బుధవారం 08 జూలై 2020
Editorial - Jun 02, 2020 , 00:56:52

అపరంజి తెలంగాణను నేను

అపరంజి తెలంగాణను నేను

దశాబ్దాల సప్తవర్ణ సురుచిర స్వప్నాన్ని నేను

ఉవ్వెత్తున ఎగసిపడ్డ మహోద్యమానికి

ఊపిరులూదిన అందాల బతుకమ్మను నేను

తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలో

తళుకులీనే తంగేడును నేను

అస్తిత్వానికై ఆరాటపడే నుడికారాన్ని నేను

కళ్ళలో వెలుగులు పూయించే

దసరా ప్రతీక రైతు నేస్తం పాలపిట్టను నేను

పోరాటస్ఫూర్తి రగిలించే

అరుణ వర్ణపు మోదుగు పువ్వును నేను

సకల జనులను ఏకతాటిపై నిలిపిన స్వరాష్ట్ర ఉద్యమాన్ని నేను

ఆధిపత్యపోరును అంతం చేసిన అనంత విజయ గీతికను నేను

అమరుల త్యాగశిఖరంపై రెపరెపలాడిన ఆత్మగౌరవ కేతనమును నేను

అవనికై ప్రాణాలర్పించిన అమరవీరుల రుధిరంతో లిఖించబడిన చరితను నేను

నా సాంస్కృతిక వైభవాన్ని చాటే బోనాల పండుగను నేను

అఖిల జనుల అశ్రుగాథలు చెరిపే కాళేశ్వరం జలనిధిని నేను

తెలంగాణను నేను

విశ్వమంతా మెరిసే అపరంజి తెలంగాణను నేను!


logo