శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jun 05, 2020 , 00:05:49

సిరులుపొంగిన జీవగడ్డ

సిరులుపొంగిన జీవగడ్డ

తెలంగాణ వచ్చాక హరిత (పచ్చని పొలాలు) విప్లవానికి నాంది పలుకడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తెలంగాణ వచ్చేనాటికి ఎగువ గోదావరి అర్ధ జీవనదిగా మారింది. దాని ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి సంపూర్ణ జీవనదులుగా సాగుతున్నాయి. ప్రాణహితతో తెలంగాణ హరిత విప్లవానికి జీవం పోశారు. కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ద్వారా సగం తెలంగాణను నూతన ఆయకట్టుగా మార్చే అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు.

ప్రాజెక్టులు, చెరువుల ద్వారా ఏర్పడుతున్న పచ్చదనమే ఆ విప్లవాలకు పురుడుపోస్తుంది. ఆ నీళ్లను సాధించడంలో సీఎం కేసీఆర్‌ ఆరేండ్లుగా అహర్నిశలూ శ్రమించారు, శ్రమిస్తూనే ఉన్నారు. నీళ్ల కోసం ఆయన చేస్తున్న భగరీథ శ్రమకు ప్రతిఫలంగానే ఇవాళ తెలంగాణలో హరిత, విత్తన, నీలి, క్షీర, గులాబీ విప్లవాలు ఆవిష్కారమవుతున్నాయి. 

స్వరాష్ట్రం ఏర్పాటుతోనే నిధుల దోపిడికి శాశ్వతంగా తాళం పడింది. ఇక నీళ్ల దోపిడినీ కట్టడి చేస్తున్నాం. కాళేశ్వరం నుంచి పాలమూరు ప్రాజెక్టుల దాకా రెండు జీవనదులను ఒడిసిపడుతున్నాం. మరో రెండేండ్లు గడిస్తే సంపూర్ణమూ అవుతుంది. స్వరాష్ట్ర స్వప్నంలో బలమైన ఆకాంక్ష నీళ్లదే. ఈ దేశమే వ్యావసాయిక దేశం కావచ్చు. అందులో తెలంగాణ మరింత వ్యావసాయిక ప్రాంతమని చరిత్ర చెప్తున్నది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసా యాన్ని అట్టడుగుకు చేర్చారు. 1948 వరకూ హైదరాబాద్‌ నిజాం ప్రపంచంలోనే రెండవ సంపన్నుడు.  రాజులకు ఆదాయమెక్కడిది? ప్రజలు పన్నులు కడితేనే కదా రాజు బొక్కసం వర్ధిల్లేది. ఆ విధంగా నాటి హైదరాబాద్‌ రాజ్య ప్రజలు చెల్లించిన పన్నుల సంపద నిజాంను ప్రపంచంలో రెండో స్థానంలో నిలబెట్టింది. అంతటి సంపన్నతకు కేంద్ర బిందువు వ్యవసాయమే.

సెలయేళ్ల వలె ఎక్కడచూసినా నిరంతర ప్రవాహ వాగులు వంకలు కనిపించేవి. పీఠభూమిపై తటాకాలతో మన వ్యవసాయం సిరిసంపదలు సృష్టించింది.  కప్పుల లాంటి తటాకాలు ఉమ్మడి రాష్ట్రంలో సాసర్లుగా మారాయి. మరికొన్ని కనుమరుగయ్యాయి.  అరువయ్యేండ్లు తిరిగేసరికి తెలంగాణ వ్యవసాయమేమైపోయింది? దిక్కు, దివానం లేని  అనాథగా ఎలా మారిపోయింది.. ఇక్కడ కారకుల గురించి కాదు.  పూర్వ వైభవాన్ని తెలంగాణ ఎలా అందుకోగలదనేదే చర్చ. నాటి సస్యశ్యామల తెలంగాణ, తిరిగి నాటి వైభవాన్ని ఎందుకు సంతరించుకోలేదు? తప్పక అందుకో గలుగుతుంది! ఎప్పుడు ఎడతెగకపారే ఏరు ఉన్నచోట జీవించడం ఉత్తమమని ఓ కవి రాసిన పద్యంలోని పరమార్థం అక్షర సత్యం. నీరే సంపన్నతకు మూలం. ఆ మధ్య ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ ఓ ప్రాకృతిక వాస్తవాన్ని చెప్పారు. హరిత, నీలి, క్షీర, గులాబీ విప్లవాలను సాధిస్తున్నామని అన్నారు. ఆ విప్లవాలకు నీరే ఆధారం. నీళ్లు సమృద్ధిగా వాడుకలోకి వస్తున్నప్పుడే ఆ విప్లవాలు విజయాలను నమోదు చేస్తుంటాయి.

