మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - May 31, 2020 , 23:03:42

జీవద్భాషా పలుకు‘బడి’

జీవద్భాషా పలుకు‘బడి’

ప్రజలను ప్రేమించేవాడయితే తప్ప జనం భాషలో మాట్లాడి మెప్పించలేడు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషులలో అనర్గళంగా మాట్లాడే నేర్పు, భాషా సౌష్ఠవం ఉన్న కేసీఆర్‌ తెలుగు ప్రజలు ఉన్నప్పుడు మాత్రం తన తెలంగాణ జీవద్భాషలోనే మాట్లాడుతాడు. ముస్లిం సమాజంతో ఉర్దూలో, కేంద్ర నాయకులతో అవసరమైనప్పడు హిందీ, ఇంగ్లీషులలో మాట్లాడి మెప్పించే నేర్పు కేసీఆర్‌కు ఉన్నది.

పీవీ నర్సింహారావు రాసిన ‘గొల్ల రామవ్వ’ కథను చదివితే అంత పండితుడయ్యుండీ ఆ కథలో ప్రజల భాషను వాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ కథను చదివినప్పుడు ఆయన రాజకీయాల్లోకి పోకుండా కవి, రచయితగానే ఉండి ఉంటే నోబెల్‌ బహుమతిని అందుకునే స్థాయిలో ఉండేవారు. అలాగే కేసీఆర్‌ జీవద్భాషా సొగసులను పరిశీలించినప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చి ఉండకపోతే నోబెల్‌ బహుమతి స్థాయి భాషావేత్త, రచయిత అయ్యుండేవారని అనిపించకమానదు. మాండలికమని తక్కువగా చూడబడి, వలస పాలకులతో, మీడియాతో విలన్ల, జోకర్ల భాషగా తక్కువ చేయబడిన తెలంగాణ జీవద్భాషను హృద యం నిండా నింపుకొని ఆ భాషకు పార్లమెంటరీ గౌరవం తీసుకొచ్చిన ప్రజానాయకుడు కేసీఆర్‌. ఆయన జీవద్భాషా ప్రయోగం రచయితలకు స్ఫూర్తినిచ్చింది. ప్రజలభాషకు రాజాశ్రయం లభించినట్టయింది. తెలంగాణ  ఏర్పడిన తర్వాత యువరచయితలు ఈ భాషను నిర్భయంగా ఉపయోగించడానికి మార్గం సుగమమైంది.

ఆకర్షణీయ పథకాల ప్రకటనతో, గంభీరమైన మాటలతో కోట్లమంది హృదయాలను గెలుచుకున్నారు ఇందిరాగాంధీ. గంభీరోపన్యాసంతో, చలోక్తులతో, స్వచ్ఛమైన హిందీ మాటలతో ఆకట్టుకునేవారు అటల్‌ బిహారీ వాజపేయి. తెలంగాణ జీవద్భాషా పలుకులు, పలుకుబడులు, సామెతలతో, వ్యంగ్యోక్తులతో, సందర్భోచిత పిట్టకథలతో ఎంత గంభీర విషయాన్నైనా హాస్యోక్తులతో చెప్పి మెప్చించి అశేష తెలంగాణ ప్రజల హృదయాలను జయించారు కేసీఆర్‌.

హిందూ రాజులకాలంలో సంస్కృతానికి, ముస్లిం పాలనలో ఉర్దూకు, ఆంగ్లేయుల పాలనలో ఇంగ్లీషుకు, వలసపాలకుల పాలనలో రెండున్నర జిల్లాల తెలుగుకు ఆదరణ లభిస్తే కేసీఆర్‌ పాలనలో మాత్రం తెలంగాణ పలుకుబడికి ఆదరణ లభిస్తున్నది. ఒక్క కాకతీయులకాలంలో మాత్రమే అచ్చతెలుగుకు ఆదరణ లభించింది. నీటి వసతులు కల్పించడంలోనూ, వ్యవసాయికాభివృద్ధిలోనూ, ప్రజల భాషను ఆదరించడంలోనూ కేసీఆర్‌ కాకతీయుల పంథానే ఎన్నుకున్నారు. తెలంగాణ జీవద్భాషా సర్వస్వం మాత్రమే కాదు,  విజ్ఞాన సర్వస్వం కేసీఆర్‌. ఆయన మాటలన్నింటినీ తెలంగాణ జీవద్భాషా నిఘంటువుగా రాయవచ్చు. 

- డాక్టర్‌ కాలువ మల్లయ్య 

91829 18567


logo