గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jun 09, 2020 , 00:28:13

దౌత్యంతోనే చైనా కట్టడి

దౌత్యంతోనే చైనా కట్టడి

సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత ఘర్షణగా మారకుండా జాగ్రత్తపడాలనే ధోరణిని భారత్‌, చైనా దేశాలు రెండూ ప్రదర్శించడం హర్షణీయం. వాస్తవాధీన రేఖ దగ్గర రెండు దేశాల సైన్యాలు మోహరించి ఉన్నాయి. శుక్రవారం నాడు రెండు దేశాల విదేశాంగ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ తరువాత శనివారం ఇరు దేశాల ఉన్నత స్థాయి సైనికాధికారులు పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితిలో మార్పు లేనప్పటికీ సుహృద్భావాన్ని నెలకొల్పాలనే దృఢ నిశ్చయాన్ని రెండు దేశాలు వ్యక్తం చేశాయి. రెండు పక్షాలు సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరిపి సరిహద్దులో శాంతిని నెలకొల్పుతాయని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. చైనా నుంచి కూడా సోమవారం ఇటువంటి సానుకూల ప్రకటనే వెలువడింది. అయితే ఇటువంటి అంశాలు వెంటనే తేలవనీ, కొన్ని నెలలపాటు చర్చలు కొనసాగుతాయని విదేశాంగ వర్గాలు అంటున్నాయి. 

చైనాతో సరిహద్దు ప్రాంతంలోని కొన్ని చోట్ల రెండు వైపులా సైనిక మోహరింపులతో ఉద్రిక్తత నెలకొన్నది. లడాఖ్‌ తూర్పు ప్రాంతంలో నాలుగు చోట్ల, గాల్వాన్‌ లోయ ప్రాంతంలో మూడు చోట్ల, పాంగ్‌కాంగ్‌ సరస్సు దగ్గర ఒకచోట చైనా తమ సైనికులను భారీ ఎత్తున మోహరించింది. ఇందుకు దీటుగా భారత్‌ కూడా ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధం చేయగలిగే దళాలను వాస్తవాధీన రేఖ సమీపానికి తరలించింది. రేఖకు అవతలి వైపున చైనా సైనిక శిబిరాలకు అన్నిటికీ పటిష్ఠమైన రహదారి సౌకర్యం ఉన్నది. ఇవతలి వైపున భారత్‌ కూడా అదే రీతిలో రహదారులను నిర్మిస్తుండటంతో, చైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నది. సైనిక బలగాలను తరలించి బల ప్రదర్శనలు చేస్తున్నది. గత నెల ఐదు- ఆరవ తేదీ ప్రాంతంలో ఇరు దేశాల బలగాల మధ్య చిన్న ఘర్షణ కూడా జరిగింది. అయితే రెండు వైపులా సైన్యాలు ఘర్షణ పెరుగకుండా సంయమనం పాటించాయని తెలుస్తున్నది.  

తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం, రష్యా, జపాన్‌, భారత్‌తో సరిహద్దు విభేదాలు, అమెరికాతో వాణిజ్యం- మొదలైన ఏ వివాదంలోనైనా చైనా ఎదుటి పక్షం బలబలాలు, లాభనష్టాలు, సందర్భాలను బట్టి కచ్చితమైన అంచనాతో వ్యవహరిస్తుంది. మన దేశం కూడా చైనాతో వ్యవహరించడంలో అసాధారణ దౌత్యనీతిని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ కాలంలో సైనిక బలాన్ని మాత్రమే నమ్ముకునే పరిస్థితి లేదు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నది. జపాన్‌, ఆస్ట్రేలియాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నది. అమెరికాతో కూడా సన్నిహితంగా ఉంది. మన దేశంలో చైనాకు వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వివిధ వ్యూహాలతో చైనాను కట్టడి చేయాలి. 1962 నాటి పరిస్థితి ఇప్పుడు లేదని చైనాకు అర్థం చేయించాలి. వాస్తవాధీన రేఖ ప్రాంతంలో యథాతథ స్థితి కొనసాగాలన్న భారత్‌ వాదన సమంజసమైనది. బలమైన పొరుగు దేశంతో యుద్ధానికి దిగాలన్న భావన భారత్‌కు ఎప్పుడూ లేదు. అయినా చొరబాట్లను సహించదనేది స్పష్టం. 

తాజావార్తలు


logo