ఆదివారం 12 జూలై 2020
Editorial - Jun 02, 2020 , 22:41:30

గగనంలోకి ప్రైవేటురథం

గగనంలోకి ప్రైవేటురథం

ప్రైవేటు సంస్థ సొంత వ్యోమనౌక ద్వారా మానవులను గగనతలంలోకి చేర్చడంతో అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన ఇద్దరు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్‌ సంస్థ విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించగలిగింది. ఫాల్కన్‌ 9 అనే రాకెట్‌ ద్వారా క్రూ డ్రాగన్‌ అనే స్పేస్‌ క్యాప్సూల్‌ను భూమికి అతి దగ్గరి కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఈ క్రూ డ్రాగన్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానం కావడంతో వ్యోమగాములు అందులోకి ప్రవేశించారు. రాకెట్‌ ప్రయోగం మొదలుకొని అనుసంధానం వరకు మొత్తం కార్యక్రమం మానవ ప్రమేయం లేకుండా స్వయంచాలన యంత్రాలతోనే జరగడం మరో విశేషం. 2011 వరకు స్వయంగా వ్యోమనౌకలను ప్రయోగించిన నాసా ఆ తరువాత నిలిపివేసింది. ప్రైవేటు సంస్థలు ఎదిగే వరకు రష్యా అంతరిక్ష నౌకల ద్వారా తమ వ్యోమగాములను పంపించింది. క్రమంగా ప్రైవేటు సంస్థలు అంతరిక్ష కార్యక్రమాలు చేపట్టడానికి హంగులను సంతరించుకోవడం మొదలైంది. 

అమెరికా ప్రభుత్వం ప్రైవేటు రంగానికి ఊతమివ్వాలని నిర్ణయించుకోవడంతో  ‘ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా’ అన్నట్టు విమానయానంలో చేయితిరిగిన బోయింగ్‌ సంస్థతో పాటు పలు కంపెనీలు అంతరిక్ష వ్యాపారంలోకి దూకాయి. భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్‌కు అనేక కంపెనీల నుంచి పోటీ ఎదురయ్యే పరిస్థితి ఉన్నది. స్పేస్‌ఎక్స్‌ సాఫల్యం నేపథ్యంలో  నాసాకు ఇస్రో అభినందనలు తెలుపడం గమనార్హం. కొంతకాలంగా తమ ప్రాజెక్టులలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఇస్రో పెంచుతూ ఉన్నది. ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహమివ్వాలనేదే కేంద్ర ప్రభుత్వ విధానమైనప్పటికీ, ఇంకా పలు నిబంధనలు అవరోధంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రైవేటు సంస్థలు ఎదిగే కొద్దీ వాటి భాగస్వామ్యాన్ని పెంచుతూ పోవాలనే అభిప్రాయం కూడా ఉన్నది. ఇందుకోసం అంతరిక్ష కార్యకలాపాల ప్రోత్సాహక బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 

భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలు కొత్తపుంతలు తొక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాత్మకంగా అంతరిక్ష యాత్రలను చేపట్టాలనేది స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అభిలాష. మస్క్‌ పథకం ప్రకారం- ఒక అంతరిక్ష నౌకలో వంద మంది యాత్రికులు ప్రయాణించవచ్చు. చంద్రుడిపైకి ఆ తరువాత అంగారకుడిపైకి యాత్రలను నిర్వహించాలని స్పేస్‌ఎక్స్‌ ప్రయత్నిస్తున్నది. 2050 నాటికి అంగారకుడిపై పది లక్షల జనాభా గల నగరాన్ని నిర్మించాలనేది మస్క్‌ ఆలోచన! అక్కడ పిజ్జాలు మొదలుకొని అన్నీ లభిస్తాయట! మనదేశం మానవులను అంతరిక్షంలోకి పంపడానికి ‘గగన్‌యాన్‌' పథకాన్ని చేపట్టింది. ఖగోళరంగంలో ప్రపంచానికే పాఠాలు చెప్పిన చరిత్ర భారతీయులది. మనం గగన్‌యాన్‌ దగ్గర ఆగిపోకూడదు. ‘గ్రహరాశులనధిగమించి ఘన తారల పథమునుంచి, గగనాంతర రోదసిలో గంధర్వ గోళ గతుల దాటి, చంద్రలోకమైనా, దేవేంద్ర లోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే’ రోజు కోసం ఎదురు చూద్దాం! 


logo