బుధవారం 30 సెప్టెంబర్ 2020
Editorial - Jun 02, 2020 , 22:41:29

చెప్పిండు, చేసిండు

చెప్పిండు, చేసిండు

రైతుబంధు యావత్తు ప్రపంచానికే ఆదర్శనీయం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, మిషన్‌ భగీరథతో అన్ని గ్రామాలకు సురక్షితమైన నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్వల్పకాలంలోనే పలురంగాల్లో అద్భుత ప్రగతిని సాధించింది. తెలంగాణను కోటి ఎకరాల పచ్చని మాగాణంగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ఆయన ముందు కువెళ్తున్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలతో దార్శనిక పాలనను అందిస్తున్నది. ఇక్కడి పలు సంక్షేమ పథకాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. 

రైతుబంధు పథకం దేశానికే కాదు, యావత్తు ప్రపంచానికి ఆదర్శనీయం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, మిషన్‌ భగీరథతో అన్ని గ్రామాలకు సురక్షితమైన నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంగా ప్రభుత్వం కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టును అనతికాలంలోనే పూర్తిచేసి రికార్డు బద్దలుకొట్టి తెలంగాణ సాగునీటి కష్టాలు తీరేలా చేసింది. 

ప్రభుత్వం మరుగునపడిపోయిన కులవృత్తులను ప్రోత్సహిస్తూ పలు వర్గాలను ఆదుకుంటున్నది. చెరువుల్లో చేపల పెంపకం, గొల్ల కుర్మ లకు గొర్ల పంపిణీ వంటి చర్యలు ఆయా వర్గాలకు ఆర్థిక స్వావలంబనను చేకూరుస్తున్నాయి. పేదింటి మహిళకు వివాహ కానుకగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం వల్ల లక్షా నూట పదహారు రూపాయలు అందించడం వల్ల లక్షలమంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారు.  

సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ, మైనారిటీ గురుకులాలు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పేరున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించి తెలంగాణ కీర్తిపతాకాన్ని విశ్వవ్యాప్తంగా చాటుతున్నారు. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ ఫెలోషిప్‌తో అణగారినవర్గాల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం ద్వారా గిరిజనులే అధికారం చేపట్టారు. నిరుపేదలకు రెండు పడకగదుల గృహనిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. యువ నాయకుడు కేటీఆర్‌ సారథ్యంలో ఐటీరంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. హైదరాబాద్‌లో ఐటీ పెట్టుబడులు పెరిగి అదేస్థాయిలో ఎగుమతులు వృద్ధిచెందాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రజాకాంక్షల మేరకు ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులతో సాగుతూ దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఆశిద్దాం.

(వ్యాసకర్త: మాజీ చైర్మన్‌, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌)


logo