మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - May 28, 2020 , 23:15:24

తానమాడుతున్న తెలంగాణ

తానమాడుతున్న తెలంగాణ

ఒకప్పుడు నీళ్ల కోసం అరిగోసపడ్డ తెలంగాణ ఇయ్యాల మండే ఎండల్లో సైతం అలుగులు దుంకుతున్న చెర్లల్ల అందంగా తానమాడుతున్నది. ఎగిసి పడుతున్న కాళేశ్వర ప్రాణహిత పరవళ్లను చూసి మురిసిపోతున్నది. ఇన్నేండ్ల కష్ట్టమంతా తీరిందని కన్నీళ్లను తుడుచుకుంటూ ముందుకుసాగుతున్నది.

తెలంగాణ తెచ్చిన సంబురం ఇది. ఒకనాడు ఎట్లుండే, ఇప్పుడెట్లున్నది! ఉప్పొంగుతున్న గోదారి తలాపున్నే పొయ్యేది. కిందున్న కృష్ణమ్మ కిందికెళ్లే పొయ్యేది. నడుమనున్న మనకు నరకమే మిగిలింది. మరియ్యాళ.. స్వరాష్ట్రంలో నిలు చొని మన నీళ్లను మనం తెచ్చుకుంటున్నం. బీడుపడ్డ భూములను పచ్చగా పండించుకుంటున్నం.

ఇకనుంచి తెలంగాణను కాళేశ్వరం ముందు, కాళేశ్వరం తర్వాత అని చెప్పుకోవాలె. ఇవ్వాళ కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే.. 150 కిలోమీటర్ల గోదావరి ఎడారిగానే మిగిలి ఉండేది. పై రాష్ర్టాలు ఎక్కడికక్కడ బ్యారేజీలు, డ్యామ్‌లు కట్టి, గోదావరిని పైన్నే బందీంచేసిండ్రు. అమాసకో, పున్నానికో గట్టిగ వానలు పడి పైనున్నోళ్లు గేట్లెత్తితే వచ్చే గోదారిని ఒడిసిప ట్టేందుకు శ్రీరాంసాగర్‌ తప్పిస్తే, మన దగ్గరున్న రిజర్వాయర్లెన్ని అంటే సున్నా అనే చెప్పాలె.

పై నుంచి గోదావరి కిందకు రాకపోతే, ఎప్పుడూ నిండుగా కిందికురికి సముద్రంపాలయ్యే ప్రాణహితను, పంపులు మోటార్లతోటి పైకి తీసుకెళ్లి, ఎండిన గోదారి దారినంతా నిండుగ ప్రాణహిత నీళ్లతో శ్రీరాంసాగర్‌ దాకా నింపుకోవాలె. ఒకవేళ పైనుంచి నీళ్లోస్తే గోదారి దారిమీద కట్టుకున్న ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, ఇంకా కిందికిపోతే.. అక్కడ కడుతున్న తుపాకులగూడెం, సీతారామ బ్యారేజీల్లో నీళ్లాపి, మన తెలంగాణ బీళ్లకు ఆ నీళ్లను మళ్లించుకోవాలె. సుక్కనీరు వృథా కానియ్యొద్దు. పంటలు పండాలె, తలరాతలు మారాలె. అన్నం పెట్టేటోడు దర్జాగా బతుకాలె. తెలంగాణ తలెత్తుకొని నిలవడాలె.

ఎట్లాంటి దరిద్రాలు తెలంగాణల ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పడిన తపనకు ప్రతిఫలం ఇది. లేకపోతే మూడేండ్లల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా పూర్తయితది! అండ్లకెళ్లి నీళ్లెట్లా వస్తయ్‌. అసలు ప్రపంచ సాగునీటిరంగ చరిత్రలో ఇంతపెద్ద ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేసినోళ్లు లేనే లేరు.. మన కేసీఆర్‌ తప్ప.

కాళేశ్వరం, ప్రాణహితతో ఒక్క గోదావరినే కాదు, మానేరు నదికి సైతం ప్రాణం పోసింది తెలంగాణ సర్కారు. ఎల్లంపల్లిని నిండుగ నింపి, అక్కడ్నుంచి ప్రాణహితను సొరంగాలు, సర్జిపూల్స్‌, పంప్‌హౌజ్‌ల ద్వారా, శ్రీరాంసాగర్‌ వరదకాల్వలో పోసి.. 24 టీఎంసీల మిడ్‌ మానేరుకు జీవం పోసిండ్రు. అక్కడి నుంచి లోయర్‌, అప్పర్‌ మానేరుకు ప్రాణహితను తరలించి, మానేరును సజీవకోనేరు చేసిండ్రు.

కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే సిరిసిల్ల, సిద్దిపేటలో ఇవ్వాళ నిండుగ నీళ్లతో కళకళలాడుతున్న, అనంతగిరి రిజర్వాయర్‌, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ జలాశయాల్లోకి నీళ్లు ఎక్కడినుంచి వచ్చేవి?  ఇయ్యాళ ప్రపంచమే ఆశ్చర్యపోయే ఓ మానవాద్భుత మహాకట్టడం మూడేండ్లలో పూర్తవటం మామూలు విషయం కాదు.

150 కిలోమీటర్లు నిండుకుండలా తొణికిసలాడుతోన్న గోదావరి గంగలో ఎండకాలంలో మత్తళ్లు దుంకుతున్న చెర్లల్ల నీళ్ళు, అవీ కాళేశ్వరం ప్రాజెక్టు నింపిన ప్రాణహిత నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి తెలంగాణలోని ప్రతి పల్లె సిరుల ముల్లె అయ్యింది. ప్రతి ఎకరం సిరులతో పచ్చందనాలు వెదజల్లుతున్నది. 


logo