శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jun 03, 2020 , 23:13:54

తెగిడి‘నోళ్లే’ పొగుడుతూ...

తెగిడి‘నోళ్లే’ పొగుడుతూ...

ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెచ్చేందుకు ఆయన అభిమానులే కానక్కరలేదు. నిన్నటివరకు విమర్శించిన తెలంగాణ మేధావులు, రచయితలలోని సినిక్స్‌ కూడా ఈ రోజున ప్రశంసిస్తున్నారు. ప్రజానుకూల విధానాలపై కాపీరైట్‌ తమదేనని నమ్మే వామపక్షీయులు సైతం అదే మార్గంలో ఉన్నారు. ఆంధ్రతో సహా పలు ఇతర రాష్ర్టాల వారు, ఢిల్లీ స్థాయి పరిశీలకులు సరేసరి. అందుకు అర్హమైనవి అనేకం మొదటినుంచి జరుగుతున్నా కేసీఆర్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇటీవలి మాసాలలో, తగినన్ని విషయాలు వీరందరి దృష్టికి వస్తున్నాయి. కనుకనే ఈ మెచ్చుకోలు.

ఒకవైపు ఆ విధమైన అపూర్వస్థాయి ధాన్య సేకరణా సామర్థ్యం, మరొకవైపు చూస్తూ చూస్తుండగానే శరవేగంతో పూర్తవుతున్న జలాశయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను పరవశింపజేయటంతోపాటు తమ నాయకుని వలెనే గర్వింపజేస్తుండటం సర్వత్రా కనిపిస్తున్నదే.

‘ఈ రోజు నాకు గర్వంగా ఉంది’ అని ముఖ్యమంత్రి మే నెల చివరివారంలో రెండు సందర్భాలలో అన్నారు. మొదట మే 27న. అందుకు సందర్భం భారతీయ ఆహార సంస్థ అప్పటివరకు దేశవ్యాప్తంగా సేకరించిన 83.01 లక్షల టన్నుల ధాన్యంలో తెలంగాణ వాటా 52.23 లక్షల టన్నులు (63 శాతం) కావటం. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ ప్రసాద్‌ స్వయంగా ప్రకటించారు. అంతకు కొద్దివారాల ముందే తెలంగాణ బియ్యం మొదటిసారిగా కొన్ని లక్షల టన్నులు అయిదారు రాష్ర్టాలకు ఎగుమతి అయ్యాయి. ఎగుమతిచేసిన జిల్లాలలో మహబూబ్‌నగర్‌ ఒకటి కావటం మరొక నమ్మశక్యం కాని విషయం. కేసీఆర్‌కు ‘గర్వం’ కలిగించిన మొదటి సందర్భం ఇది కాగా, తర్వాత రెండు రోజులకు రెండవ సందర్భం మే 29న వచ్చింది. ఆనాడు ఆయన కొండ పోచమ్మ రిజర్వాయర్‌ను ప్రారరంభిస్తూ, ‘ప్రపంచ, దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా నాలుగేండ్లలో 165 టీఎంసీల సామర్థ్యంతో కూడిన కొత్త రిజర్వాయర్లు నిర్మించుకున్నం. ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉన్నది. 

ఇవి కాకుండా మరికొన్ని నిర్మించుకుంటున్నం’ అన్నారు. ఈ నిర్మాణాల పరాకాష్ఠతకు చిహ్నమా అన్నట్లు కొండపోచమ్మసార్‌ సముద్ర మట్టం నుంచి 618 మీటర్లకు కండ్లు మిరుమిట్లు గొలిపే విధంగా లేచి నీరు నింపుకున్నది. తెలంగాణలో చాలామందికి ఒకప్పుడైతే గోదావరి నది తమ నేల మీదుగా ప్రవహిస్తుందనే విషయం కూడా తెలియదు. గోదావరి అంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలది, ఆంధ్ర ప్రాంతానిదే. విషయాలు తెలిసి నాకు కూడా.నైసర్గిక స్థితి రీత్యా గోదావరి నీరు తెలంగాణకు అందటం ‘అసాధ్యం’ అన్న వలస పాలకుల ప్రచారాలనే అమాయకంగా, నిస్సహాయంగా నమ్మారు. ఈ మిథ్యా చరిత్ర అంతా తలకిందులు అవుతున్న తీరు కూడా ముఖ్యమంత్రి మేధో నేపథ్యంలో ఉండినందునే ఆయన కొండపోచమ్మకు ఆ శిఖరాగ్రం నుంచి వాయినం వదులుతూ ఆ విధంగా గర్వించి ఉంటారు. ఇదంతా తెలంగాణ అవతరించిన ఆరేండ్ల సందర్భంగా జరుగటం గర్వకారణం. 

