ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - May 31, 2020 , 23:03:42

దూత హితవాక్య ప్రశస్తి

దూత హితవాక్య ప్రశస్తి

మంత్రిగాని- మిత్రుడుగాని అప్రియ వాక్యాలను పలికి ప్రభువునకు ఆగ్రహము కల్గించి తమకు బాధ కలిగించు కోవడం శ్రేయస్కరం గాదు. ఇది సన్మిత్ర పద్ధతిలో చేరదు. తన ప్రభువునకు బాధ కలిగించుననే భావనతో యధార్థ విషయాలను దాచిపెట్టి, రాజు మనస్సునకు మంచియని భావించిన అసత్య విషయాలను చెప్పేవాడు- కుత్సిత మిత్రుడు- సన్మిత్రుడు కాజాలడు.

మిత్రుడు, సఖుడు- రాయబారి తెల్పిన యధార్థ విషయాలను కటువుగా భావించక సహృదయంతో గమనించి ప్రవర్తించిన వాడే ప్రభువుగాని-తదన్య భావన గలవాడై ప్రవర్తించిన రాజు ‘కుత్సిత’ ప్రభువు అనబడతాడు

సకింసభాసాధు నశాస్తి యో.. ధిపం

హితాన్నయస్సంశృణులే సకింప్రభుః

సదానకూలేషు హికుర్వతే రతిం

నృసేష్వమాత్యేషుచ సర్వసంపదః

సంస్కృత సాహిత్యంలో ప్రఖ్యాతుడైన ‘భారవి’ మహా కవి రచించిన1030 శ్లోకాల 18 సర్గల మహాకావ్యం కిరాతార్జునీయం. మహాభారత కథను ఇతి వృత్తంగా గ్రహించి ఆలంకారిక శైలికి మార్గదర్శకంగా నిలిచింది ప్రఖ్యాతమైన కిరాతార్జునీయ కావ్యం. పద, అర్థ సంపదలయందు గణనీయమైంది కాబట్టే ‘భారవేరర్థ గౌరవం’ అనే సార్థకమైన రచనయిది. మల్లినాథుని వంటి మహావ్యాఖ్యాత దీన్ని గొప్ప రచనగా అభివర్ణించి నాడంటే కిరాతార్జునీయ ప్రత్యేకత వ్యక్తమౌతున్నది. అందుకే దీనికి 36 వ్యాఖ్యానాలు వచ్చినాయి. 

 ప్రథమ సర్గలో  దైవ వనంలో వున్న ధర్మరాజు, దుర్యోధన పరిపాలన గూర్చి తెలుసుకొని రమ్మని పంపిన వనే చరుడు విచ్చేసి  దుర్యోధన రాజ్య పాలనా విశేషాలను యథార్థ కథనం చేస్తూ దాదాపు 25 శ్లోకాలను చెప్పినాడు. ఇక్కడ మనం గమనించ వలసింది- రాజు, ఇష్ట సఖుడు ఎట్లుం డవలెనో దీనిని ద్వారా తెలుస్తున్నది. దీనిలోని ధర్మరాజు ఒక దేశాధినేత. వనేచరుడు అతని ఇష్ట స్నేహితుడు. ఆయన తెల్పుతున్న దుర్యోధన రాజ్యపాలనా రీతి ఒక ప్రతిపక్ష నాయకుడు పరిపాలిస్తున్న రాజ్యం గూర్చి చెప్పడం.  

ఇక్కడి వనేచరుడు మన భారవియే. ఆయన రాజనీతి  విశారదుడు. సంస్కృత సాహిత్యంలో రాజనీతి ప్రధానంగా వున్న ఏకైక రచన కిరాతార్జునీయం. ‘రాజనీతి’ని ప్రధానం చేసుకుని ఆనాటి (6శతాబ్దం) తన ఆశ్రయదాతకు మంత్రాలోచన చెప్పే వ్యక్తిగా ప్రధాన పాత్ర వహించినాడు. అందుకే ప్రతిశ్లోకం ఒక ఆణిముత్యం  ఒక మహిమోపదేశం.

