గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jun 03, 2020 , 23:13:54

అల్లర్లలో అమెరికా

అల్లర్లలో అమెరికా

అందరికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదన్నట్టు-మానవహక్కులు, అంతర్గత సమస్యలపై  దేశాలను వేలెత్తి చూపే అమెరికా జాతి కలహాలతో కుతకుతలాడుతున్నది. గత నెల 25వ తేదీన ఒక నల్లజాతీయుడు ఫ్లాయిడ్‌ పోలీసుల మొరటుదనం వల్ల మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ ప్రదర్శనలు హింసాత్మకంగా మారి దాడులు, విధ్వంసాలు, లూటీలకు దారితీశాయి. నిరసనలు వందల నగరాలకు విస్తరించడమే కాకుండా శ్వేతభవనం ముందుకుచేరాయి. కొంత ప్రాణనష్టం కూడా జరిగింది. నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో సైన్యాన్ని రంగంలోకి దింపుతామని దేశాధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. నిరసనలను కఠినంగా అదుపుచేయడం లేదంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కరోనా మహమ్మారి పెచ్చరిల్లినప్పటికీ, ఆగ్రహావేశాలు పెల్లుబుకడం గమనార్హం. ఫ్లాయిడ్‌ మరణం పట్ల అంతర్జాతీయంగా కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. నిరసనకారులకు కెనడా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర అమెరికా మిత్రదేశాల్లోనూ సంఘీభావం వ్యక్తం కావడం విశేషం. 

నల్లజాతీయుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారనే భావన వారిలో బలపడి ఉన్నది. ఈ కారణంగా అమెరికాలో తరచూ అల్లర్లు చెలరేగుతున్నాయి. ఫ్లాయిడ్‌ మరణ ఘటన కూడా నల్లజాతీయుల మనసును తీవ్రంగా గాయపరిచిందనడంలో సందేహం లేదు. అయితే వారి నిరసనలు హింసాత్మకంగా, విధ్వంసకరంగా మారడమే ఆందోళనకరం. అమెరికా చరిత్రలో నల్లజాతీయులు శాంతియుత ఉద్యమాల ద్వారా అనేక విజయాలు సాధించారు. క్రైస్తవ మతసూత్రాలతో, మహాత్మాగాంధీ సత్యాగ్రహంతో ప్రేరణ పొందిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ నాయకత్వంలో సాగించిన శాసనోల్లంఘన, శాంతియుత ఉద్యమాలను నల్లజాతీయులు విస్మరించకూడదు. నల్లజాతి బాలలు తెల్లజాతి బాలలు చేతులు కలిపే రోజు రావాలన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కల సాకారం కావడానికి ఇంకా చాలా దూరమే ఉండవచ్చు. కానీ నల్లజాతీయుల శాంతియుత ఉద్యమాలు శ్వేతజాతీయుల సంఘీభావాన్ని కూడా చూరగొన్నాయి. పాలకులు దిగివచ్చి వివక్షాపూరిత చట్టాలను మార్చవలసి వచ్చింది. బస్సు ప్రయాణంలో తెల్లజాతీయులకు లేచి సీటు ఇవ్వాలనే చట్టానికి వ్యతిరేకంగా, 1955లో నల్లజాతీయులు 381 రోజులపాటు బస్సులనే బహిష్కరించి మైళ్లకొద్ది నడిచివెళ్ళడం ఒక చరిత్రాత్మక ఘట్టం. 

అమెరికా పాలకులు ఆర్థికాభివృద్ధిపై చూపిన ఆసక్తిని సామాజిక ప్రగతిపై చూపకపోవడం అసలు అల్లర్లకు కారణం. ఈ నిరసనల తీవ్రతకు మరో కారణం- ఆర్థిక పరిస్థితులే. కొంతకాలంగా అమెరికా ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్నది. ఈ అనిశ్చితిని ఆసరాగా చేసుకొని జాత్యభిమానాన్ని రెచ్చగొట్టడం ద్వారానే  ట్రంప్‌ అధికారానికి వచ్చారు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ మరింత దెబ్బతీసింది. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం మూల సమస్యను పరిష్కరించడానికి యత్నించాలి. అమెరికా అనుభవాన్ని ఇతర దేశాలు కూడా గమనించి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించాలి. 


logo