ఆదివారం 12 జూలై 2020
Editorial - Jun 02, 2020 , 22:41:33

చితికిన బతుకుల్లో చిగురాశలు

చితికిన బతుకుల్లో చిగురాశలు

ఎట్టకేలకు తెలంగాణ రైతు కోరిన కాలం వచ్చింది. కొండ దిగువన ఉన్న గోదారి ఉప్పొంగి ఎగిసింది. మైళ్ళు మైళ్ళు దాటివచ్చిన గోదావరమ్మతో జోటపాటలు పట్టి తానె సాగరమై రూపెత్తింది కొండపోచమ్మ తల్లి. సిద్దిపేట, మెదక్‌, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి.. ఈ నాలుగు జిల్లాల పాలిట కల్పవల్లియై పాలధార పరుగులు పెట్టింది. మూడు లక్షల ఎకరాలకు పచ్చని పంటల వరమిస్తూ సాగివచ్చింది.

కొమురెల్లి మల్లన్న చెల్లెలు కొండపోచమ్మ. సాక పోసి పూజిస్తే కాచి రక్షిస్తుంది. అందుకే గజ్వేల్‌ నియోజకవర్గంలోని రెండు రిజర్వాయర్లకు ఆ అన్నాచెల్లెండ్ల పేరుపెట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌కు అల్లంతదూరానే ఈ కొండపోచమ్మసాగర్‌. 

రైతు నాగలి మోస్తున్నాడు

క్రీస్తు శిలువ మోసినట్లు-శేషేంద్ర

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రైతుకు శిలువను మించిన శిక్ష విధించింది. నదులు నెత్తుటిధారలై కారిపోతే, చెరువులు చెరగని గాయాలుగా మిగిలిపొయినయి. వివక్ష ఒక విలయమై రైతు జీవితం ఛిద్రమైపోయింది. రైతుల బలవన్మరణాలతో ప్రతి పల్లె మరుభూమిగా మారిపోయింది. ఈ ఘోరకలిని చూస్తూ కొండపోచమ్మ తల్లి ఎంత విలపించిందో. గర్భశోకం నుంచి విముక్తి కోసం ఎంత వేచిచూసిందో. ఆమె కనురెప్పల కింద అణిగిన కన్నీటిలో ఎన్ని విషాదకథలు కరిగి నీరయ్యినయో.

కర్రె బీరప్పది గజ్వేల్‌ దగ్గర తిమ్మక్కపల్లి, కుర్మోల్ల పిల్లగాడు. తనకు రెండెకరాల భూము న్నది. మంచి పనోడు కనుక ఇంకో ఐదెకరాలు కౌలుకు తీసుకున్నడు. ఊర్కె కిరాయి ఖర్చు ఎందుకని, తనే లక్షా ఇరువై వేలు పెట్టి ఓ ట్రాక్టర్‌ కొనుక్కున్నడు. ఆయేడు వానలు సరిగ్గ పడలేదు. అనుకున్నట్టు పంట పండలేదు. ఉన్న అప్పు తేరలేదు. కొత్త అప్పు పుట్టలేదు. 

బీరప్ప రంది చూసి భార్య కవితకు బుగులు పట్టుకున్నది. కంటికి రెప్పతీర్గ బీరప్పను కాచుకొనే ఉంటున్నది. ఓనాడు రాత్రి తొమ్మిదిన్నరకు బాయికాడికి పోయిండు రైతు బీరప్ప. తన దోస్తు భాస్కర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ‘నేను చచ్చిపోతున్న, నా భార్యాపిల్లలు పైలం. వాళ్లను దిక్కులేనోల్లను చేసి నేను పోతున్న’ అని ఏడ్చిండు. అందరు ఆగమాగం బాయికాడికి ఉరికిన్రు. అప్పటికే జరుగరానిది జరిగిపోయింది. బాయి దగ్గర చెట్టుకు ఉరిపోసుకున్నడు బీరప్ప. తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుకున్న పార్టీలు పత్రికలు బీరప్ప విషాదకథను అడ్డం పెట్టుకొని, అప్పుడే ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం మీద దాడిచేసినయి. ఉమ్మడి రాష్ట్రంలో అత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు లక్షా యాభై వేలు మాత్రమే పరిహారంగా దక్కేవి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ పరిహారాన్ని ఆరు లక్షలకు పెంచిండు. బీరప్ప భార్య కవితకు ఆ ఆరు లక్షలే బతికేటందుకు ఆధారమైనయి.

