బుధవారం 30 సెప్టెంబర్ 2020
Editorial - Jun 02, 2020 , 00:56:53

నా తెలంగాణ తల్లి

నా తెలంగాణ తల్లి

కోటి వెలుగుల బంగారు కొండ క్రింద 

పరుచుకొన్నట్టి సరసు లోపల వసించి

ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు

నా తెలంగాణ తల్లి కంజాత వల్లి


ఎల్లొరా గుహలందున పల్లవించి 

వేయి స్తంభాల గుడిలోన విరులు పూచి

శిల్పి యులిముక్కులో వికసించినట్టి

నా తెలంగాణ, కోటి అందాల జాణ


మూడు కోటుల దేవతా మూర్తులందు

కోటి మంది వసించెడు హాటకావ

నీ మహా ఖండమీ రమణీయ భూమి

నా తెలంగాణ లేమ, సౌందర్య సీమ


మూగవోయిన కోటి తమ్ముల గళాన

పాట పలికించి కవితా జవమ్ము కూర్చి

నా కలానకు బలమిచ్చి నడపినట్టి 

నా తెలంగాణ కోటి రత్నాల వీణ


logo