ఆదివారం 12 జూలై 2020
Editorial - Jun 02, 2020 , 22:41:29

నీళ్లు ఇప్పుడెట్లెక్కినయ్‌!

నీళ్లు ఇప్పుడెట్లెక్కినయ్‌!

తెలంగాణ సాగు, తాగునీటి దాహార్తిని గోదావరి మాత్రమే తీర్చగలదని కేసీఆర్‌ గుర్తించి మేడిగడ్డ వద్ద మహత్తర కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ప్రారంభించిన మూడేండ్లలోనే 618 మీటర్ల ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్‌కు గోదావరిని తరలించి కాళేశ్వరాన్ని పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు జీవధారగ మారనున్నది. దీనిద్వారా తెలంగాణలోని 22 జిల్లాలకు లబ్ధి చేకూరనున్నది.

వ్యవసాయ అనుబంధ పాడి, గొర్రె మాంసం, చేపల పెంపకం, పౌల్ట్రీ రంగాలకు చేయూతనిస్తున్నది. ఇప్పటికే 10 లక్షల గొల్లకుర్మ కుటుంబాలకు రూ.10 వేల కోట్లను పంపిణీ చేసింది. మత్స్యపరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తూనే అనేక ఇతర వృత్తులను ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నదీ రాష్ట్ర ప్రభుత్వం.

ఓ నల్లానల్లని మబ్బుల్లారా వస్తారా!

ఎదలోతుల్లోన వాన జల్లి పోతారా! 

ప్రజాకవి జయరాజన్న ఈ పాట నాటి తెలంగాణ కరువు, ప్రజల దాహార్తికి నిలువుటద్దం. నెర్రెలు బారిన బీళ్లతో, నీళ్ళు లేక ఎండిన చేళ్లతో, ఎండిన బోర్లతో, కాలిన మోటర్ల కరెంటు కష్టాలతో, శాశ్వత కరువుతో నాడు రైతులు అరిగోస పడ్డారు. సముద్రమట్టానికి, గోదావరి, కృష్ణమ్మలకు అందనంత ఎత్తులో తెలంగాణ ఉందనే సాకుతో వలసపాలకులు, తెలంగాణ అభివృద్ధి వ్యతిరేకులు నాడు ఈ ప్రాంతాన్ని ఎండబెట్టారు. కానీ కేసీఆర్‌ నీటి ప్రవాహానికి ఎత్తు అడ్డంకి కాదని నిరూపించి తెలంగాణ బీళ్లకు మళ్ళిస్తున్నారు. నిన్నటితో తెలంగాణ ఏర్పడి ఆరేండ్లు పూర్తిచేసుకున్నది. అతితక్కువ కాలంలో తెలంగాణ అనేకరంగాల్లో పురోగతిని సాధించింది. 

తెలంగాణ సాగు, తాగునీటి దాహార్తిని గోదావరి మాత్రమే తీర్చగలదని కేసీఆర్‌ గుర్తించి మేడిగడ్డ వద్ద మహత్తర కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ప్రారంభించిన మూడేండ్లలోనే 618 మీటర్ల ఎత్తులో గల కొండపోచమ్మకు గోదావరిని తరలించి కాళేశ్వరాన్ని పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు జీవధారగ మారనున్నది. దీనిద్వారా తెలంగాణలోని 22 జిల్లాలకు లబ్ధి చేకూరనున్నది. దాదాపుగా 45 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందనున్నది. కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీని పునరుజ్జీవింపజేయడం ద్వారా అది మరింత పెరుగనుంది. 112 టీఎంసీల ఎస్సారెస్పీని నింపడం ద్వారా 14 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు.

