గురువారం 09 జూలై 2020
Editorial - May 29, 2020 , 23:22:44

సజల నయనాల నుంచి సుజల పయనాల దాకా

సజల నయనాల నుంచి  సుజల పయనాల దాకా

ఎక్కడి కాళేశ్వరం... ఎక్కడి కొండపోచమ్మ! సముద్ర మట్టానికి సుమారు వంద మీటర్ల ఎత్తునుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించడం భగీరథయత్నం కన్నా గొప్పది కదా! ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులంటే దశాబ్దాలు పట్టేది. అంచనాలు పెరుగుతూ ఉండేవి. నాయకులకు కమిషన్లు వచ్చేవి. కానీ తెలంగాణ బీడు భూములకు నీళ్ళు రాకపోయేవి.

కుటుంబాలు వలసపోయి ఇండ్లు కూలిపోతయి, 

గుడ్డమంత తుమ్మ మొలిచి గుండె పగులుతుంటది, 

గుడ్లల్ల నీరుంటది, గుండె కొట్టుకుంటది, 

ఎత్తొంపుల పల్లెల్ల ఇనుప పాదముంటది

కాల్పుల్ల తూట్లు పడ్డ కట్టె తలుపులుంటయి

గాయపడిన బాలింతల పాల మరకలుంటయి

వలస పెత్తనం కాల్చిన కలత గురుతులుంటయి.. 

అణువణువున దుఃఖాలు, అడుగడుగున సాహసాలు

ఇవి నాకు గుర్తున్న కొన్ని కవి వాక్కులు. ఉద్యమకాలంలో ఈ పాట ఏ తెలంగాణ వాడైనా వింటున్నాడంటే.. అతడి మనసు గిర్రున వెనుక్కుపోతుంది. పాత జ్ఞాపకాలు సినిమా రీళ్ళలా కదులుతుంటాయి. ఎట్లున్న తెలంగాణ ఎట్లయిపోయింది! మనసంతా ఒకటే ఆవేదన! నాకు మా ఊరు యాదికొస్తది, మా ఊరి చెరువు కండ్లల్ల కనిపిస్తుంటది. చెరువులో ఈతలు కొట్టిన జ్ఞాపకం.. చెరువు నీళ్ళలో దాగి ఉన్న బండలను తాకుతూ-ఇదిగో కుంచం గుండు. ఇంకా ముందుకు పోతే పెద్ద బండలు... అంటూ గుర్తుపట్టేవాళ్లం. చెరువు నిండిందంటే-బతుకమ్మ, దసరా పండుగలను చూడాలె. వెంకన్న దుకాణంలో కొత్త బట్టలు కొనుక్కొని ఊరంతా కొత్తకొత్తగా కనిపించేది! ఇదంతా చిన్నప్పటి సంగతి. ఆ తర్వాత పాడుకాలం వచ్చింది. చెరువులు నిండవు, బాయిల నీళ్ళు తోడుదామంటే కరెంటు రాదు. కరెంటు రాక మిరపతోట కండ్లముందే ఎండిపోతుంటే మా బాపు పడిన బాధ జీవితంలో మరిచిపోలేను.

చెరువులను నిర్లక్ష్యం చేయడం, కరెంటు రాకపోవడం వెనుక వలసవాద కుట్ర దాగి ఉందని తెలియని అమాయకత్వం మనది. తెలంగాణను ఎప్పుడూ ఘర్షణలతో సంక్షోభంలో పెట్టే కుట్రలు అర్థం కాలేదు మనకు ఆనాడు.

కొండపోచమ్మ జలాశయానికి నీళ్లు వదులుతున్న దృశ్యాలు చూస్తుంటే మళ్లీ అదే పాత జ్ఞాపకాల వరద... ఈ మధ్యనే మా ఊరి (రేకొండ) చెరువు నిండింది. కొద్దిరోజుల కిందట మా మామ కొడుకు మధుబావ ఫోన్‌ చేసి అడిగిండు. మా ఊరికి వచ్చినప్పుడు చెరువు కట్టమీద తిరిగిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నడు. నాలుగైదు రోజులు అవే మాటలు వెంటాడుతున్నాయి. ఒకరోజు రాత్రి పది గంటలకు ఫోన్‌ చేసిన. మళ్ళా మా ఊరికి పోదామా అని అడిగిన. ఈ క్షణాన రమ్మంటే వస్తానన్నాడు. అంతే .. తెల్లారకముందే వరంగల్‌లో ఉన్న ఆయనను తీసుకొని మా ఊరికి పోయిన. మళ్ళా అక్కడ మా సోదరుడి వరుస-వెంకన్నతోపాటు కట్టమీద నడుస్తుంటే.. మాకు దేవుళ్ల సినిమాలో మాదిరి మేఘాల మీద నడిచినట్టనిపించింది!

