ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 05, 2020 , 00:05:49

పచ్చని రాష్ట్రంలో ప్రాణికోటి

పచ్చని రాష్ట్రంలో ప్రాణికోటి

‘జంగిల్‌ బచావో- జంగిల్‌ బడావో’ నినాదంతో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనే ద్విముఖ లక్ష్యాలతో పనిచేస్తున్నది. హరితహారం ఇప్పటికే ఐదు విడతలు పూర్తికాగా, ఆరో విడత కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నారు. 230 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు 182.74 కోట్ల మొక్కలను నాటారు. అడవులను పరిరక్షించడం, అడవుల పునరుద్ధరణ, అటవీ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడటం వల్ల తెలంగాణలో అటవీ ప్రాంతం మూడు లక్షల హెక్టార్లకు పెరిగింది.

అడవుల పరిరక్షణ, పెంపకంలో సాధిస్తున్న ఫలితాలతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మిగితా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘రాష్ట్ర జీవవైవిధ్య మండలి’ ఏర్పాటు చేసి.. ‘జీవవైవిధ్య నియమావళి-2015’ రూపొందించింది. రాష్ట్రంలో 1,900 వృక్షజాతులు, 166 రకాల చేపలు, 155 రకాల సీతాకోక చిలుకలు, 108 జాతుల క్షీరదాలు, 486 పక్షి జాతులున్నాయి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం కరోనా మహమ్మారి వల్ల ప్రత్యేకతను సంతరించుకు న్నది. మే 22 ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం కాగా రెండువారాల్లోనే మరోసారి పర్యావర ణం గురించి చర్చించుకోవాల్సి వస్తున్నది. కరోనా వైరస్‌ను చూసైనా మానవుడు కండ్లు తెరువకపోతే భవిష్యత్తు మరింత మసకబారే ప్రమాదం ఉన్నది.

కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన జీవరాశిని తేలిగ్గా తీసుకొని, అభివృద్ధి పేరిట విధ్వం సం చేయడం మానవాళికి శ్రేయస్కరం కాదు. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ గోల్డ్‌స్మిత్‌ పేర్కొన్నట్లు అవసరాల కోసం తాను ఆధారపడే ప్రకృతిని ఆధునిక మానవుడు నాశనం చేస్తున్నాడు. ఆహార అవసరాలకు జీవరాశులను చంపడం, విచక్షణారహితంగా అడవులను నరికివేస్తూ పోతే మానవ మనుగడకే ప్రమాదం. కాబట్టి సమస్త జీవరాశులకు అనువైన జీవన వాతావరణాన్ని కాపాడటం మానవుని బాధ్యత. 1970 నుంచి భూమిపై నివసించే జీవరాశుల్లో 40 శాతం కనుమరుగు కాగా, గత 50 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా 60 శాతం వన్యప్రాణులు నశించిపోయినట్లు పర్యావరణవేత్తలు చెప్తున్నారు. వచ్చే పదేండ్లలో దాదాపు 10 లక్షల జీవజాతులు అంతరించే ప్రమాదం ఉన్నది. అంటే ప్రతి నాలుగు జీవ జాతులలో ఒకటి కనుమరుగు కావచ్చు.

పర్యావరణాన్ని శాసిస్తున్న మరో అంశం కర్బనవాయు ఉద్గారాలు. దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం నెలకొనడం, ఫలితంగా పర్యావరణం దెబ్బతినడంతో అటు ఆస్ట్రేలియా, ఇటు పశ్చిమ, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో కార్చిచ్చులు అడవులను దహించి వేస్తున్నాయి. కొంతకాలంగా కార్చిచ్చుల వల్ల భారీ విస్తీర్ణంలో అడవులు బూడిదై ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. పుడమికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్‌ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చుతో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, అమెరికాలోని పొదలు అగ్నికి ఆహుతి కావడంతో ఎన్నో జీవరాశులు చనిపోయాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించడంలో అమెజాన్‌ అడవులు కీలకం. అమెజాన్‌ బేసిన్‌ 30 లక్షలకు పైగా మొక్కలు, జంతువులు, ఇతర జీవజాతులకు ఆలవాలం. భూతాపాన్ని నియంత్రించటానికి ఈ ప్రాంతం చాలా కీలకమైనది. మన దేశంలో కూడా తరచూ నల్లమల తోపాటు దేశంలోని హిమాలయాలు, తూర్పు, పశ్చిమ కనుమల్లోని అడవుల్లో తలెత్తే అగ్నిప్రమాదాల వల్ల  అనూహ్య నష్టాలు కలుగుతున్నాయి.

ప్రపంచ జనాభా ఇప్పటికే 800 కోట్లకు చేరువైంది. నిజానికి వనరుల ప్రకారం చూస్తే భూ మండలానికి ఈ జనాభాను సాకే పరిస్థితి లేదు. ‘పాపులేషన్‌ స్టడీస్‌' అంచనాల ప్రకారం ఈ భూమండలానికి 9 నుంచి 10 బిలియన్ల దాకా జనాభాను భరించే శక్తి ఉన్నది. ప్రపంచం ఇప్పటికే ఆఫ్రికా లాంటి దేశాల పౌరుల కడుపును నింపలేకపోతున్నది. హైతీ లాంటి దేశాల ప్రజలు మట్టి తింటున్న దుస్థితి చూస్తున్నాం. చాలా దేశాలు పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం ఇవ్వలేకపోతున్నాయి.

