడు ఒక వ్యక్తి నుంచి 1.3 శాతం మందికి విస్తరించటంతో 25శాతం ప్రజల్లో వ్యాక్సిన్‌ ద్వారా ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ అభివృద్ధి చేయటంతో ఫ్లూ నివారణ సాధ్యపడింది. కొవిడ్‌-19 వైరస్‌ ఒక్కరి నుంచి ఇద్దరి నుంచి ముగ్గురికి వ్యాపిస్తున్నది. కనీసం 60 శాతం జనాభాకు వ్యాక్సిన్‌ ఇవ్వటం ద్వారా ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ని పెంచితే కరోనా వైరస్‌ను అడ్డుకోగలమని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులో లేనప్పుడు ఈ 60 శాతం మంది కరోనా వైరస్‌ బారిన పడే ప్రమాదముంది. మనదేశంలో శ్వాసకోశ వ్యాధులతో, డయాబెటిస్‌, ఇతర జబ్బులతో ఉన్నవారు ఎక్కువే. జంక్‌ఫుడ్‌ తినడం, వ్యాయామం చేయకపోవటం తదితర కారణాలతో రోగనిరోధక శక్తి యువతలో కూడా తక్కువే. వీరు వైరస్‌ బారిన పడితే కోలుకోవటం కష్టమే. మరణాల రేటు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉన్నది. మన దేశంలో మూడు నుంచి ఐదు శాతం ఉన్నది. యువతలో సగం మందికి కరోనా వైరస్‌ సోకినా సుమారు రెండు కోట్ల మంది మృత్యువాత పడకతప్పదు. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ భ్రమలో ఇంతమందిని పోగొట్టుకోవటం విజ్ఞత అవుతుందా?

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేదాకా పేదలను ఆదుకునేలా, ఆర్థిక వ్యవస్థను నిలకడగా ఉంచేలా కేంద్రం రాష్ర్టాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చాలి. లేకుంటే ఫెడరల్‌ స్ఫూర్తికి అర్థం లేదు. కరోనా వచ్చేలోపు కనీసం రోగనిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి లేదా దిగుమతి చేసుకొని రాష్ర్టాలకందించాలి. తమిళనాడు హైకోర్టు ఆదేశించినట్లు ఆయుర్వేద వైద్యంతో కరోనా బాధితులను నయం చేయటానికి అనుమతించాలి. నాలుగువేల ఏండ్ల క్రితమే రాసిన ‘చరక సంహిత’లో వివిధ వైరస్‌ నివారణలకు సూచనలున్నాయి. లక్షమంది కరోనా బాధితులకైనా వైద్య సేవలందించటానికి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయటం ప్రజలకు భరోసానిస్తున్నది.

(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకుడు)logo