శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jun 05, 2020 , 00:06:32

మిడతల బెడద

మిడతల బెడద

శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత అభివృద్ధి చెందినా మానవాళి ఎదుర్కొనే కొన్ని సమస్యలు మాత్రం అదేవిధంగా పరిష్కారం లేకుండానే ఉండిపోవడం ఆశ్చర్యకరం. ప్రపంచమంతా ఒక వైరస్‌ను కట్టడి చేయలేక చేతులెత్తేసిన సందర్భమిది. ఇది చాలదన్నట్టు మిడతల దాడి మొదలైంది. మిడతలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి పయనించే కొద్దీ భారీ నష్టం సంభవిస్తూ ఉన్నది. గత మూడు దశాబ్దాలలో ఈ స్థాయిలో మిడతల దాడి జరుగడం ఇదే మొదటిసారి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో మిడతలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అవి మహారాష్ట్రలోని విదర్భలోకి ప్రవేశించాయని తెలియగానే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒక కమిటీని వేసి వాటిని కట్టడి చేసేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఏ సమస్యనైనా దృఢంగా ఎదుర్కొనే తెలంగాణ ప్రభుత్వం పట్ల రైతులకు నమ్మకం ఉన్నది. ఒక రాష్ట్రంగా మనకున్న పరిమితమైన హంగులతో పోలిస్తే మిడతలను ఎదుర్కోవడానికి సిద్ధపడిన తీరు ప్రశంసనీయమే.

మన దేశంలోకి మిడతల దండు ప్రవేశించిన సమయం కొంత ఊరట కలిగిస్తున్నది. ఇప్పటికే యాసంగి పంటకాలం పూర్తయింది. వానకాలం పంట ఇంకా మొదలుకాలేదు. సంతానోత్పత్తికి అనుకూలంగా కొంత ఉష్ణ ప్రాంతమై ఉండి, వానలు కురిసి ఆహారం లభించగలిగితే మిడతల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఈ సారి రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా. ఈ నేపథ్యంలో విత్తనాలు వేసే కాలం మిడతలు గుడ్లు పెట్టి, వాటి సంఖ్యను పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మిడతల దండు మళ్ళీ వానకాలం పంటకు చేటు తేవచ్చు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ఈ వెల్లడించిన సమాచారం గమనార్హమైనది. మిడతల దండు మొదట తూర్పువైపు బీహార్‌, ఒడిషా వరకు ప్రయాణించి, ఆ తర్వాత జూలై నాటికి మళ్ళీ పశ్చిమాన రాజస్థాన్‌ వరకు దశలవారీగా రావచ్చు. నైరుతి రుతుపవనాలకు అనుగుణమైన గాలులను బట్టి వాటి ప్రయాణం ఉంటుంది. అందువల్ల ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి ముందుగానే సిద్ధపడాలి.

ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా, సోమాలియా తదితర దేశాలలో మిడతల సంఖ్య భారీగా పెరుగుతున్నదనేది కొన్ని నెలల ముందే తెలుసు. అక్కడి నుంచి పశ్చిమాసియాలోని యెమన్‌, ఒమన్‌ మీదుగా ఇరాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లోకి మిడతలు ప్రవేశించాయని, అక్కడ వాటి సంతానోత్పత్తి సాగుతున్నదని హెచ్చరికలు వెలువడ్డాయి. ఆ తర్వాత భారత పాకిస్థాన్‌ సరిహద్దుల్లోకి కూడా మిడతలు చేరాయని కూడా తెలిసింది. కొన్నినెలల ముందే వీటి పుట్టుక గమనం తెలిసి కూడా అంతర్జాతీయస్థాయిలో సమష్టి కార్యాచరణ చేపట్టలేకపోవడం ఆశ్చర్యకరం. మిడతల ఉనికిని గుర్తించడానికి ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడ్డది. కానీ ఉమ్మడి ప్రయోజనాలపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేనప్పుడు ఎంత సాంకేతిక అభివృద్ధి జరిగితే మాత్రం ఏమి లాభం! కరోనా వైరస్‌, మిడతల దాడుల వంటివి విరుచుకుపడినప్పుడైనా మనం ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది.


logo