శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jun 02, 2020 , 00:56:54

నాడొక స్వప్నం, నేడొక సత్యం

నాడొక స్వప్నం, నేడొక సత్యం

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించిన రోజునుంచి ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగే అవకాశం మరికొందరితోపాటు నాకు లభించింది. స్వరాష్ట్రంలో స్వయంపాలన ప్రారంభించి ఆరు వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఉద్యమకాలపు ఆలోచనలు పరిపాలనలో ఎలా ప్రతిఫలించి రూపుదిద్దుకుంటున్నవో ఒక్కసారి మననం చేసుకోవాలనిపించింది.

గగనతలం నుంచి కింద ఉన్న ఎండిన మోటబావులు, నీరులేని వాగులు, తుమ్మలు మొలిచిన చెరువులు, బీళ్ళుగా మారిన పంటపొలాలను మౌనంగా వీక్షించేవారు. ఆ సమయంలో కేసీఆర్‌ కండ్లల్లో బాధను గమనించాను.     తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేయాలో అప్పట్లోనే మనసులో ముద్రించుకున్నరు. అందుకే రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటిదాకా సాగునీటిరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 

అది 2000 సంవత్సరం ఆగస్టు నెల. విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ ఉద్యమం రగులుతున్నది. బషీర్‌బాగ్‌లో పోలీసు కాల్పుల్లో కొందరి మరణం.. అప్పుడు శాసనసభ ఉపసభాపతిగా ఉన్న కేసీఆర్‌ ఈ చార్జీల పెంపుపై తీవ్రంగా గళమెత్తారు. రైతుల ఉన్న గోచీ ఊడిపోవద్దంటూ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖనే మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. కానీ అంతకన్న చాలాకాలం ముందునుంచే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన మదిలో ఆలోచనలు పురుడు పోసుకున్నాయి.

కేసీఆర్‌ నిర్మల్‌కు టీడీపీ ఇంచార్జీగా వెళ్లినప్పుడు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దుస్థితిని చూసి ‘ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాల వలె మెరిసిపోతుంటే తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాల వలె వెలవెలపోతూ శిథిలావస్థలో ఉన్నా’యని తనవెంట ఉన్నవారితో అన్నట్లు పలు సందర్భాల్లో వెల్లడించారు.  ‘నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ వంటి పెద్ద ప్రాజెక్టులు ఉత్తర తెలంగాణలో ఉన్నా మన బతుకులు దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి’ అంటూ బాధపడిన సందర్భాలనేకం. ఉద్యమకాలంలో ఉత్తర తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టుల కింది ఆయకట్టు రైతుల కష్టాలను కూడా ఆయన స్వయంగా గమనించారు. అందువల్లనే తెలంగాణ అవత రించిన వెంటనే శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలను చేపట్టారు.

‘కాలడ్డం పెడితే పారే కాల్వలు ఆంధ్రకు, లక్షల రూపాయలు ఖర్చుచేసి బోర్లు వేసుకునే దుస్థితి తెలంగాణకా?’ అని ఆంధ్ర పాలకుల వివక్షను ప్రశ్నించేవారు కేసీఆర్‌. కృష్ణా, గోదావరి జలాలపై, తెలంగాణ హక్కులపై రోజులకొద్ది చర్చించేవారు. ప్రారంభంలో జయశంకర్‌ సార్‌, నేను, దేవరుప్పల భీమయ్య (రిటైర్డు ఇంజినీర్‌), ధర్మారావు (రిటైర్డు సి.ఇ.) ఈ చర్చల్లో పాల్గొనేవాళ్ళం. తెలంగాణ రైతుల సమస్యలపై, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాగునీరెలా కాల్వల ద్వారా అందించాలనేదానిపై చాలా లోతైన అవగాహన కేసీఆర్‌కు ఉండటం చూసి మేమంతా ఆశ్చర్యానికి లోనయ్యేవాళ్ళం.

తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించిన సమయంలో రైతుల ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నందున రైతులకు సాగునీటి కోసం పోరాటం చేయాలనే చైతన్యాన్ని కల్పించాలనుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో వారిని భాగస్వాములను చేయడానికి పెద్ద ఎత్తున నలభైరోజులపాటు జలసాధన ఉద్యమాన్ని చేపట్టారు. 2003 జనవరి 6న పరేడ్‌గ్రౌండ్‌లో పది లక్షల మంది రైతులతో, ఉద్యమకారులతో భారీ సదస్సును నిర్వహించారు. ఈ సభ ద్వారా ఆత్మహత్యల ఆలోచనల నుంచి రైతుల దృష్టిని మళ్లించి తెలంగాణ రాష్ట్రం వస్తే ‘మన నీళ్ళు మనకే’ వస్తాయనే భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సభకు శిబుసొరేన్‌, రాం విలాస్‌ పాశ్వాన్‌, మేధాపాట్కర్‌ తదితర జాతీయ ప్రముఖులు హాజరై ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణ పట్ల జరుగుతున్న వివక్షను అర్థం చేసుకున్నారు.

జలసాధన ఉద్యమం కోసం ఒక పాటల క్యాసెట్‌ను దగ్గరుండి కేసీఆర్‌ రూపొందించారు. తెలంగాణ గాయకులు, కవులు రసమయి బాలకిషన్‌, సుద్దాల అశోక్‌ తేజ, గోరటి వెంకన్న, గూడ అంజయ్య, జయరాజ్‌, వరంగల్‌ శ్రీనివాస్‌లతో తెల్లవారుఝామున 3 గంటల దాకా చర్చించారు. సాగునీటి దుస్థితిపై, కృష్ణా, గోదావరి జలాల మళ్లింపుపై కవితాత్మక ధోరణిలో కండ్లకు కట్టినట్లు వివరించి పాటలు రాయించారు. ప్రతి పాటలో కొన్ని పదాలు, పల్లవి, కొన్ని చరణాలు స్వయంగా సమకూర్చేవారు. ‘సూడు తెలంగాణ- సుక్కనీరు లేనిదాన, నా గోడు తెలంగాణ- బతుకుపాడైన వీణ.. ఇది దగాపడ్డ దరువు మాకేది బతుకుదెరువు, నినాదాలు కావు దేశ పునాదులే కదలాలి’ వంటి పాటలు పల్లెపల్లెన జనాన్ని ఆలోచింపజేశాయి. ఈ పాటలతోపాటు తాననుకున్న విషయాన్ని నాకు చెప్పి ఆ ఆడియో క్యాసెట్‌కు ముందుమాటలు రాయించి తన గొంతుతో వినిపించారు. ఆ మాటలు రైతులను జలసాధన ఉద్యమంలోకి మళ్లించాయి. ఆనాటి కేసీఆర్‌ మాటలు, పాటలు, ఆలోచనల పర్యవసానమే నేడు తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాలడ్డం పెడితే పారే కాల్వలు.

ఎన్నికల ప్రచారంలో నన్నుకూడా చాలాసార్లు హెలికాప్టర్‌లో వెంటతీసుకెళ్లేవారు. గగనతలం నుంచి కింద ఉన్న ఎండిన మోటబావులు, నీరులేని వాగులు, తుమ్మలు మొలిచిన చెరువులు, బీళ్ళుగా మారిన పంటపొలాలు, ఎక్కడో ఒక దగ్గర బోర్ల కింద ఎకరం, రెండెకరాలకు మించని పైర్లు మొదలైనవాటిని మౌనంగా వీక్షించేవారు. ఆ సమయంలో కేసీఆర్‌ కండ్లల్లో బాధను గమనించాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేయాలో అప్పట్లోనే మనసులో ముద్రించుకున్నరు. అందుకే రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటిదాకా సాగునీటిరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా సాగుయోగ్యమైన భూమిలో 80 శాతానికి ప్రభుత్వ కాల్వల ద్వారా నీరందించాలనే సంకల్పం త్వరలో నెరవేరబోతున్నది. 