తెలంగాణ వచ్చాక హరిత (పచ్చని పొలాలు) విప్లవానికి నాంది పలుకడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తెలంగాణ వచ్చేనాటికి ఎగువ గోదావరి అర్ధ జీవనదిగా మారింది. దాని ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి సంపూర్ణ జీవనదులుగా సాగుతున్నాయి. ప్రాణహితతో తెలంగాణ హరిత విప్లవానికి జీవం పోశారు. కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ద్వారా సగం తెలంగాణను నూతన ఆయకట్టుగా మార్చే అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో రామదాసు, సీతారామ, పాలమూరులో గత పాలకులు వదిలేసిపోయిన అసంపూర్ణ ప్రాజెక్టులను వేగిరపరిచారు. నూతన ఆయకట్టు లక్షల ఎకరాల్లో  పెరిగి హరిత విప్లవానికి నాంది పడింది. సాసర్లుగా మారిన తటాకాలను        (చెరువులు) మిషన్‌ కాకతీయ పేరున పునర్నిర్మాణం చేపట్టి సుమారు 20 లక్షల ఎకరాలను సాగులోకి తేగలిగారు. ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా చెరువులను నింపే కార్యక్రమం కరువు ప్రాంతాలలోనూ పచ్చదనాన్ని తేగలిగింది. దాంతో భూగర్భజలాలూ పెరుగుతున్నాయి. రెండు నదుల్లో రాష్ట్రం హక్కుగా ఉన్న 13 వందల టీఎంసీ నీటిని సంపూర్ణంగా వాడుకలోకి తెచ్చిననాడు 46 వేల చెరువులు ఎల్లప్పుడూ నిండు కుండల్లా ఉంటాయి. మరో మూడు లేదా నాలుగేండ్ల తదుపరి ఆ దృశ్యాన్ని కూడా మనం చూసే అవకాశం రావచ్చు. ఇప్పటికే సాగులో తెలంగాణ కోటి ఎకరాల కలను దాటి దూసుకుపోతున్నది. కేసీఆర్‌ తమ కలను ఇంత వేగంగా సాధిస్తారని ఎవరూ అనుకొని ఉండక పోవచ్చు. ఆయన భగీరథ యత్నాలు అద్భుతంగా ఫలిస్తున్నాయి. పంటల ఉత్పత్తిలో ఇప్పటికే పంజాబ్‌, హర్యానా వ్యవసాయాన్నీ దాటేస్తున్న స్థితికి చేరింది తెలంగాణ. ఇవాళ దేశంలో విత్తన భాండాగారంగా మారుతుండటం చూస్తున్నాం.

పాడి పశువుల వృద్ధి వ్యవసాయ వృద్ధిపైనే అధారపడుతుంది. అందుకే పాడి పరిశ్రమ కూడా హరిత విప్లవానికి అనుబంధమైనదే. తెలంగాణలో క్షీర విప్లవమూ బలపడే అవకాశాలు మరింత పెరుగుతాయి.  నీటిని ఒడిసిపడితే వ్యవసాయం, వ్యవసాయం బలపడితే పాడి పరిశ్రమా బలపడుతుంది. ఒకప్పుడు కప్పులుగా ఉన్న చెరువులు సాసర్లుగా మారాక ఇక్కడ చెరువుల్లో చేపల పెంపకం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ వచ్చాక చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు.  ప్రభుత్వమే ఏటా కోట్ల చేపపిల్లలను ఉచితంగా చెరువుల్లో, కుంటల్లో,  ప్రాజెక్టుల్లో వదిలి మత్స్యకారులకు చేతి నిండా పని కల్పిస్తున్నది. నీలి విప్లవం మొదలైంది. ప్రాజెక్టుల నిర్మాణాలు ఎట్లా ఆగవో..  వాటి ద్వారా రాష్ట్రంలో నీలి విప్లవమూ ఆగేది కాదు. కేసీఆర్‌ కోటి ఎకరాల కల కేవలం హరిత విప్లవానికే పరిమితం కాదు, ఆయన కల ఇలాంటి అనుబంధ విప్లవాలనూ విజయవంతం చేయనున్నది.

గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల పెంపకం రాష్ట్రంలో కొంతకాలంగా పెరుగుతున్నది. మాంస ఉత్పత్తుల పెంపకాన్ని గులాబీ విప్లవం అంటారు. గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం ఒక పథకాన్నే తెచ్చింది. ఆ పథకం ఫలితాలూ కనిపిస్తున్నాయి. మరింత పకడ్బందీగా అమలుజరిగి ఉంటే మరింతగా ఫలితాలు వచ్చేవనే అభిప్రాయమూ ఉన్నది. మొత్తం మీద గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించిన తీరు మాత్రం అందరి ప్రశంసలందుకున్నది. ఇవాళ తెలంగాణలో మాంస ఉత్పత్తులు పెరిగాయి.  గొర్రెల పెంపకం గొప్ప పరిశ్రమగా మారుతున్నది.  పౌల్ట్రీ పరిశ్రమ బలపడింది. వచ్చిన తెలంగాణలో గులాబీ విప్లవమూ సాధ్యమవుతున్నదని పెరుగుతున్న మాంస ఉత్పత్తులే చెప్తున్నాయి.

ఏ విప్లవం విజయవంతం కావాలన్నా కావలసినవి నీళ్లే. నీళ్ల నుంచి శాఖోపశాఖలుగా విప్లవాలు అనేకం విస్తరిస్తాయి. ప్రాజెక్టులు, చెరువుల ద్వారా ఏర్పడుతున్న పచ్చదనమే ఆ విప్లవాలకు పురుడుపోస్తుంది. ఆ నీళ్లను సాధించడంలో సీఎం కేసీఆర్‌ ఆరేండ్లుగా అహర్నిశలూ శ్రమించారు, శ్రమిస్తూనే ఉన్నారు. నీళ్ల కోసం ఆయన చేస్తున్న భగరీథ శ్రమకు ప్రతిఫలంగానే ఇవాళ తెలంగాణలో హరిత, విత్తన, నీలి, క్షీర, గులాబీ విప్లవాలు ఆవిష్కారమవుతున్నాయి. తెలంగాణ ఏనాడూ పేదది కాదు. పేదదిగా మార్చబడిందని ఉద్యమకాలంలో కేసీఆర్‌ చెప్పేవారు. ఆ మాటలు అక్షరసత్యాలని ఇవాళ ఆయనే నిరూపిస్తున్నారు.


logo