సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - May 29, 2020 , 23:22:46

జల తోరణం

జల తోరణం

‘జలజల పారే సెల ఏరులలో/ మిలమిల మెరసే ఇసుకలలో/ తామర పూవుల కమ్మతావిలో ఎవరున్నారో..’ అని తెలంగాణ తొలినాటి ఆధునిక కవిత్వ సంపుటి ‘తొలికారు’లో తాండవ కృష్ణ అనే కవి ‘జలధారల్లో ఎవరున్నారో’ అని 1957లో రాసుకున్నారు. అరవై ఏండ్ల తర్వాత ఆ జలధారలు రైతు సాగు భూములను వెతుక్కుంటూ వచ్చిన నడకల్లో ఇవ్వాళ రూపు స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ర్టావతరణ తర్వాత ప్రతి నీటి బిందువులో కేసీఆర్‌ బొమ్మ ప్రతిఫలిస్తున్నది. పది ఎత్తిపోతలతో కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ దాకా గోదావరి నీరు ఎదురెక్కి వచ్చింది. ఈ సందర్భంగా మూడేండ్ల పైచిలుకు కాలంలోనే 165 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను పూర్తిచేసుకున్న శుభ సందర్భాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సగర్వంగా ప్రకటించారు. కొండపోచమ్మ సాగర్‌లోకి పంపుచేసే మోటర్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఒకింత ఉద్వేగంగా ప్రసంగించారు. రాబోయేకాలంలో పసిడిపంటల బంగారు భవిష్యత్తును ఆవిష్కరించారు.

ఎక్కడో సుదూరాన గోదావరిలో పరుగులిడుతూ సముద్రంలో వృథాగా కలిసిపోయే నీరు తెలంగాణలోనే ఎత్తయిన కొండపోచమ్మ సాగర్‌లోకి ఊర్ధముఖంగా పయనించి రావటం ఓ అద్భుత ఘట్టం. దీనివెనుక రాత్రింబవళ్లు నిబద్ధతతో పనిచేసిన ఇంజినీర్లు, కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. జలాశయాలు, బ్యారేజీల కోసం తమ  భూములను ఇచ్చిన రైతుల త్యాగాలు అంతకంటే ముఖ్యమైనవి. అందుకే సీఎం రైతుకు భూమి కన్నతల్లి లాంటిదని, అలాంటి భూమిని కోట్లాది రైతుల కోసం త్యాగంచేసిన వారికి ఏమిచ్చినా తక్కువేనని కొనియాడారు. ఈ ఎత్తిపోతల కోసం వేల కోట్లు వెచ్చించి విద్యుత్‌  ప్లాంట్లు నిర్మించినా రైతుల నుంచి ఒక పైసా నీటి తీరువా వసూలు చేయబోమని ప్రకటించటం రైతు శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. 

తెలంగాణ వస్తె ఏమొస్తదన్నదానికి భూమే జీవితంగా బతుకుతున్న రైతులు సాదాసీదాగానే సమాధానం ఇచ్చిన మర్కూక్‌ రైతు మాటల్లో చెప్పాలంటే.. ‘ప్రాజెక్టులు అంటే యాడనో ఉంటయని ఇన్నం.. కానీ మా ఊర్లనే ప్రాజెక్టు కట్టి నీళ్లను తీసుకొస్తరని ఎన్నడనుకోలె. ఏ నాయకుడు చేయని పని కేసీఆర్‌ సార్‌ చేసి చూపిండు’. ‘ఎవుసం చేయాలంటేనే ఎండుతదో పండుతదో తెల్వని కాలంలో సీఎం కేసీఆర్‌ సారు రైతుల గురించి ఆలోచన చేసి ప్రాజెక్టులు కట్టి యాడికెల్లో మా పొలాలకు నీళ్లను అందిస్తుండు..’ అని మరో మహిళా రైతు చెప్పింది. ‘దుర్భర దౌర్భాగ్యపు దేవతను/ దూరంగా పంపు దినాలను/ హిమవదున్నత ధోన్నోత్కరాలను/ పచ్చపచ్చని నాజూకు పొలాలను.. చూతునో?’ అని మృత్యుంజయం అనే కవి సంశయాత్మకంగా తన కలను రాసుకున్నాడు. ఆ కల నిజమై పచ్చని పొలాలు తెలంగాణ అంతటా నాజూకుగా ఊగుతున్నవి. వినూత్న పథకాలతో సాధించిన విజయాలను ఏ ఊరునడిగినా చెప్తుంది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిల్చిన తెలంగాణ రాబోయేకాలంలో నియంత్రిత సాగు ద్వారా మరెన్నో అద్భుతాలు సాధిస్తుందనటంలో సందేహం లేదు. 

తాజావార్తలు


logo