ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 07, 2020 , 22:50:08

నిబద్ధత నిరాడంబరత

నిబద్ధత నిరాడంబరత

మా నాయనగారి (దాశరథి రంగాచార్య) ప్రస్తావన వస్తే.. ఆయన క్రమశిక్షణ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ప్రతి రోజు ఉదయమే నాలుగు గంటలకు వాకింగ్‌కు వెళ్ళేవారు. ఇంటికి వచ్చిన తర్వాత పూజ ముగించుకుని ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రచనా కార్యక్రమం సాగేది. ఆయన ఒకసారి రాశారంటే ఇక అదే ఫైనల్‌! కొట్టివేతలు, దిద్దుడు ఉండేది కాదు. చక్కగా ప్రింటింగ్‌కు పంపించాల్సిందే. చిన్న వాక్యాలతో రాస్తారు. ఆయన రచనలకు చదివించే లక్షణం ఉంటుంది.

సికిందరాబాద్‌లో అసిస్టెంట్‌ మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేసేవారు. పది గంటలకు ఉద్యోగానికి వెళ్ళేవారు. బయట ఏదీ తినే అలవాటు లేదు.. టీ కూడా ఇంటి నుంచే వెళ్ళాల్సిందే. భోజనం తర్వాత మధ్యాహ్నం ఆఫీసులోనే గంట సేపు నిద్ర పోయేవారు. ఆఫీసులో ఆయన టేబుల్‌పై ఒక్కటి కూడా పెండింగ్‌ ఫైల్‌ ఉండేది కాదు. ఎప్పటికప్పుడు పంపించేవారు. అదీ ఆయనకు పని పట్ల ఉన్న నిబద్ధత. ఉద్యోగం పట్ల ఎంత నిబద్ధతతో ఉండేవారో కుటుంబానికి అంతే ప్రాధాన్యం ఇచ్చేవారు. అందరూ రావాలె, కలిసి ఉండాలని కోరుకునేవారు. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత గంట సేపు అమ్మతో మాట్లాడుతూ గడిపేవారు. సాయంత్రం ఆయనను కలవడానికి ఎవరైనా వస్తుండేవారు. ఏనాడూ టీవీ చూసేవారు కాదు. రాత్రి 9.30 కల్లా నిద్రపోవలసిందే. 

ఆయనొక రివల్యూషనరీ అని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా గార్ల సొంత ఊరు. ఏడెనిమిదేండ్ల వయసులో బడిలో కుచ్చుటోపీ పెట్టుకోమంటే అందుకు నిరాకరించారు. మేం బ్రాహ్మణులం అటువంటివి పెట్టుకోమని చెప్పారట. అదొక వివాదంగా మారింది. ఒత్తిడి చేయకుండా ఆ నిబంధన ఉపసంహరించుకున్నారు. కానీ ఆయన నిరసనలు ధిక్కారాలు ఎక్కువయ్యాయి. దీంతో రస్టికేట్‌ చేసి పంపించారు. పెద్దనాన్న (దాశరథి కృష్ణమాచార్య) నిజాం వ్యతిరేక పోరాటంలో అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో ఇంటి భారం మా నాయనగారిపై పడింది. ట్యూషన్లు చెప్పేవారు. రాత్రివేళ వయోజనులకు పాఠాలు చెప్పేవారు. ఉచిత బోధనే కానీ, విద్యార్థులు ఒకరు బియ్యం, మరొకరు కూరగాయలు ఇట్లా తెచ్చి ఇచ్చేవారు. ఆయన విద్యా వ్యాప్తి కోసం, ప్రజల చైతన్యం కోసం పాటుపడేవారు.  ఊరిలో గ్రంథాలయం పెట్టించారు. పత్రికలు తెప్పించేవారు. 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆయన ఆంధ్రలో మెట్రిక్‌ పాసయ్యారు. అప్పుడు రెండు ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఒకటి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (గిరిదావర్‌) ఉద్యోగం. రెండవది టీచర్‌. కొందరు మిత్రులు రెవెన్యూ శాఖలోకి వెళ్ళమన్నారు. కానీ నాయనగారికి బడిపంతులు ఉద్యోగమే నచ్చింది. ఆ తరువాత కరెస్పాండెన్స్‌ ద్వారా బి.ఎ. పూర్తి చేశారు. పెద్దనాన్న, నాన్న ఎంతో ప్రేమగా ఉండేవారు. పెద్దనాన్న ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగం చేసేవారు. కుటుంబ అవసరాల రీత్యా మేం కూడా హైదరాబాద్‌ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అనువాదకుడిగా చేరారు. ఏ ఉద్యోగం చేసినా చేతులు కట్టుకొని నిలబడటం ఆయనకు అలవాటు లేదు. ప్రమోషన్‌ వచ్చినప్పుడు నీకు కారు ఉంటుంది, నౌకరులుంటారు అని చెప్పారట. నాన్నగారు నాకు అవేవీ వద్దు ఇంటికి దగ్గరగా ఉండే చోట వేస్తే చాలు అన్నారు. ఇంటికి ఆఫీసు తరఫున ఫోన్‌ కూడా పెట్టించుకోలేదు. ఇంటిలో నౌకరు కూడా ఉండవద్దన్నారు. మున్సిపల్‌ అధికారిగా ఉన్నప్పుడు ట్రేడ్‌యూనియన్‌ నాయకుడిగా కూడా ఉండేవారు. మిగతా ప్రభుత్వాధికారుల పిల్లల మాదిరిగా మాకు షాపింగ్‌ చేయడం, కార్లలో తిరుగడం ఉండకపోయేది. మాకు కాలేజీ చదివే రోజుల్లో ఆ వెలితి కనిపించేది. తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపందుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు నాయనగారికి ఎన్టీఆర్‌ పేర ఒక అవార్డు (లక్షన్నర రూపాయలు )ఇస్తామని సమాచారం పంపించారు. దానిని తిరస్కరించారు. 

