శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jun 03, 2020 , 23:13:53

జీవ వైవిధ్యంతోనే మనుగడ

జీవ వైవిధ్యంతోనే మనుగడ

చైనాలో ఒకప్పుడు ఎలుకలు, పిచ్చుకలను ఆహార పంటలను నాశనం చేస్తున్న జాతులుగా గుర్తించి వాటిని భారీ ఎత్తున నిర్మూలించారు. కానీ మిడతలను తిని వాటి సంఖ్యను పరిమితం చేసే పిచ్చుకలు తగ్గడం వల్ల మిడతలు పెరిగిపోయాయి. పంటలకు పిచ్చుకలు చేసే నష్టం కంటే అనేక రెట్లు మిడతల వల్లనే సంభవించింది. దీంతో చైనా మళ్లీ రష్యా నుంచి పిచ్చుకలను దిగుమతి చేసుకొని వాటి సంఖ్యను వృద్ధి చేసింది.

జీవవైవిధ్యం జాతీయ సంపదకు సూచిక వంటిది. నేలపై, నీటిలోని ఆవరణ వ్యవస్థలలో నివసిస్తున్న జీవరాశులు వాటిమధ్యన గల భిన్నత్వాన్నే జీవవైవిధ్యంగా పిలుస్తారు. జాతుల వైవిధ్యం, పర్యావరణ వైవిధ్యం మానవ వికాసానికి కీలకమైనవి. వైవిధ్యాన్ని సంరక్షించడమంటే ఉత్పాదక, వినియోగ, ఆహ్లాద, సాంస్కృతిక, నైతిక విలువలను సాగు చేయడమే.

కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచమంతా, మిడతల దండయాత్రతో పలు దేశాలు విలవిలలాడుతున్న సందర్భంలో జూన్‌-5 పర్యావరణ దినోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది. మానవ జాతి చరిత్రలో అంతరించటం పునరుద్ధరణల మధ్య తీవ్ర అగాధం ఏర్పడి ఎన్నడూలేని వేగంతో జాతుల విలుప్తతలో ఆరవ మహా విపత్తు వైపు పయనిస్తున్నాం. విచక్షణ లేని నేల, సముద్ర వినియోగం, జంతువుల వేట, వాతావరణ మార్పు, కాలుష్యం, హానికర అవాంఛిత జీవుల అనూహ్య వృద్ధి వల్ల జీవవైవిధ్య ఆవరణ వ్యవస్థలకు ప్రమాదం కలుగుతున్నది. అణు పరీక్షలు, ఆయుధాల ఉత్పత్తి, వైమానిక, నౌకాదళ దాడుల సందర్భంగా వెలువడే విస్ఫోటాలు, శబ్దాలు, రసాయనాలు జీవుల ఆవాసాలకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి.

చైనాలో ఒకప్పుడు ఎలుకలు, పిచ్చుకలను ఆహార పంటలను నాశనం చేస్తున్న జాతులుగా గుర్తించి వాటిని భారీ ఎత్తున నిర్మూలించారు. కానీ మిడతలను తిని వాటి సంఖ్యను పరిమితం చేసే పిచ్చుకలు తగ్గడం వల్ల మిడతలు పెరిగిపోయాయి. పంటలకు పిచ్చుకలు చేసే నష్టం కంటే అనేక రెట్లు మిడతల వల్లనే సంభవించింది. దీంతో చైనా మళ్లీ రష్యా నుంచి పిచ్చుకలను దిగుమతి చేసుకొని వాటి సంఖ్యను వృద్ధి చేసింది. ప్రస్తుతం భారత్‌తోపాటు అనేక ఆసియా ఆఫ్రికా దేశాలు మిడతల దాడికి లోనవుతున్నాయి. మిడతలను తినే పాములు, మైనాలు, నెమళ్లు, కాకులు తదితర పక్షిజాతులు మానవ చర్యల ఫలితంగా తగ్గడంతో మిడతల సంఖ్య పెరిగిపోతున్నది. అవి పంటలను భారీస్థాయిలో నష్టపరిచి ఆహార భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భూమిపై ఆహార పంటలు, ఫలాలు, ఔషధాలు ఇచ్చే డబ్భు శాతం మొక్కలకు కీటకాలు, పక్షులు పరాగ సంపర్క సహకారులుగా ఉంటాయి. మానవ చర్యలతో పారిశ్రామిక దుష్ఫలితాలతో అనేక కీటక, పక్షిజాతులు అంతర్థానమవుతున్నాయి. కీటక జనాభా ఏటా 2.5 శాతం క్షీణిస్తున్నది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల పంటల దిగుబడి తగ్గిందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై భయానుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీటక, పక్షిజాతులు తగ్గడంతో హానికర, వ్యాధికర జీవులు ప్రబలి అటవీసంపద వేగంగా క్షీణిస్తున్నది. ఇదేవిధంగా మొక్కలు నేలలోని నీటిని వాతావరణానికి చేర్చే జల చక్రానికి విఘాతం కలుగుతున్నది.