చంద్రబాబు పరిపాలనాకాలంలో గజ్వేల్‌ దుబ్బాక ప్రాంతంలో ఆత్మహత్యలు ఆకలిచావులు అనేకం జరిగినయి. ఆ విషాద ఘటన లను రాసుకోవటం కలెక్టర్లకు నివేదికలు సమర్పించుకోవటం మాకు నిత్యకృత్యమైంది. జీవితాలు ఎంత విచ్ఛిన్నమైపోయినయో మాటల్లో చెప్పలేం. దుబ్బాకలో దాసరోల్ల లక్ష్మి ఒక వ్యవసాయ కూలీ. వరుస కరువులతో పని దొరుకలేదు. తిండి కూడా కరువైపోయింది. చానా రోజులు చాలీచాలని తిండి తిని కడుపునొప్పి మొదలైంది. కొన్నాళ్ళకు చచ్చిపోయింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో ఆమె భర్త తాగుడుకు మరిగిండు. వాళ్ళకు పదేండ్ల కొడుకు, మూడేండ్ల బిడ్డ. ముక్కుపచ్చలారని పసివాడి మీద కుటుంబ భారం పడ్డది. కల్లు దుకాండ్ల సీసాలు కడిగే పనికి కుదిరిండు. ఎట్లా బతుకుతవు బిడ్డా అని అడిగితే కల్లు దుకాణం సేటును చూపిస్తూ సేటుకు దండం పెట్టి, చెల్లెను సాదుకుంట సార్‌! అన్నడు. నాడు ఆ పసివాని లేత ముఖంలో కదిలిన ఆ దుఃఖపు నీడలు ఇప్పటికీ కండ్లల్లో మెదులుతూనే ఉంటయి. ఇట్లా ఎంతమంది పసిపిల్లల బతుకులు అగాధమైపోయినయో.

జగదేవ్‌పూర్‌ మండల కొండాపూర్‌కు చెందిన తిగుళ్ళ కనకయ్యదీ అదే విషాదం. ఆయనది ముదిరాజు కులం. తనకున్నది నాలుగెకరాల చెల్క. బాయి తవ్విండు. నీళ్ళు పడలే. ఐదు బోర్లేసిండు. చేసేదేమీలేక ఇంటిల్లిపాదీ హైదరాబాద్‌కు బత్కపోయిన్రు. ఆడపిల్లలు పెద్దగయిన్రు పెండ్లి జెయ్యాలె. కనకయ్యకు మనసు మళ్ళ వ్యవసాయం మీదికి మళ్ళింది. ఐదు బోర్లేసిండు. అప్పు మిగిలింది తప్ప ఫలితం రాలేదు. భార్య కిష్టమ్మ మళ్ళా బత్కపోదామన్నది. పట్నంల ఎంతజేసినా తిండి మందమే గదా అని నిరాశపడ్డడు కనకయ్య. ఎప్పటిలెక్కనే పొద్దున్న లేచి బాయికాడికి పోయిండు. పురుగులను చంపేటందుకు తెచ్చిన మొనోక్రోటోఫాస్‌ తాగి జీవిడ్సిండు. ఎన్నెన్ని ఘోరాలు, ఎన్నెన్ని బలవన్మరణాలు, కరువుకాటకాలు, వలసలు, ఆత్మహత్యలతో, నిర్ధూమధామాలైపోయినయి గజవెల్లి, దుబ్బాక పల్లెలు.

ఎట్టకేలకు తెలంగాణ రైతు కోరిన కాలం వచ్చింది. కొండ దిగువన ఉన్న గోదారి ఉప్పొంగి ఎగిసింది. మైళ్ళు మైళ్ళు దాటివచ్చిన గోదావరమ్మతో జోటపాటలు పట్టి తానె సాగరమై రూపెత్తింది కొండపోచమ్మ తల్లి. సిద్దిపేట, మెదక్‌, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి.. ఈ నాలుగు జిల్లాల కల్పవల్లియై పాలధార పరుగులు పెట్టింది. మూడు లక్షల ఎకరాలకు పచ్చని పంటల వరమిస్తూ సాగివచ్చింది.