ప్రపంచ పర్యావరణ మార్పులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేం వర్క్‌ కాన్వెన్షన్‌ ఆన్‌ ైక్లెమేట్‌ చేంజ్‌' పేరిట ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు. భారతదేశం ఇందులో భాగస్వామి. దానికి అనుగుణంగా దేశస్థాయిలో, రాష్ర్టాల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను  రూపొందించారు. తెలంగాణ ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపాల్సి ఉన్నది. మన రాష్ట్రం పొడి వాతావరణం కలిగిన, రుతుపవన ఆధారిత ప్రాంతం. మన రాష్ట్రంలో గత 50 ఏండ్లలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల మేర పెరిగాయి. 2050 కల్లా మరో 1.5 డిగ్రీలు, శతాబ్ది చివరకల్లా 4.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. 

కార్బన్‌ డై ఆక్సైడ్‌ను నియంత్రించటానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నది. ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల పెంపకంపై ప్రత్యేకదృష్టి సారించింది.

రాష్ట్రంలో అడవుల పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపకం కోసం ప్రభుత్వం కృషిచేస్తున్నది. హరితహారం, స్వచ్ఛ తెలంగాణ, జలహారం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలందరి భాగస్వామ్యంతో అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్‌ గతంలో ఎన్నడూ లేనివిధంగా పర్యావరణాన్ని ఓ సామాజిక బాధ్యతగా మార్చారు.

‘జంగిల్‌ బచావో- జంగిల్‌ బడావో’ నినాదంతో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనే ద్విముఖ లక్ష్యాలతో పనిచేస్తున్నది. హరితహారం ఇప్పటికే ఐదు విడతలు పూర్తికాగా, ఆరో విడత కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నారు. 230 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు 182.74 కోట్ల మొక్కలను నాటారు. అడవులను పరిరక్షించడం, అడవుల పునరుద్ధరణ, అటవీ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడటం వల్ల తెలంగాణలో అటవీ ప్రాంతం మూడు లక్షల హెక్టార్లకు పెరిగింది.

వచ్చే ఐదేండ్లలో 10 లక్షల హెక్టార్ల అడవుల పునరుద్ధరణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. అటవీరక్షణ, నేలలో తేమను నిలుపుకోవడం, అగ్ని ప్రమాదాలు నిరోధించడంతోపాటు ఇతర పరిరక్షణ చర్యలు కూడా పచ్చదనం పెంపునకు దోహదపడ్డాయి.

అడవుల పరిరక్షణ, పెంపకంలో సాధిస్తున్న ఫలితాలతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మిగితా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘రాష్ట్ర జీవవైవిధ్య మండలి’ ఏర్పాటు చేసి.. ‘జీవవైవిధ్య నియమావళి-2015’ రూపొందించింది. రాష్ట్రంలో 1,900 వృక్షజాతులు, 166 రకాల చేపలు, 155 రకాల సీతాకోక చిలుకలు, 108 జాతుల క్షీరదాలు, 486 పక్షి జాతులు ఇక్కడ ఉన్నాయి.

జీవ వనరుల సేకరణ, వినియోగ కార్యకలాపాలపై నియంత్రణ, స్థానిక సంస్థల పరిధిలో 13,415 జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటుచేశారు. జీవ వైవిధ్య వారసత్వ స్థలాల గుర్తింపు, నిర్వహణ విధులను జీవ వైవిధ్య మండలి చేపడుతున్నది. తెలంగాణకు తలమానికమైన మన్ననూరు ఎడ్లకు జాతీయస్థాయిలో గుర్తింపు తేవడానికి రాష్ట్ర జీవ వైవిధ్య మండలి చేసిన కృషి ఫలించింది. జాతీయ పశు జన్యువనరుల బోర్డు నుంచి పొడ-తూర్పు పశుజాతికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు రావడం ముదావహం. 

రాష్ట్రంలో జీవ వైవిధ్యానికి నెలవుగా మెదక్‌ జిల్లాలోని అమీన్‌పూర్‌ చెరువును గుర్తించడంతో అక్కడికి దేశదేశాల నుంచి పక్షులు వలస వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నది. నిర్దేశిత లక్ష్యం మేరకు రానున్న రోజుల్లో అడవులను 33 శాతానికి విస్తరించడంతో పాటు, ప్రణాళికాబద్ధంగా గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలువనున్నది. ప్రజలందరూ పర్యావరణ స్పృహను పెంచు కొని భవిష్యత్‌తరాలు సుఖశాంతులతో జీవించేవిధంగా ఈ భూ మండలాన్ని తీర్చిదిద్దుతారని కోరుకుందాం.

(వ్యాసకర్త: రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖమంత్రి) 


logo