కాళేశ్వరం ప్రాజెక్టు చిన్నచిన్న ప్రాజెక్టుల జలాశయాల సమూహం. ఇది డీసెంట్రలైజ్డ్‌ ప్రాజెక్టు. మల్లన్నసాగర్‌ మినహాయిస్తే, కాళేశ్వరంలోని ప్రాణహిత, అన్నారం, సుందిల్ల, రంగనాయకసాగర్‌, గందమల్ల, బస్వాపురం, మలక్‌పేట లాంటి 20 జలాశయాలు తక్కువ నీటి సామర్థ్యం కలవి. మేడిగడ్డ వద్ద ఎత్తబడిన గోదావరి నీళ్ళు మీడియం, చిన్న ప్రాజెక్టులకు తరలించడం, వట్టిపోయిన పాత ప్రాజెక్టులకు అనుసంధానించడం ద్వారా వాటిని పునరుజ్జీవింపజేశారు. చిన్న జలాశయాలను చెరువులకు కుంటలకు అనుసంధానించడం, తద్వారా తెలంగాణ అంతటిని ఒక జీవధారగా మార్చడం కాళేశ్వరం ప్రత్యేకత. ఈ ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పైకి రావటంతోపాటు, వాగులు, వంకల సెలయేర్లతో జీవవైవిధ్యానికి తెలంగాణ నిలయంగా మారుతున్నది.

తెలంగాణ ఇరిగేషన్‌ మోడల్‌ను భవిష్యత్తులో దేశం అనుసరించబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెరిగిన భూగర్భజలాలతో సిరిసిల్ల ఇప్పుడు ముస్సోరీలోని ట్రైనీ ఐఏఎస్‌లకు మాడల్‌ కేస్‌ స్టడీగా మారడమనేది కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితమే. 

కేసీఆర్‌ రాష్ర్టావతరణ తర్వాత తన ఆరేండ్ల పాలనలో వ్యవసాయం, సాగు, తాగునీరు, గ్రామీణ పేదల సంక్షేమం ప్రాధాన్యాంశాలుగా చేర్చుకున్నారు. ‘Bottom up Strategy తో Rural Agricultural Economy’ అనే అభివృద్ధి మాడల్‌ను తెలంగాణలో ప్రారంభించారు. గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు తాగునీటి కోసం మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకు రుణమాఫీ చేయడంతోపాటుగా రైతుబీమా, రైతుబంధుల ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంతోపాటుగా పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటున్నది. వ్యవసాయ అనుబంధ పాడి, గొర్రె మాంసం, చేపల పెంపకం, పౌల్ట్రీ రంగాలకు చేయూతనిస్తున్నది. ఇప్పటికే 10 లక్షల గొల్లకుర్మ కుటుంబాలకు రూ.10 వేల కోట్లను పంపిణీ చేసింది. మత్స్యపరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తూనే అనేక ఇతర వృత్తులను ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నదీ రాష్ట్ర ప్రభుత్వం.

దేశంలో నేడు ఆర్థికవ్యవస్థ జీడీపీ లెక్కలు, విదేశీ పెట్టుబడులు, సేవాసమాచారం, పట్టణాభివృద్ధి చుట్టూతనే తిరుగుతున్నది. అదే నిజమైన అభివృద్ధి అని కొందరు భావిస్తున్నారు. కానీ ఇటీవల కరోనా వైరస్‌ సందర్భంగా దేశంలో కోట్ల మంది వలస కార్మికులు రోడ్లమీద వందల వేల మైళ్లు కాలినడకన వెళుతుండటమనేది అభివృద్ధి నమూనా డొల్లతనాన్ని బయటపెట్టింది. దేశాభివృద్ధి మేడిపండు చందమని బట్టబయలైంది. దేశంలో జరుగుతున్న అభివృద్ధిలో పేదలను, గ్రామీణ భారతాన్ని భాగస్వామ్యం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. 

వేల మంది ఉద్యమకారుల త్యాగాలు, కేసీఆర్‌ నాయకత్వం ఫలితంగా తెలంగాణ ఏర్పడ్డది. ఇప్పుడు అమరుల ఆశయసాధన దిశగా తెలంగాణ పయనిస్తున్నది. కేసీఆర్‌ Bottom up Strategyతో నిర్మిస్తున్న Rural Agricultural Economy తెలంగాణను మరింత ముందుకుతీసుకుపోయి, అది భవిష్యత్తులో దేశానికి ఆదర్శమవుతుందనటంలో అతిశయోక్తిలేదు. 


logo