‘నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ వంటి పెద్ద ప్రాజెక్టులు ఉత్తర తెలంగాణలో ఉన్నా మన  బతుకులు దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి’ అంటూ బాధపడిన సందర్భాలనేకం.‘కాలడ్డం పెడితే పారే కాల్వలు ఆంధ్రకు, లక్షల రూపాయలు ఖర్చుచేసి బోర్లు           వేసుకునే దుస్థితి తెలంగాణకా?’ అని ఆంధ్ర పాలకుల వివక్షను ప్రశ్నించేవారు కేసీఆర్‌. కృష్ణా, గోదావరి జలాలపై, తెలంగాణ హక్కులపై రోజులకొద్ది చర్చించేవారు. 

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ఆలోచనకు దారితీసిన సంఘటన 2002లో వరంగల్‌ జిల్లా, మల్లంపల్లి సమీపంలోని భాగ్య తండాలో జరిగింది. అగ్నిప్రమాదంలో తండా గుడిసెలన్నీ కాలిపోయాయి. స్థానిక ఎంపీపీ నల్లెల కుమారస్వామి ఆ తండా సందర్శించాలని జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్‌ను కోరినారు. మేమంతా ఆయనతో కలిసి భాగ్యతండాకు వెళ్లాం. ఒక పెద్దాయన బానోత్‌ కీమానాయక్‌ నెత్తికొట్టుకుంటూ ఏడ్వడం చూసి కేసీఆర్‌ ఆయన వద్దకు నడిచారు. తన బిడ్డ కల్పన పెండ్లి పెట్టుకున్నామని, ఖర్చుల కోసం దాచుకున్న యాభైవేలు  కాలిబూడిదైనాయని అన్నాడు. ‘యాభై వేలు ఇస్తాను, నీ బిడ్డ పెండ్లి మా వాళ్ళే దగ్గరుండి జరిపిస్తారు. పెండ్లికి నేనూ వస్తా’ అని ఆయనను ఓదార్చారు కేసీఆర్‌. మాట ప్రకారం 50 వేలు పంపించారు. పెండ్లికి హాజరై వధూవరులకు బట్టలు పెట్టి ఆశీర్వదించారు. ఆ రోజే బిడ్డల పెండ్లి కోసం నిరుపేద తల్లిదండ్రుల బాధను మనసులో పదిలపర్చుకొని సీఎం కాగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు తెచ్చారు. 

ఒకరోజు ఉదయం హెలికాప్టర్‌లో పోతున్నప్పుడు మానాల అడవులను చూపిస్తూ నక్సలైట్‌ దళాన్ని అన్నంలో విషంపెట్టి చంపిన సంఘటనను ప్రస్తావించారు. ‘చనిపోయేది నక్సలైటయినా, పోలీస్‌ అయినా చిందే రక్తం మాత్రం తెలంగాణ బిడ్డదే’ అని బాధను వ్యక్తం చేశారు. ఆంధ్ర ముఖ్యమంత్రులు నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపడానికి పోలీసు అధికారులపై ఎలా ఒత్తిడి తెస్తారో చెప్పారు. నెత్తురొలకని ఆకుపచ్చ తెలంగాణను ఏర్పాటుచేసుకోవాలని మనసులో మాట పంచుకున్నారు. అందుకే గత ఐదేండ్లలో నక్సలైట్లనుగాని, వారి సానుభూతిపరులనుగానీ ‘ఎన్‌కౌంటర్‌'లో చంపిన దృష్టాంతాలు లేవు. కేసీఆర్‌ ఆలోచనల ఫలితమే నక్సలైట్లతో వ్యవహరించే పద్ధతిలో ఈ మార్పు. 

