ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Jun 09, 2020 , 00:28:12

ఫలించిన స్వప్నం

ఫలించిన స్వప్నం

1950 దశకంలో ప్రారంభమైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ఆంధ్ర పాలకులు చేసిన అనేక ప్లానింగ్‌ లోపాలు మనకు శాపాలుగా మారాయి. దీనికి తోడు కాకతీయ కాలువ సామర్థ్యం 6,000 క్యూసెక్కులే. దిగువ మానేరు జలాశయం 25 టీఎంసీ నిండాలంటే కొన్ని నెలలపాటు కాలువ ప్రవాహం ఉండాలి. ఇలా చెప్పుకొంటూపోతే జాబితా అనంతం. ఇవన్నీ ఆంధ్రపాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలు.

కేసీఆర్‌ గారికి తెలంగాణ నీటి ప్రాజెక్టులు చిరకాల స్వప్నాలు. నేను 2004లో ఆర్డీవోగా ఉన్నప్పుడు ఒక అద్భుత ఆవిష్కరణను చూశాను. అది దిగువ మానేరు జలాశయం ద్వారా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు సరఫరా కావడం. నేరెళ్ల నియోజక వర్గంలోని మోహినకుంట గ్రామంలోని మహిళలు పక్కనే కనిపిస్తున్న సిద్దిపేట నియోజకవర్గ గ్రామం నుంచి నల్లాల నీళ్లు బిందెల ద్వారా తెచ్చుకుంటున్నారు. పక్కపక్కనే ఉన్న గ్రామాల ప్రజల్లో ఎంత తేడా! మేమేమో సిరిసిల్ల, నేరెళ్ల నియోజకవర్గాలలోని పలు  గ్రామాలకు ట్యాంకర్‌ ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నాం. అక్కడ 2004-2006 సంవత్సరాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. ట్యాంకర్లు లేటైతే మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నాలకు దిగుతున్నారు. ప్రతిరోజు ఒక యుద్ధభూమిలో ఉన్నట్టుగా మేం, గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ సిబ్బంది పరుగులు పెట్టేది. రోజూ డయల్‌ యువర్‌ ఆర్డీవో కార్యక్రమాలు నడపాల్సి వస్తున్నది. పక్కన సిద్దిపేట నియోజకవర్గ ప్రజల జనజీవనం సాఫీగా ఉన్నది.

దిగువ మానేరు ద్వారా నీళ్ల పైపులు గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల గుండా సిద్దిపేట ప్రాంతానికి పోతున్నాయి. విషయం అర్థమైన కొన్ని గ్రామాల ప్రజలు అప్పట్లో పైపులు బద్దలు కొట్టేవాళ్లు. మా గ్రామాల ద్వారా నీళ్లు పోతున్నాయి, మాక్కూడా నీళ్లివ్వండి అనే అభ్యర్థన న్యాయమైనదే. కానీ అంత పెద్ద ప్రాజెక్టులు అధికారులుగా మేం ఇచ్చేవి కావు. అలాంటివి సాకారం కావాలంటే రాజకీయ నాయకత్వ పట్టుదల అవసరం. ప్రస్తుతం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్‌ భగీరథ ద్వారా యావత్‌ తెలంగాణలోని 119 నియోజకవర్గాలు సిద్దిపేటలుగా మారాయి. 

ఆంధ్ర పాలనలో అన్ని ప్రాజెక్టులు కలిసి 100 టీఎంసీలు కూడా దాటలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలోనే సుమారు 200 టీఎంసీలకు పైగా సాగునీరు మన భూముల్ని సస్యశ్యామలం చేయబోతున్నది. ఇంత గొప్ప చరిత్రలో నేను సైతం అని చెప్పుకోతగిన అవకాశం నాకు రావడం పూర్వజన్మ సుకృతం. తెలంగాణ గురించి మాట్లాడినందుకు ఉద్యోగ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మావంటి వారికి మన నీళ్లు, మన వనరులు, మన నిధులు అనే ఆకాంక్ష వాస్తవరూపం దాల్చడం సంతృప్తిగా ఉంది. 