కొమురెల్లి మల్లన్న చెల్లెలు కొండపోచమ్మ. సాక పోసి పూజిస్తే కాచి రక్షిస్తుంది. అందుకే గజ్వేల్‌ నియోజకవర్గంలోని రెండు రిజర్వాయర్లకు ఆ అన్నాచెల్లెండ్ల పేరు పెట్టిండు సీఎం కేసీఆర్‌. అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌కు అల్లంతదూరానే కొండపోచమ్మ సాగర్‌. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరి మాతకు సారె సమర్పించిండు. ఇక ఏ ఇల్లాలి పసుపు కుంకుమల సౌరు కరువుకు ఆహుతికావద్దని మొక్కుకొని, పసుపు కుంకుమలు చెల్లించిండు. అమృతధార అంచుల మీద ఇంద్రధనుసు రంగులు పూయిస్తూ గోదావరి కొండపోచమ్మ జలాశయంలోకి చేరింది.

కొండపోచమ్మ సాగరం ప్రారంభోత్సవం చూసి పట్టరాని సంతోషంతో ఫోన్‌ చేసిండు పులి రాజు. తాను వర్గల్‌ మండలం తునికి ఖల్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నడు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల సంక్షేమం కోసం పులిరాజు ఎంతో పనిచేసిండు. ఆ కుటుంబాల వివరాలు రాసి, ఆఫీసుల చుట్టూ స్వచ్ఛంద సంస్థల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినవాడు. కాల్వల నీళ్ళతోటి గజెల్లి ఇక పాలవెల్లి అయితది సార్‌! .. రెండెకరాలున్న రైతుకు ఫసల్‌కు కనీసం 60 క్వింటాళ్ల ధాన్యం పండుతదట, యాడాదికి రెండు పంటలు గ్యారంటీగా పండుతయట. రైతు రంది లేకుంట బతుకుతడు. మెట్ట ప్రాంతాల్లోనైతే రైతు భూమిని నాలుగైదు సార్లు దున్నాలెనట. ఇప్పుడు గోదావరి నీళ్ళతో చేసే సాగు కనుక ఒకసారి దున్నితే చాలట. శానా కష్టం తప్పినట్టే ఇగ.. భూగర్భజలాలతోటి దిగుబడి తక్కువ వస్తది. కాల్వల నీళ్ళతోటి ఎక్కువొస్తది. అంతేకాదు చీడపీడలు గూడా తక్కువొస్తయట. క్రిమి సంహారకాల వాడకం తగ్గిపోయి భూమి కాలుష్యం తగ్గుతదట.

సాగుభూమి విస్తీర్ణం పెరిగి హార్వెస్టర్లు పెరుగుతయి. ఎక్కువ హార్వెస్టర్లయితే వాటి కిరాయి రేటు తగ్గుతదట. ఇంక నాట్లేసే మిషిన్లు ఒస్తయి. ఇంకా పాడి పెరుగుతది. ఎరువుల దుకాండ్లు, మొబైల్‌ షాపులు సుత పెరుగుతయి, మెకానిక్లకు చేతినిండా పనుంటది. కచ్చీరుకాడ పన్లేని ముచ్చట్లు, పంచాయతులు అన్ని బందయితయట. సాధారణంగ ఎండకాలం మద్యం అమ్మకాలు ఎక్కువుంటయి. వానకాలం తక్కువుంటయి. ఎందుకంటే చేతినిండా పనుంటే ఎవ్వరు తాగరు. ఇప్పుడు ఏ కాలమైనా నీళ్లుంటయి. ఇగ పనికి కొదువలేదు. పనుంటది కనుక తాగుడు దానంతటదే బందయితది. వాతావరణం చల్లపడుతది. పశువులు, పక్షులు గూడా చల్లగ బతుకుతయి..’ చెప్పుకుంట పోతున్నడు రాజు. ఫోన్‌లో పులిరాజు మాటల హోరు ఒకవైపు, గోదావరి నీటిహోరు మరొకవైపు వీనుల విందు చేస్తుంటే ఎగిసిపడే తుంపరలు తనువును తడుపుతూ హృదయాన్ని చల్లబరుస్తున్నయి సాయంసంధ్యా కాంతులలో ఉత్తుంగతరంగ గౌతమీగంగలో పున్నమి చందమామలా నవ్వింది కొండపోచమ్మ.


logo