శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - May 30, 2020 , 22:41:22

నేనెరిగిన నేత.. కేసీఆర్‌

నేనెరిగిన నేత.. కేసీఆర్‌

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించటంతో నాకు ఎనలేని ఆనందం కలిగింది. జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆ ఉత్సవం మళ్లీ వస్తున్న సందర్భంలో కేసీఆర్‌ గురించి ఎన్నెన్నో జ్ఞాపకాలు. కేసీఆర్‌ ఒక డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌. రియల్‌ హీరో. బక్కపలుచని దేహంతో, అలుపెరుగని పోరాటపటిమతో నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపిన జాతిపిత ఆయన.

కేసీఆర్‌ తెలంగాణ జాతి స్వర్ణ స్వప్నాలను సాకారం చేసిన స్వచ్ఛమైన కథానాయకుడు. ఉద్యమ ప్రారంభం నుంచీ కేసీఆర్‌ వ్యూహాలను దగ్గరినుంచీ పరిశీలిస్తున్నవాడిగా నేను ఆయనకు రాజకీయ అభిమానిగా మారిపోయాను.

తెలంగాణ త్యాగపూరిత వారసత్వం, సాంస్కృతిక జీవనవిధానం పట్ల నాకు మొదటినుంచీ ప్రేమాభిమానాలున్నాయి. సాంస్కృతిక ప్రతీకలు ఉద్యమ సాధనాలైన తీరు నన్ను మరింత ముగ్దున్ని చేశాయి. ఆ నేపథ్యంలోంచే నేను కర్ణాటక రాష్ర్టానికి చెందినవాడినైనా తెలంగాణ మరో పుట్టినిల్లుగా మారిపోయింది.

ఒకప్పటి పాలకుల పక్షపాతవైఖరి కారణంగా దుఃఖితురాలవుతున్న తెలంగాణ తల్లిని చూసి నేను ఎంతగానో తల్లడిల్లిపోయాను. నేను నటించే సినిమాల్లో ఆపన్నులను ఆదుకునేందుకు వచ్చే కథానాయడి లాగానే, అడుగడుగునా అన్యాయం పాలవుతున్న తెలంగాణను ఆదుకునే ఆపన్నహస్తం అందించే నాయకుడు రాకపోతాడా అని ఎదురుచూశాను.  ఎట్టకేలకు ఆ ఎదురుచూపులు ఫలించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రూపంలో ఓ కథానాయకుడు తెలంగాణ జాతిపితగా కనిపించారు. దాంతో నా ఆనందానికి అవధుల్లేవు. 

తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి సొంత రాష్ట్రం కల నిజమయ్యేలా ఉద్యమిస్తున్న తరుణంలో కేసీఆర్‌కు అండగా నేనో సైనికుడిలా మారిపోయాను. ఏండ్లతరబడి సాగిన ఉద్యమంలో ఎన్నో మలుపులు. మరెన్నో బాధల గాథలు. నెత్తురోడే పాదాలతో ఉద్యమవీరులు కదం తొక్కుతుంటే, తప్పక విజయం వరించి తీరుతుందని అనిపించింది. కేసీఆర్‌ సారథ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమంలో నేను సైతం.. అంటూ పాలుపంచుకున్నాను. ‘వంటావార్పు, ‘సకలజనుల సమ్మె’లో భాగస్వామినయ్యాను. మిలియన్‌ మార్చ్‌లో పాల్గొన్నాను. ఎత్తుగడలు, వ్యూహాత్మక పోరాట రూపాలతో కూడిన కేసీఆర్‌లో భగభగమండే నిప్పుకణాన్ని దర్శించాను.

చిత్తశుద్ధే ఉంటే లక్ష్యసిద్ధి అనివార్యం. నాయకుడంటే ముందుండి నడిపించేవాడేనన్న సూత్రాన్ని అడుగడుగునా పాటించి.. ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమయ్యే ఎన్నో వేల కిలోమీటర్ల ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించిన ఒకే ఒక్క నేత కేసీఆర్‌. సంకల్పబలంతో అందని ఆకాశాలను సైతం అరచేతుల్లో ఇముడ్చుకొని వేనవేల నక్షత్రాలతో తన జాతి ముంగిట వెలుగు ముగ్గులేసిన పరమోన్నత అధినేత కేసీఆర్‌. 

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించటంతో నాకు ఎనలేని ఆనందం కలిగింది. జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆ ఉత్సవం మళ్లీ వస్తున్న సందర్భంలో కేసీఆర్‌ గురించి ఎన్నెన్నో జ్ఞాపకాలు. కేసీఆర్‌ ఒక డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌. రియల్‌ హీరో. బక్కపలుచని దేహంతో, అలుపెరుగని పోరాటపటిమతో నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపిన జాతిపిత ఆయన. అందుకే, ఆయన నాయకత్వానికి శిరసొంచి ప్రణమిల్లుతున్నాను.

కొత్త రాష్ట్ర దార్శనికుడిగా కేసీఆర్‌ సరికొత్త ప్రణాళికలు రచిస్తూ ముందుకుసాగుతుండటం తెలిసిన చరిత్రే. ‘బంగారు తెలంగాణ’ నిర్మాణం కోసం కేసీఆర్‌ ప్రణాళికలు రచిస్తున్న తీరు, సాధిస్తున్న ఫలితాలు మరెవరికీ సాధ్యం కానివి. 

కుటుంబ బలమే కేసీఆర్‌ విజయరహస్యమని ఒక్కోసారి అనిపిస్తుంది.  విద్యావంతుడైన తనయుడు కేటీఆర్‌ ఆయనకు కుడిభుజంగా ఉంటూ పాలనావ్యవహరాల్లో ఆసరాగా ఉంటూ, రాష్ర్టాభివృద్ధిలో కీలకభూమిక పోషిస్తుండటం ముదావహం.ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న కేసీఆర్‌ను తెలంగాణవాసులంతా ‘తెలంగాణ గాంధీ’ అని అభివర్ణించడంలో అతిశయోక్తి ఏముంది!

(వ్యాసకర్త: సినీ నటుడు)


logo