ప్రాజెక్టుల విషయానికొస్తే, ముందుగా శ్రీరాంసాగర్‌ వరద కాల్వ, మధ్య మానేరు గురించి మాట్లాడుకోవాలి. 1950 దశకంలో ప్రారంభమైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ఆంధ్ర పాలకులు చేసిన అనేక ప్లానింగ్‌ లోపాలు మనకు శాపాలుగా మారాయి. దీనికి తోడు కాకతీయ కాలువ సామర్థ్యం 6,000 క్యూసెక్కులే. దిగువ మానేరు జలాశయం 25 టీఎంసీ నిండాలంటే కొన్ని నెలలపాటు కాలువ ప్రవాహం ఉండాలి. 2016 సెప్టెంబర్‌లో కాలువ పూర్తి సామర్థ్యం నీళ్లు వదిలితే మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో చెరువులు తెగి, ఇండ్లు మునిగి ప్రజలకు పునరావాస కేంద్రాలు నడపాల్సి వచ్చింది. ప్రాజెక్టులో ఇసుక మేట సుమారు 20 టీఎంసీల సామర్థ్యాన్ని తగ్గించింది. వరదలు ముంచెత్తినపుడు నీళ్లు గోదావరి ద్వారా సముద్రం పాలయ్యేవి. కాలువల ఆధునీకరణ లేదు, చెరువుల్ని నింపే వ్యవస్థ లేదు. దిగువ మానేరు నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి వెళ్లేటంత. జగిత్యాల, కరీంనగర్‌లో వాగు నీటి సమస్యలు, కాలువలో నీళ్లు లేక వరంగల్‌ పట్టణానికి నీటి కటకట. ఇలా చెప్పుకొంటూపోతే జాబితా అనంతం. ఇవన్నీ ఆంధ్రపాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలు. చాలాకాలం అజ్ఞాతంలో ఉన్న మిడ్‌ మానేర్‌, ఎస్సారెస్పీ వరద కాలువను కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభించినప్పటికీ పాలకులకు చిత్తశుద్ధి లేదు. అధికారులుగా మేం ఏమీచేయలేక నిర్లిప్తంగా ఉండేవారం. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు అమ్మిన కోట్ల రూపాయలతో కడపలో అవసరంలేని రోడ్లు వేశారు గానీ  తెలంగాణకు పది కోట్లు ఇవ్వడానికి కూడా వాళ్లకు మనసొప్పేది కాదు. ఇచ్చిన ఆ కొద్ది నిధులు కూడా ఖర్చుపెట్టేవాళ్లు కాదు. 

మధ్య మానేరు, వరద కాల్వ భూసేకరణ తల నొప్పిగా ఉండేది. పాత భూసేకరణ చట్టాల లోపాల కారణంగా భూమి ధర రైతులకు మార్కెట్‌ ధర కన్నా తక్కువ ఇచ్చిన సందర్భాలు అనేకం. రైతులు కోర్టుకెళితే కొంత పెరిగినప్పటికీ కేసుల కోసం దళారీలు, న్యాయవాదులు సగం సగం మాట్లాడుకొవడం వల్ల రైతుకు అందేది తక్కువే. దీనికి విరుగుడుగా  రైతుల పక్షపాతియైన సీఎం కేసీఆర్‌ 123 జీవో లాంటి సంచలన నిర్ణయాల మూలంగా, వేల ఎకరాలను చాలా వేగంగా సరైన ధరలలో, రైతుల అంగీకారంతో రిజిస్ట్రేషన్లు చేసేవాళ్లం. అభివృద్ధి నిరోధకులు, గిట్టనివాళ్లు అలాంటి జీవోలను కూడా కోర్టుల్లో నిలిపి వేయించారు. 

2006లో మధ్య మానేరు ఎప్పుడైతే తెర మీదికి వచ్చిందో అప్పటినుంచి భూసేకరణ, పునరావాస అధికారిగా నాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. సుమారు 20 వేల ఎకరాలు సేకరించాలి. సర్వేతోపాటు 18 ముంపు గ్రామాల సమస్యలు, ఇండ్ల సర్వే, ధరల లెక్కింపు, కుటుంబాలగణన, వీడియోగ్రఫి, పునరావాస కేంద్రాల భూసేకరణ, స్థలాల నిర్ణయం, సౌకర్యాల కల్పన మొదలైనవి వందల ఉద్యోగులతో రెండేండ్లపాటు యజ్ఞంలా సాగించాం. డివిజన్‌ కేంద్రం సిరిసిల్ల అయినా  వేములవాడలోని సినారె కళామందిర్‌లో తాత్కాలికంగా కార్యాలయం పెట్టుకున్నాం. ఎంపీగా ఉన్న కేసీఆర్‌ చొరవ తీసుకొని రైతులను ఒప్పించారు. ఈ విజయం మధ్య మానేరు ప్రాజెక్టు పురోగతిలో కీలక ఘట్టం. నేను మళ్లీ జాయింట్‌ కలెక్టర్‌, కరీంనగర్‌ అదనపు బాధ్యతల కలెక్టర్‌గా ఉన్నప్పుడు 2016లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల పునరావాస సమస్యలను పరిష్కరించి 20 టీఎంసీల నీరు జలాశయంలోకి పంపించడం జరిగింది. 

ఆంధ్ర పాలనలో అన్ని ప్రాజెక్టులు కలిసి 100 టీఎంసీలు కూడా దాటలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలోనే సుమారు 200 టీఎంసీలకు పైగా సాగునీరు మన భూముల్ని సస్యశ్యామలం చేయబోతున్నది. ఇంత గొప్ప చరిత్రలో నేను సైతం అని చెప్పుకోతగిన అవకాశం నాకు రావడం పూర్వజన్మ సుకృతం.  తెలంగాణ గురించి మాట్లాడినందుకు ఉద్యోగ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మావంటి వారికి మన నీళ్లు, మన వనరులు, మన నిధులు అనే ఆకాంక్ష నెరవేరడం సంతృప్తిగా ఉంది. 

(వ్యాసకర్త: విశ్రాంత జాయింట్‌ కలెక్టర్‌)
logo