మానవ జీవనానికి అనుకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమిని సంరక్షించుకోవాలి. భవిష్యత్‌ తరాలకు అందించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ) 1974 నుంచి ఏటా జూన్‌ 5ను పర్యావరణ దినంగా పాటిం చాలని పిలుపునిచ్చింది. భూగోళం వేడెక్కడం, సుస్థిర వినియోగం, కాలుష్యం వంటి అనేక అంశాల మీద 150 దేశాల్లో అవగాహన చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ పరంపరలో జూన్‌ 5, 2020ని జీవ వైవిధ్యం ఇతివృత్తంతో నిర్వహించాలని కోరింది. భూమిపైని జీవవైవిధ్యంలో పది శాతం క్షీరదాలను, 14 శాతం ఉభయజీవులను, 18 శాతం పక్షులను కలిగిఉన్న కొలంబియా సహకారంతో, ఆర్థికంగా సాయపడుతున్న జర్మనీతో కలిసి యూఎన్‌ఈపీ అనేక కార్యక్రమాలను రూపొందించుకున్నది. 2020 నుంచి ప్రకృతి భూగోళం సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉన్నందున యుద్ధప్రాతిపదికన కార్యాచరణకు పూనుకొని జీవవై విధ్యం, ఆవరణ వ్యవస్థల రక్షణ కోసం కృషిచేయాలని పిలుపునిచ్చింది. వాటిని సాధారణ స్థితికి తీసుకురావడం ద్వారా ఆహారభద్రతకు హాని కలుగకుండా చూడాలని కోరింది. ఐరాస 2011-2020ని జీవవైవిధ్య, 2021-2030ని ఆవరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దాలుగా ప్రకటించింది.

ఆకలి, పేదరికం, ఆరోగ్యం, నీరు, వాతావరణ మార్పు వంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రగతికి బదులు తీవ్రమైన తిరోగమన ధోరణులు ప్రారంభమయ్యాయని జీవవైవిధ్య, ఆవరణ వ్యవస్థల సేవలపై ఏర్పాటైన ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్స్‌ పాలసీ ప్లాట్‌ ఫాం హెచ్చరించింది. 2050 నాటికి ప్రస్తుతం భూమిపై ఉన్న జాతులలో 30 శాతం అంతరిస్తాయని పేర్కొ న్నది. జీవవైవిధ్యం జాతీయ సంపదకు సూచిక వంటిది. నేలపై, నీటిలోని ఆవరణ వ్యవస్థలలో నివసిస్తున్న జీవరాశులు వాటిమధ్యన గల భిన్నత్వాన్నే జీవవైవిధ్యంగా పిలుస్తారు. జాతుల వైవిధ్యం, పర్యావరణ వైవిధ్యం మానవ వికాసానికి కీలకమైనవి. వైవిధ్యాన్ని సంరక్షించడమంటే ఉత్పాదక, వినియోగ, ఆహ్లాద, సాంస్కృతిక, నైతికవిలువలను సాగు చేయడమే.

(రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం) 


logo