సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - May 30, 2020 , 22:41:23

ఈ నాలుగూ వదిలితే... శుభం భూయాత్‌!

ఈ నాలుగూ వదిలితే... శుభం భూయాత్‌!

అ-అమ్మ, ఆ-ఆవు, ఇ-ఇల్లు, ఈ-ఈగ అని నేర్చుకున్నాం. కానీ, కొవిడ్‌ వైరస్‌ లాగా గప్‌చిప్‌గా సోకి కనిపించకుండా మనుషులను ఆగమాగం చేస్తున్న అఆఇఈలు- అహం, ఆశ, ఇష్టం, ఈర్ష్య. అంతులేని అహం, ఎక్కడలేని ఆశ, అమితమైన ఇష్టం, విపరీతమైన ఈర్ష్య అన్ని కష్టాలకు మూలమై కుటుంబాల్లో, వీధుల్లో, కార్యాలయాల్లో, వెరసి సమాజంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. కొవిడ్‌, లాక్‌డౌన్‌ల వల్ల వింత అనుభవాలు మూటగట్టుకొని, ఈ వైరస్‌తో కలిసి జీవించడానికి మానసికంగా సన్నద్ధమైన వేళ... వీటిని ప్రయత్నపూర్వకంగా పరిత్యజిస్తే ఆరంభించబోయే కొత్త జీవితం అర్థవంతంగా, ఆనందంగా ఉంటుంది. దీంతోపాటు, ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన ప్రకృతిని గౌరవిస్తూ, దాంతో మమేకమై, సృష్టి అద్భుతాలను ఆస్వాదిస్తూ ఏ రోజుకారోజు కోసమే జీవిస్తే ఆయురారోగ్యాలు సహజంగానే సిద్ధిస్తాయి.

కొవిడ్‌తో జాగ్రత్తగా సహజీవనం చేయడానికి సిద్ధపడుతున్న మనం ఈ ‘అ ఆ ఇ ఈ’లను కూడా మనసుపొరల్లో దూరనీయకుండా జాగ్రత్తపడితే... సానుకూలమైన మరో ప్రపంచం నిస్సందేహంగా ఏర్పడుతుంది. ఈ నాలుగు అంశాలు కానరాని కొవిడ్‌లు! శాస్త్రీయంగా చూస్తే... వీటివల్ల జరిగే మార్పులు ఉత్పత్తిచేసే రసాయనాలు శరీరానికి మంచిది కాదు. 

ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. మంచి నాణ్యమైన మక్కజొన్న పంట పండించేవాడు. అధిక దిగుబడి సాధించి ప్రతి ఏడాదీ ఉత్తమ రైతు అవార్డు పొందేవాడు. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేకరికి ఈ రైతు గురించి ఒక అద్భుతమైన విషయం తెలిసింది. రైతు ప్రతి ఏడాదీ తన ఇరుగుపొరుగు రైతులకు తన మేలురకం విత్తనాలు పంచిపెడుతున్నాడట. ‘మీరు మరీ అమాయకంగా ఉన్నారే! మిగిలిన రైతులు మీకు పోటీదారులు. మీ నాణ్యమైన విత్తనాలను వారితో పంచుకుంటారట మీరు. ఇది మీకు నష్టం కాదూ? అప్పుడు మీ పంట డిమాండ్‌ తగ్గిపోదూ?’ అని విలేకరి కుతూహలంతో అడిగాడు. దానికి సమాధానంగా.. ‘నిజమే సార్‌, వాళ్ళు నా పోటీదారులే. నిజానికి నేను వాళ్లకు నాణ్యమైన విత్తనాలు ఇచ్చేది నా మంచి కోసమే. పంటకు చాలా ముఖ్యమైన పరాగ రేణువులను గాలితెరలు ఒక పొలం నుంచి మరో పొలానికి చేరవేస్తాయి. ఒకవేళ నా పక్కపొలాల రైతులు నాసిరకం విత్తనాలు నాటితే ఆ రేణువులు నా పొలంలోకి కొట్టుకొచ్చి నా పంట నాణ్యతను దెబ్బతీస్తాయి. అప్పుడు నాకు నష్టం వస్తుంది. నేనే మా చుట్టుపక్కల రైతులకు మంచి విత్తనాలు ఇస్తే.. నా పొలంలోకి ఆ నాణ్యమైన మంచి రేణువులే వస్తాయి. అప్పుడు నేనాశించిన దిగుబడితో నాణ్యమైన పంట నాకు వస్తుంది’ అని రైతు విజయరహస్యం చెప్పాడు.