కేసీఆర్‌ ఆలోచనల, పలు పథకాల ప్రస్తావన వచ్చిన ప్పుడు ముందుగా  కృతజ్ఞత చెప్పవలసింది సిద్దిపేట ప్రజలకు. ఐదుసార్లు   శాసనసభ్యునిగా నియోజకవర్గానికి సేవలందించిన సందర్భంగా కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజలతో మమేకమై వారి కష్టాలను, కడగండ్లను చూశారు. వారి దుఃఖమే ఆయన మనసులో పలు సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించింది. సిద్దిపేట ప్రజల తాగునీటి సమస్యను ఆయనను కలవరపరిచింది. మానేరు నీటిని నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు అందించే పథకానికి రూపకల్పన చేసింది ఆ అనుభవంతోనే. మిషన్‌ భగీరథ పథకం వల్ల ఇప్పుడు ఆదివాసీ గూడాల, తండాల జనం కూడా స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా పలుమార్లు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాలను నిర్వహించారు. కేసీఆర్‌తో కలిసి పల్లెల్లో నిద్రించినప్పుడు పొద్దుగాల్నే ఊరంతా తిరిగేవాళ్ళం. గొల్లకుర్మలు, మత్స్యకారులు, వివిధ వృత్తికులాలవాళ్ళు కేసీఆర్‌తో తమ సమస్యలు చెప్పుకొనేవాళ్ళు. ఆయా కులాలకు, వృత్తులవారికి ఏం కావాలో, వారి ఆర్థిక స్వావలంబనకు ఏమిచేస్తే బాగుంటుందో మాతో చర్చించేవారు. గొర్రెల, చేపల పథకం బహుశా ఆ రోజుల్లోనే ఆయన మనసులో రూపుదిద్దుకొని ఉండవచ్చు. 2002లో పోచంపల్లిలో ఆరుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేసీఆర్‌ను ఎంతో కలచివేసింది. గజ్వేల్‌, సిరిసిల్ల, ఇతర గ్రామాల్లో కూడా నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడినారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేనేతకు ఏ విధంగా పూర్వవైభవం తేగలమనేది అప్పుడే చర్చించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా పలుమార్లు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాలను నిర్వహించారు. కేసీఆర్‌తో కలిసి పల్లెల్లో నిద్రించినప్పుడు పొద్దుగాల్నే ఊరంతా తిరిగేవాళ్ళం. గొల్లకుర్మలు, మత్స్యకారులు, వివిధ వృత్తికులాలవాళ్ళు కేసీఆర్‌తో తమ సమస్యలు చెప్పుకొనేవాళ్ళు. వారి ఆర్థిక స్వావలంబనకు ఏమిచేస్తే బాగుంటుందో మాతో చర్చించేవారు. 

హైదరాబాద్‌ ట్రాఫిక్‌జామ్‌ గురించి మాట్లాడుతూ దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని తాను ప్రతిపాదిస్తే చంద్రబాబు పక్కనపెట్టారని, సిగ్నల్‌లెస్‌ హైదరాబాద్‌ ఏర్పడాలన్నారు. త్వరలోనే ఆ మహర్దశ విశ్వనగరానికి రాబోతున్నది. మైనారిటీలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా బయటపెట్టారు. సచార్‌ కమిటీ నివేదిక అమలు గురించి ఇందిరాపార్క్‌ వద్ద నిరాహారదీక్ష చేప ట్టారు. గత ఆరేండ్లుగా మైనార్టీల సంక్షేమం, విద్య గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అవసరమైన నిధులను కేసీఆర్‌ సమకూర్చుతున్నారు. 

రైతుల ఆత్మహత్యల వార్తలు ఆయననెంతో బాధించేవి. ‘రైతేడిస్తే రాజ్యం నిలువదు- ఎద్దేడిస్తే ఎవుసం సాగదు’ అని పలుమార్లు అనేవారు. రైతును రాజుగా చూడటం కేసీఆర్‌ స్వప్నం. అప్పటి ఆలోచనలే ఇప్పుడు వివిధ పథకాల రూపంలో మన ముందుకొస్తున్నాయి. ఆదిలాబాద్‌ను మరో కశ్మీర్‌గా మార్చడం, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం, శాటిలైట్‌ సిటీ నిర్మాణం, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఆకాశహర్మ్యాలు, హుస్సేన్‌సాగర్‌, మూసీ నది ప్రక్షాళన మొదలైనవి రాబోయే రోజుల్లో చూస్తాం.

దశాబ్దాల విధ్వంసం తర్వాత దేశప్రజలు గర్వపడేలా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్నది.  రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశవిదేశాల్లోని తెలంగాణ బిడ్డలందరికీ అభినందనలు.

(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకుడు)


logo