ఎక్కడి కాళేశ్వరం... ఎక్కడి కొండ పోచమ్మ! సముద్ర మట్టానికి సుమారు వంద మీటర్ల ఎత్తునుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించడం భగీరథయత్నం కన్నా గొప్పది కదా! ఉమ్మడిరాష్ట్రంలో ప్రాజెక్టులంటే దశాబ్దాలు పట్టేది. అంచనాలు పెరుగుతూ ఉండేవి. నాయకులకు కమిషన్లు వచ్చేవి. కానీ తెలంగాణ బీడు భూములకు నీళ్ళు రాకపోయేవి. రష్యాలోనో, చైనాలో కాదు, ఒక ప్రజాస్వామ్య దేశంలో అనేక కోర్టులు, చట్టాల పరిధిలో వ్యవహరిస్తూ - ప్రజలను మెప్పిస్తూ- ఆరేండ్లలో ఇన్ని ప్రాజెక్టులను పూర్తిచేయడం ప్రపంచ చరిత్రలోనే అబ్బురం! ఇది కేసీఆర్‌ సాధించిన ప్రపంచ అద్భుతం!

మనకే ఇంత ఉద్వేగం ఉంటే, మరి కేసీఆర్‌కు ఎట్లుండాలె!: కొండపోచమ్మ జలాశయానికి నీళ్ళు వదలడం ఉద్వేగభరిత ఘట్టం. ఆ కార్యక్రమానికి హాజరైన ఒక మిత్రుడికి ఫోన్‌ చేసి మాట్లాడిన. మర్కూక్‌ దగ్గర నీళ్ళు వదిలిన తర్వాత కేసీఆర్‌ సమీపంలోని వరదరాజ స్వామి గుడికి వెళ్ళారట. ఆయనకు ఏమనిపించిందో.. అక్కడినుంచి మళ్లీ నీళ్ళు వదిలిన దగ్గరికి వచ్చారట. కొద్దిసేపు ఆ నీళ్ళను ఉద్వేగంతో చూస్తూ ఉండిపోయారట!

ఉరకలేస్తున్న ఆ నీళ్లను చూస్తూ ఉంటే కేసీఆర్‌ మనస్సులో ఎన్ని ఆలోచనలు  సుడులు తిరుగుతున్నాయో! ఎన్ని జ్ఞాపకాలు పరవళ్ళు తొక్కుతున్నాయో! ఎన్ని బాధలు.. ఆ గుండెకు ఎన్ని గాయాలు.. ఎంత ఆవేదన.. ఎంత తపన! ఫూల్‌ భీ కభీ కభీ ఫూల్‌ భీ ఆసూ బరస్తే హై, లోగ్‌ ఉన్‌కో షబ్నమ్‌ సమజ్తే హై. ఎప్పుడో చిన్నప్పుడు విన్న గుర్తు. మనసులో ఎన్ని బాధలు ఉన్నా కొందరు గుంభనంగా, నవ్వుతూ మాట్లాడుతరు. కానీ ఏమి లోకమో ఇది.. నవ్వులను చూస్తుందే తప్ప మనిషిలోని బాధలను చూడదు కదా! కొండపోచమ్మ జలాశయంలోకి నీరు వదలే ముహూర్తం ఖరారైన నాటినుంచి కేసీఆర్‌ మనసులో ఎంత ఉద్విగ్నత చోటుచేసుకున్నదో! ఈ ఘడియల కోసమే కదా ఆయన అహరహం శ్రమించారు. ఉద్యమకాలంలో అనేక బాధలు, అనేక అవమానాలు భరించారు! అందుకే ఆ నీటి ప్రవాహాన్ని చూస్తుంటే గతకాలపు జ్ఞాపకాలు ఆయన కండ్లముందు సినిమా రీళ్ళలా తిరుగుతూ ఉండి ఉంటాయి.

