ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 29, 2020 , 23:10:55

జలబోనం

జలబోనం

నది

ఇప్పుడిప్పుడే

తెలంగాణ బిడ్డలకు పాలిస్తున్నది

గుక్కపెట్టి ఏడుస్తున్న బీడు భూముల

దేవులాడి బుక్కెడు పాలిస్తున్నది

రొమ్ములెండిన మడులకు నీళ్ళే పాలు

నీరు

పల్లానికే పారటం ప్రాచీన పద్ధతి

ఆరొందల పద్దెనిమిది మీటర్లెత్తున ఎత్తిపొయ్యడం

రీ ఇంజినీరింగ్‌ ఆధునిక పద్ధతి

మనసుంటే మొగులు చేతికందుతది

సంకల్పముంటే

సందమామ వాకిట్ల సన్నజాజి ముగ్గయితది!

నది నడకలు మార్చుకుంటున్నది

దిశల్ని మార్చుకుంటున్నది

కన్నీళ్లు... నీళ్ళైతున్నయి

నీళ్ళు... నిధులైతున్నయి

జల జాతరలైతున్నయి

బిందెడు నీళ్లకై నడిచిన అడుగులల్ల

నీళ్ళు దర్జాగా పరిగెత్తుకొస్తున్నయి

చెంగుచెంగున అలలు

పల్లెపల్లెను నవ్వుతూ పలుకరిస్తున్నయి

ఎండకాలంలో

అలుగులు దుంకుతున్న చెరువులు

జలహారతులతో

పల్లె ఎదలు పులుకరిస్తున్నయి

ఇన్ని నీళ్ళు 

ఇన్నేళ్లు ఏడున్నవో 

చెవులకు కొంకిపోగులు

చేతులకు బ్రాస్‌లైట్లే చూసుకున్న బానిసలు

జీవితాల్ని మంటగలిపిన సద్దినేతలు

వీళ్ళ బొక్కలను ఏట్లగలిపినా

నీళ్ళకే అవమానం

ఒకనాడు

రాతి శాసనాలు రాజ్యాల చరిత్రను

రాజుల వైభవాన్ని తవ్విపోసేది

ఇప్పుడు

నీళ్ళ కాలువలు తెలంగాణ చరిత్రను

పునర్నిర్మాణ వైభవాన్ని ఎత్తిపోస్తున్నది

కడుపునిండి అరుగకకక్కేటోనికి

నీళ్ళు కన్నీళ్ళైతున్నయి

ఏండ్ల సంది కరువుతో కూలిపోయినోళ్లకు

నీళ్ళు పండుగలైతున్నయి

కొండపొచమ్మ జలపోచమ్మ

కొండపోచమ్మకు జలబోనం

(కొండపోచమ్మ రిజర్వాయర్‌

ప్రారంభించిన సందర్భంగా..)

- వనపట్ల సుబ్బయ్య ,94927 65358


logo