మనం బాగుండాలంటే... మన పొరుగువాడు బాగుండాలనన్నది సూత్రం!

ఈ అద్భుత సత్యాన్ని ప్రపంచానికి విష వైరస్‌ కొవిడ్‌ నేర్పినంత బాగా ఇంకెవరూ నేర్పలేదు. వాయువేగంతో దూసుకుపోతున్న మనిషికి అదృశ్యశక్తిలా సడన్‌ బ్రేకు వేసింది, విలయతాండవం చేస్తూ మనుషులను ఇళ్లకే పరిమితం చేసింది. కొవిడ్‌ అనంతర కాలంలో మనుషుల ముందున్న దివ్య నినాదం ‘సర్వేజనా సుఖినో భవంతు’ అని చక్కగా గుర్తుచేసింది.

హమ్మయ్య... బతికిబయటపడ్డాం... అన్న ఊరటతో, లాక్‌డౌన్‌ వాసాన్ని ముగించుకొని కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న శుభసమయాన మన జీవనానికి కొవిడ్‌లాగా కనిపించకుండా ఉన్న అవరోధాలేమిటో ఒక్కసారి మననం చేసుకొని దిద్దుబాటు చర్యలతో ముందుకుసాగటం సముచితం. వివిధ మతాల బోధనసారం, ప్రవక్తల అనుభవసారం ప్రకారం నాలుగు ప్రాథమిక విషయాలను మనిషి దృష్టిలో పెట్టుకుంటే సుఖమయ జీవనానికి సోపానాలేర్పడుతాయి.

ఆ నాలుగు: అహం, ఆశ, ఇష్టం, ఈర్ష్య (అ ఆ ఇ ఈ). ‘నేను’, ‘నా’లతో మన కథ మొదలవుతుంది. నేను నీకన్నా గొప్ప, నేను చెప్పింది వేదం ఇట్లా మొదలై మాది, మావాళ్ళు... అంటూ సాగిపోతుంది. అన్ని అనర్థాలకు మూలమైన ఆవేశానికి చాలాసార్లు కారణం అహం దెబ్బతినడమే. ‘నా’ కేంద్రమైన అహంకారం నుంచే గర్వం, భేష జం, ఎచ్చులు, పటాటోపం, డాం బికం, అతిశ యం వంటి అవలక్షణాలు పుట్టుకొచ్చి ఆధిపత్య ధోరణితో ఇతరులను కించపరుస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. ‘అహం బ్రహ్మస్మి’ అని నేర్చిన శిష్యుడు... మరింకేమి! నన్ను మొక్కండని అంటే ఎవరేమి చేయగలరు? నాలో, ఆ మాదిరిగానే అందరిలో దేవుడున్నాడు, అందరికీ గౌరవం ఇవ్వాలన్న అద్భుత సూత్రం మరిచి ఇళ్లలో, వీధుల్లో, ఆఫీసుల్లో అహంతో కొట్టుకుచస్తున్నాం. దీనివల్ల అమూల్యమైన మానవ వనరులు దెబ్బతింటున్నాయి, ఎందరిదో మానసిక ఆరోగ్యం  దెబ్బతింటోంది. ఇప్పటికైనా నేను (ఐ) చేస్తున్నా లేదా చేయిస్తున్నా అని కాకుండా మనం (వియ్‌) కలిసి చేస్తున్నాం అన్న కలివిడితనంతో మెలిగితేనే సుఖం.

మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న మరో దుర్లక్షణం మితిమీరిన ఆశ. ఉన్నదానితో తృప్తి పడటమనేది అసమర్థుల లక్షణమన్న స్థాయికి వచ్చేశాం. సొంతలాభం కొత్తమానుకు... పొరుగువాడికి తోడుపడవోయ్‌... అన్న భావన లేదు. మొత్తం జాతీయ సంపదలో 77 శాతం... మన జనాభాలో పది శాతం ధనికస్వాముల దగ్గర ఉంది. ఎవరి స్థాయిలో వారు అత్యాశతో తరతమ బేధాలు మరిచి ప్రవర్తిస్తుండటం ఆగకపోతే... మరింత నైతిక పతనం తప్పదు.

ఇష్టం ఎక్కువైతే కష్టం. వ్యక్తులను, వస్తువులను, ప్రదేశాలను, పరిస్థితులను ఇష్టపడటం తప్పు కాదు. కానీ అమితంగా ఇష్టపడటమే తప్పు. మనం ఇష్టపడే మనుషులు మనం అనుకున్న ప్రకారం మెలగాలని అనుకుంటాం. కచ్చితంగా వాళ్ళు దానికన్నా భిన్నంగానే ఉంటారు. దానికి కారణాలు అనేకం ఉండవచ్చు. అయినా మనం అనుకున్న ప్రకారం వారు ప్రవర్తించలేదు కాబట్టి మనస్సు చివుక్కుమంటుంది. విషయ తీవ్రతను బట్టి మనసు విరిగిపోతుంది. మొబైల్‌ఫోన్‌ అనేది గాలి, నీరు, ప్రాణం కన్నా ముఖ్యమైపోయిన ఈ కాలంలో మనం ఇష్టపడే వ్యక్తులు ఫోన్‌ ఎత్తకపోయినా, లైక్‌ కొట్టకపోయినా, మెసేజ్‌కు సమాధానం ఇవ్వకపోయినా గుండెకు గాయమై, మనసు కకావికలమై కాసేపు ‘ఎందుకిలా?’ అనే సమస్య మీద జుట్టుపీక్కోవడం ఎక్కువయ్యింది. మన ఇష్టాయిష్టాలను బట్టి ఇతరులు మెలగాలని అనుకోకుండా... అందరిపట్లా సమ సోదరభావంతో ఉండటం అభ్యసించాలి.

విషతుల్యమైన ఈర్ష్య మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నఅంశాల్లో ముఖ్యమైనది. పొరుగువారి కలిమి, హోదా, పరపతి వంటివాటిని చూసి కుళ్లడమే ఈర్ష్య. ఇతరుల ఉన్నతిని కోరుకోవడం, వారిలా మనమూ ఎదుగాలనుకోవడం సంగతలా ఉంచితే... ఎదుగుతున్న వాడి కాళ్లు పట్టి కిందకు లాగడం ఇప్పుడు మనం చేస్తున్న పని. వాడి ఎదుగుదలకు కారణం కులం, ప్రాంతం, మతం వంటివాటిని ఆపాదించి ప్రతిభను కిచపరుచడం నిరాటంకంగా జరుగుతున్నది.

కొవిడ్‌తో జాగ్రత్తగా సహజీవనం చేయడానికి సిద్ధపడుతున్న మనం ఈ ‘అ ఆ ఇ ఈ’లను కూడా మనసుపొరల్లో దూరనీయకుండా జాగ్రత్తపడితే... సానుకూలమైన మరో ప్రపంచం నిస్సందేహంగా ఏర్పడుతుంది. ఈ నాలుగు అంశాలు కానరాని కొవిడ్‌లు! శాస్త్రీయంగా చూస్తే... వీటివల్ల జరిగే మార్పులు ఉత్పత్తిచేసే రసాయనాలు శరీరానికి మంచిది కాదు. 

మొదట్లో చెప్పిన ఆదర్శ మక్కజొన్న రైతులాగా మనకోసం నలుగురికి మంచిని పంచుతూ సమాజంలో మంచిని పెంచాలి. 

(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ కమ్యూనికేషన్స్‌ నిపుణుడు)


logo