టీఆర్‌ఎస్‌ను స్థాపించి, ఉద్యమ జెండా పట్టుకోవడానికి చాలా ముందునుంచే కేసీఆర్‌కు తెలంగాణ స్పృహ ఉన్నది. ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాల మాదిరిగా ఉన్నాయని, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాల లాగున్నాయని ఆయన ఆనాడే ఇంజినీర్లతో అనేవారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తేనే ఈ సమస్యలు తీరుతాయని, అందుకు తానే ముందలపడక తప్పదని కూడా అన్నారు. ఆంధ్రలో మాదిరిగా పొలాలకు కాలువల ద్వారా నీరందడం లేదని, భూగర్భజలాలను వాడుకోవలసి వస్తున్నదని ఆయన గుర్తించారు. అందుకే ఆనాటి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంత రైతులకు కరెంటు ఉచితంగా ఇవ్వాలని వాదించి సాధించారు. తెలంగాణ కష్టాలకు రాష్ట్రసాధనే పరిష్కారమని గ్రహించినా తొందరపడలేదాయన. ఎప్పుడు యుద్ధం చేయాలో, ఎప్పుడు విరామం పాటించాలో ఆయనకు తెలుసు.

తెలంగాణ జెండా ఎత్తిపట్టుకున్న తర్వాత ఆయనను ఆంధ్రా నాయకత్వం, మీడియా ఎన్ని అవమానాలకు గురిచేసిందో, ఎన్నిరకాలుగా కష్టపెట్టిందో! ఆంధ్ర మీడియా ఆయనను ఇబ్బందులు పెడుతూ ఉంటే, తెలంగాణ ప్రజానీకం టీవీ చూస్తూ కంటతడి పెట్టేవారు. ప్రజలు ఎంత ఆగ్రహించినా కేసీఆర్‌ మాత్రం సంయమనం బోధించేవారు. శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత ఆరేండ్లలోనే గ్రామీణ రంగంలో, పారిశ్రామికరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇవాళ కేసీఆర్‌కు తిరుగులేదు. బక్కగా కనిపించినా జన బలమంతా తనతోనే ఉంచుకోగలిగినా అత్యంత బలవంతుడు. ఆ గాయపడ్డ మనసు అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు చేపట్టిందని తెలిస్తే రాజ్యాంగబద్ధంగా, న్యాయ వేదికలపై పోరాడుతామన్నారు. అంతే తప్ప పక్క రాష్ట్రంతో శత్రుభావన కూడదన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎడారిగా మారినా పట్టించుకోని తాబేదారు నాయకులు ఇప్పుడు బాబ్లీలో చంద్రబాబు మాదిరిగా చొక్కాలు చింపుకుంటున్నారు! కానీ కేసీఆర్‌ మాత్రం- మనసులో మాలిన్యం, మనుషుల మధ్య వైషమ్యం ఉండకూడదంటారు. ఏపీలోని నీటి ఎద్దడి ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం ఎట్లా అనేది కూడా ఆయన ఆలోచించారు. ఆయన మనస్తత్వం అటువంటిది.

కొద్దిరోజుల కిందట సత్యం అని ఒక మిత్రుడు బౌద్ధ కథ ఒకటి గుర్తు చేశాడు. ఒక తేలు నదిలో కొట్టుకుపోతున్నదట. బౌద్ధ భిక్షువు వెంటనే దానిని చేతితో తీసి ఒడ్డుకు వేశాడు. ఈలోగా తేలు ఆయన చేతిని కుట్టింది. ఒడ్డుకు వేసిన తేలు మళ్ళా నీటిలోకి వెళ్ళింది. దీంతో ఆయన మళ్ళా దానిని ఒడ్డుకు పడేశాడు. అప్పుడూ తేలు కుట్టింది. తేలు మళ్ళా నీటిలోకి వెళ్ళింది. బౌద్ధ భిక్షువు మూడోసారి తేలు కుడుతున్నా సరే, దానిని తీసి ఒడ్డుకు పడేశాడు. ఈ విచిత్రం చూస్తున్న ఒక వ్యక్తి అడిగాడట. తేలు కుడుతూనే ఉంది కదా, అయినా దానిని ఎందుకు కాపాడుతున్నావు అని. అందుకు ఆ బౌద్ధ భిక్షువు బదులిచ్చాడు- ‘కుట్టడం దాని నైజం. కాపాడటం నా నైజం!’

[email protected], పరాంకుశం వేణుగోపాలస్వామి


logo