శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jun 03, 2020 , 23:13:53

జర పైలం!

జర పైలం!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ క్రమంగా సడలుతున్నది. ఇక విముక్తి లభించిందని, నిత్యజీవితానికి స్వేచ్ఛ దొరికిందని నిర్భయంగా విచ్చలవిడిగా తిరుగొచ్చనుకుంటే పొరపాటే. ఇలాంటి వైరస్‌లు వచ్చిపోయాయనుకుంటే, కొంతకాలం తర్వాత తిరిగి ప్రత్యక్షమైనట్టు గతంలో జరిగిన ఘటనలు చూస్తే తెలుస్తున్నది. పూర్వపు స్థితి వచ్చిందని పాత పోకడలకు పోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుంది. ప్రధాని మోదీ కూడా వైరస్‌ మళ్లీ జూన్‌-జులైలో విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి లాక్‌డౌన్‌ పొడిగించకపోయినా ప్రజలు జాగరూకతతో నడుచుకోవాలి. ముఖ్యంగా భౌతికదూరం పాటించడంలోనూ, మాస్క్‌లు ధరించడంలోనూ, పరిశుభ్రత పాటించడంలోనూ ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించాలి. భవిష్య త్తులో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులూ చెబుతున్నారు.

వైరస్‌ వ్యాప్తి ఉన్న ‘హాట్‌స్పాట్స్‌'లో సడలింపులుండవు. మిగతా ప్రాంతాల్లో కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. కంటైన్మెంట్‌ జోన్లను పూర్తిగా ఎత్తివేసినప్పుడు మాత్రమే కరోనా ప్రభావం కనుమరుగైందని అనుకోవచ్చు. 

కొవిడ్‌-19 ప్రపంచదేశాలను భయపెట్టింది. అగ్రదేశాలు కూడా ఈ వైరస్‌ బారిన పడి మట్టికరిచాయి. టెక్నాలజీలో ముందున్నామన్న గర్వంతో కరోనాను లెక్కచేయక, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఊహించని ప్రాణనష్టాన్ని చవిచూడక తప్పలేదు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లవచ్చు. కరోనా వైరస్‌ అంతమైన తర్వాత ఆ నష్టాన్ని అధిగమించవచ్చు.

భౌతికదూరాన్ని పాటించడం, శానిటైజర్‌ వాడటం, మాస్కులు ఉపయోగించడం, ఇంటినుంచి బయటకువెళ్లకుండా ఉండటం అంటేనే అది మనిషికి సమరం లాంటిది. ఈ సమరంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు రోజుల తరబడి తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి దేశ సరిహద్దుల్లో పాల్గొనే సైనికుల్లా సేవలందించి త్యాగధనులు అనిపించుకున్నారు. ఈ ఆపత్కాలంలో పేదలను, అభాగ్యులను, వలస కార్మికులను ఆదుకోవడానికి ఎందరో దాతలు ముందుకువచ్చి వారి ఆకలి తీర్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకొని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అరికట్టగలిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు సరిపడా బియ్యంతోపాటు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవడం అభినందనీయం.

కరోనా నియంత్రణలో పౌరులంతా భాగస్వాములం కావాలి. కరోనా మానవుని జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. అందులో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటించటం ఒకటి. కరచలనాలకు, ఆలింగనాలు వదిలి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు. భవిష్యత్తులో అదే అందరి సంస్కారం కావాలి. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడానికి పసుపు, నిమ్మకాయ, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు తగిన మోతాదులో వంటల్లో, వేడి పానీయాల్లో సేవించడం అలవాటుగా మారాలి. మరి కొంతకాలం సినిమా హాళ్ళు, బార్లు, హోటళ్ళకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సామూహిక కార్యక్రమాలు పెండ్లిళ్లు, పేరంటాలు తక్కువ మందితో జరుపుకోవాలి. ఏదేమైనా ఈ ‘వైరస్‌'ను దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణతో నియమాలు పాటిస్తూ ఏడాదిపాటు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది.

(వ్యాసకర్త: సీనియర్‌ విశ్లేషకులు)


logo