1969లో మా ఇల్లు ఉద్యమ కేంద్రంగా ఉండేది. నేను రెండవ తరగతి. నేనూ ఉద్యమంలో పాల్గొన్నా. మైసూర్‌ పోలీస్‌, బూట్‌ పాలిష్‌ అంటూ నినాదాలు చేసేవాళ్ళం. ఉద్యమకారులను సైకిల్‌ చైన్లతో కొడితే, అదే అచ్చు ఒంటిపై పడేది. దెబ్బలు తిన్నవారు వస్తే, వారిని మా ఇంటి లోపలి గదిలోకి పంపి మేం బయట ఉండేవాళ్లం. మా అమ్మ, మేనత్త, పెద్దక్క వారికి వేడినీళ్ళతో కాపడం పెట్టేవారు. అర్ధరాత్రి కూడా పోలీసులు వచ్చేవారు. చాలా ఉద్రిక్తంగా ఉండేది. 

నిజాం కాలపు పరిస్థితులను భవిష్యత్‌ తరాలకు చెప్పాలని నాన్నగారు భావించారు. అందుకు నవలా రూపం మంచిదని అనుకున్నారు. ఎలా రాయాలనే విషయమై రెండేండ్లు అధ్యయనం చేశారు. ఆ తరువాత చిల్లరదేవుళ్ళు మొదలుపెట్టారు. ఆ పుస్తకంలో ఆయన వాడిన గ్రామీణ భాష అప్పుడొక సంచలనం. కొందరు అభ్యంతరం చెప్పారు కూడా. ఆ తర్వాత మోదుగుపూలు, జనపథం వచ్చాయి. జీవన యానం ఎంత విజయవంతమైందో తెలిసిందే. 

వేదాలు తెలుగులో అదీ వచనంలో రాస్తే సామాన్యులు కూడా చదువుకోవచ్చని ఆయన భావించారు. అయితే అందరూ చదవకూడదని భావించే వారికి ఆగ్రహం తెప్పించింది. అటువంటి వారి నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ నాన్నగారు మాత్రం వేదాల్లో ఏముందో ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియాలని భావించి వచనంలో రాశారు. ఆయన కార్ల్‌మార్క్స్‌ గురించి ఎంత చదివారో, రామాయణ మహాభారతాలు అంతే చదివారు. కమ్యూనిజం అంటే దేవుడిని నమ్మక పోవడం కాదు. అదొక జీవన రీతి అనేవారు. అందుకే నిరాడంబరంగా జీవించారు. స్వాతంత్య్ర సమర యోధులు కనుక మీకు ప్రభుత్వం తరఫున పదెకరాల భూమి ఇప్పిస్తాం తీసుకోండి అని పెద్దలు కొందరు చెప్పారు. కానీ ఆయన నిరాకరించారు. దున్నేవాడికే భూమి అని పోరాడాం, మళ్ళీ మనం భూమి తీసుకోడమేమిటి అన్నారు. ఫిలింనగర్‌లో వెయ్యిగజాల జాగ ఇస్తామంటే కూడా తీసుకోలేదు. పిట్టకోగూడు, మనిషికో ఇల్లు ఉంటే చాలు అనేవారు. 

- విరించి దాశరథి

(నేడు దాశరథి రంగాచార్య వర్ధంతి)


logo