ప్రస్తుత శ్లోకం  ఓ రాజా! మంచి విషయాలను చెప్పి శాసించగలిగే సఖుడే నిజమైన సఖుడు. అట్లే తన యిష్ట సఖుడు చెప్పిన హితకరమైన మాటలను వినజాలని ప్రభువు ఒక ప్రభువా! మంత్రిగాని- మిత్రుడుగాని అప్రియ వాక్యాలను పలికి ప్రభువునకు ఆగ్రహము కల్గించి తమకు బాధ కలిగించుకోవడం శ్రేయస్కరం గాదు. ఇది సన్మిత్ర పద్ధతిలో చేరదు. తన ప్రభువునకు బాధ కలిగించుననే భావనతో యధార్థ విషయాలను దాచిపెట్టి, రాజు మనస్సునకు మంచియని భావించిన అసత్య విషయాలను చెప్పేవాడు- కుత్సిత మిత్రుడు- సన్మిత్రుడు కాజాలడు. 

అట్లే మిత్రుడు, సఖుడు- రాయబారి తెల్పిన యధార్థ విషయాలను కటువుగా భావించక సహృదయంతో గమనించి ప్రవర్తించిన వాడే ప్రభువుగాని-తదన్య భావన గలవాడై ప్రవర్తించిన రాజు ‘కుత్సిత’ ప్రభువు అనబడతాడు. అందుకే ప్రభువైనవాడు తన స్నేహితులతో బాగా కలిసియుండి పరస్పరానురక్తుడు కావలెను. అప్పుడే అతని సంపదలు నిలుస్తాయి. అందువలననే హితవాక్యములు అప్రియమైనా సరే ప్రభువునకు చెప్పవలసిందే! ప్రభువు కూడా ఈ రకమైన హితాహితజ్ఞాన విచక్షణ కలవాడైయుండవలెననేది  ఈ శ్లోక భావన.

ఆనాడు భారవి చెప్పిన ఈ వాక్య పద్ధతిని హిత బోధలను మనవారు పాటించటం వల్లనే ‘వాగ్భూషణం భూషణం’ అనేది బాగా వ్యాప్తి చెంది మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిస్తరని ప్రసిద్ధమయింది. 

మన రాజకీయ పదవుల్లోవున్న పెద్దలు, వారికి అన్ని విధాలుగా ఛత్రంవలె వర్తించే ఆఫీసర్లు రహస్య సమాచార విభాగం వారు ఈ విధమైన శ్లోక భావాలనే గాదు మహాభారతంలో సంజయ, శ్రీకృష్ణ రాయబార సందర్భాల్లోని సమయోచిత సంభాషణ. అక్షర సంపద, పద ప్రయోగాలను కూడా గమనించి ప్రవర్తిస్తే  ప్రభువునకే గాదు ఇష్ట స్నేహితులైన వారికీ ప్రజలకూ ఎంతో మేలు. అందుకే భారవి- ‘నృపేహ్యమాత్యేషు చసర్వసంపదః’ అని హితవాక్యం విలువను తెల్పినాడు. 

ఇంకా సందర్భోచితంగా ఎన్నో విషయాలను రాజనీతికను గుణంగా వివరించాడు. ఒక శ్లోకంలో- ఓ ధర్మరాజా! దుర్యోధనుని కొలువు కూటంలో ఏ సందర్భంలోనైనా మీ ప్రసక్తి వస్తే,  ఆ ఖండల సూతి విక్రమం గూర్చి వింటే ఆ దుర్యోధనుడు ముఖం వాలుస్తున్నాడు. అది ఎట్లా ఉన్నదంటే భరించటానికి వీలుకాని సర్పమంత్రాక్షరాలు పన్నగ శిరస్సును వంచినట్లే- దుర్యోధన చక్రవర్తి స్థితి కలదు మహారాజా! అంటాడు. ఈ శ్లోకంలో కవి ‘తవాభిధానాత్‌ వ్యథలే నతాననః సుదుస్స హన్మంత్ర పదాది హోరగః’ అనే భాగంలోని ‘త’ ‘వ’ అనే అక్షరాలు గారుడ మంత్ర ప్రభావం గలవని ఒక వ్యాఖ్యాత అభిప్రాయం. ఇట్లా మనం అనేక ఉపపత్తులతో  హితాధిహిత వాక్య విశేషాలను ‘భారవి’ ద్వారా గ్రహించవచ్చు.

- శ్రీరంగాచార్య, 92994 51266


logo