ఒకవైపు ఆ విధమైన అపూర్వస్థాయి ధాన్య సేకరణా సామర్థ్యం, మరొకవైపు చూస్తూ చూస్తుండగానే శరవేగంతో పూర్తవుతున్న జలాశయాలు తెలంగాణ ప్రజలను పరవశింపజేయటంతోపాటు తమ నాయకుని వలెనే గర్వింపజేస్తుండటం సర్వత్రా కనిపిస్తున్నదే. ఇతర రాష్ర్టాల వారిని, జాతీయస్థాయి పరిశీలకులను ఆకర్షించి మెప్పించిన ఇటీవలి విశేషాలలో ఇవి రెండు మాత్రమే. కరోనా సమస్యను ఎదుర్కొంటున్న తీరు, వలస కార్మికులకు అండగా నిలిచిన పద్ధతి, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలను, ఈ విపత్తును సాకు చేసుకుంటూ షికాగో స్కూల్‌ మార్గంలో భారీ ప్రైవేటీకరణలను ప్రతిఘటించిన ధోరణి ఆలోచనాపరుల దృష్టిని అంతటా ఆకర్షించింది. టీఆర్‌ఎస్‌ నాయకత్వం కేంద్రంతో మంచికోసం సహకరిస్తూనే చెడు అనుకున్నప్పుడు స్వతంత్ర వైఖరి తీసుకుంటుంది తప్ప జంకటం గాని, లొంగటం కాని చేయబోదంటూ గతం నుంచీ ఒక మేరకు ఉండిన గుర్తింపు ఇటీవలి కాలంలో బాగా బలపడింది. అది కేసీఆర్‌కు ఒక ఆరోగ్యకరమైన, రాజీలేని ఫెడరల్‌ శక్తి అనే ప్రతిష్ఠను తెచ్చిపెడుతున్నది.

ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఒకటున్నది. 

ఒక రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా బాగా పరిపాలించినా, ప్రజల మెప్పును సంపాదించినా, మనది సువిశాల దేశం, వైవిధ్య దేశం అయినందున ఆ మంచి అన్నది కొద్దిగా తప్ప ఇతర రాష్ట్ర వాసులు, జాతీయ పరిశీలకుల దృష్టికి పోదు. ఆంధ్రప్రదేశ్‌ వంటి మరో తెలుగు రాష్ట్రం, లేదా ప్రత్యేక అధ్యయనాలు జరిపే జాతీయసంస్థలు, కేంద్రప్రభుత్వ శాఖల విషయం వేరు. బయటి మీడియా కూడా ఎక్కువ పట్టించుకోదు. కాని సదరు రాష్ట్రంలో జరిగేవి, అక్కడి ప్రభుత్వ వైఖరులు, అధికార పక్షపు వైఖరులు జాతీయ వ్యవహారాలను, అంతర్రాష్ట్ర విషయాలను ప్రభావితం చేయగలవి అయితే అప్పుడు ఆ రాష్ట్రం జాతీయ పరిశీలకులు, మీడియా, మేధావులు, దూర రాష్ర్టాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ప్రకారం చూసినప్పుడు కేసీఆర్‌ తన మొదటి విడత పాలనలో స్థానికంగా జనరంజకమైనవి అనేకం చేసినా, రెండవ విడతలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అంతటా ఎక్కువ గుర్తింపును పొందుతున్నాయి. ఈ స్థితిని ఆలంబనగా చేసుకుంటూ ఇకనుంచి మొదలుకొని, ఆయన మొదటి విడతలో తర్వాత రెండవ విడతలో చేస్తూ వస్తున్న స్థానికమైన సుపరిపాలనా చర్యలు క్రమంగా జాతీయ దృష్టికి, దూర రాష్ర్టాల దృష్టికి వెళ్లగల అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఈ మంచి గురించిన ప్రచారం జాతీయస్థాయిలో మొదటినుంచీ అవసరమన్న సూచనలు కేసీఆర్‌ దృష్టికి మొదటి విడతలోనే వెళ్లాయని, కానీ ఆయన ముందుగా ఇంట గెలిస్తే తర్వాత రచ్చ గెలవటం దానంతట అదే జరుగుతుందన్న వైఖరి తీసుకున్నట్లు విన్నాము. ఇప్పుడది వాస్తవరూపం తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వం చేసే మంచిని ఈ ఆరేండ్లుగా సినిక్స్‌ నిందలను భరిస్తూ బలపరుస్తున్న రచయితలకు ఇదంతా పెద్ద ఊరట అనాలి.

ఇటువంటివి పేర్కొనేందుకు ఇంకా అనేకం ఉన్నాయి. అవి బయటివారికి కాకున్నా ఈ రాష్ట్రం వారికి, పొరుగున గల మరో తెలుగు రాష్ట్రం వారికి అను నిత్యం తెలియవస్తున్న విషయాలే. రకరకాల విమర్శకులకు అందుకు మొదటినుంచి అనేక కారణాలున్నాయి. అందులో కొన్ని సహేతుకమైనవి కావచ్చు. కానీ కేవలం తగు సమాచారం తెలుసుకోకపోవటం వల్ల, సిద్ధాంతాలూ ఆదర్శాలూ తెచ్చిపెట్టిన దురభిప్రాయాల సాంప్రదాయిక వ్యతిరేకతల వల్ల, ఆబ్జెక్టివిటీ కన్న సబ్జెక్టివిటీ ఎక్కువై అందులో కొంత అహంభావం రంగరించుకోవటం వల్ల, ప్రజల ప్రత్యక్ష అనుభవాలను, అభిప్రాయాలను తెలుసుకునే ఓపెన్‌మైండ్‌ లేకపోవటం వల్ల కలిగిన సినిసిజం ఇప్పుడు మెల్లగా పోతున్నట్లు తోస్తున్నది.


logo