బుధవారం 30 సెప్టెంబర్ 2020
Editorial - May 28, 2020 , 23:15:25

హాంకాంగ్‌ దైన్యం

హాంకాంగ్‌ దైన్యం

చైనా పడగనీడనే అయినా, ఇంతకాలం స్వేచ్ఛా మండలంగా వెలిగిపోయిన హాంకాంగ్‌ ఇప్పుడు స్వతంత్రతను కోల్పోయే దీనస్థితిలో ఉన్నది. నిరసనలతో భుగభుగలాడుతున్నది. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని హరించే కొత్త భద్రతా చట్టానికి చైనా పార్లమెంటు గురువారం ఆమోదముద్ర వేసింది. చట్టానికి నిరసనగా ప్రజలు ప్రదర్శనలను చేపడుతుంటే, వారిని అణిచివేయడానికి చైనా సైనికదళాలను సిద్ధంగా పెట్టుకున్నది. పార్లమెంటు ఆమోదించిన బిల్లు ప్రకారం హాంకాంగ్‌లో చైనా ఆధిపత్యాన్ని ప్రశ్నించడమే నేరమవుతుంది. హాంకాంగ్‌ ప్రజల హక్కులను హరించడానికి చైనా కొంతకాలంగా ప్రయత్నిస్తున్నది. దీనిని హాంకాంగ్‌ ప్రజలు తీవ్ర ఆందోళనలతో అడ్డుకుంటున్నారు. వారి ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా సానుభూతి, మద్దతు వ్యక్తమైంది. ఇప్పుడు ప్రపంచదేశాలు కరోనా గొడవలో ఉంటే, చైనా మాత్రం ఇదే అదనుగా హాంకాంగ్‌పై ఉక్కుపాదం మోపడానికి సిద్ధపడుతున్నది.

చైనాను రాజులు పాలిస్తున్న కాలంలో హాంకాంగ్‌ను బ్రిటన్‌ లీజుకు తీసుకున్నది. సుదీర్ఘకాలం అంటే 150 ఏండ్లకు పైగా బ్రిటిష్‌ అధీనంలో ఉండటంతో హాంకాంగ్‌ స్వేచ్ఛా వాణిజ్య మండలంగా అభివృద్ధి చెందింది. ఈలోగా చైనాలో అనేక మార్పులు జరిగి చివరికి కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. క్రమంగా ప్రజలకు పెద్దగా హక్కులులేని నిరంకుశ వ్యవస్థ నెలకొన్నది. మరోవైపున హాంకాంగ్‌లో ప్రజలు స్వేచ్ఛకు అలవాటుపడ్డారు. ప్రపంచ ప్రధాన వాణిజ్య కేంద్రాలలో 6వ స్థానంలో ఉన్న హాంకాంగ్‌ మానవాభివృద్ధి సూచికలో నాలుగవ స్థానంలో ఉన్నది. లీజు గడువు ముగియడంతో 1997లో బ్రిటన్‌ హాంకాంగ్‌ను చైనాకు అప్పగించింది. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని గౌరవిస్తామని, ‘ఒకే దేశం- రెండు వ్యవస్థలు’ అనే సూత్రాన్ని పాటిస్తామని ఈ సందర్భంగా చైనా హామీ ఇచ్చింది. హాంకాంగ్‌లో చైనా చట్టాలు వర్తించవు. ఆర్థిక, పరిపాలనా, భద్రతారంగాలలో హాంకాంగ్‌ పూర్తి స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తున్నది. పూర్తిస్థాయిలో చైనా పెత్తనం ఏర్పడితే తాము హక్కులు కోల్పోతామనేది హాంకాంగ్‌ ప్రజల ఆందోళన.

కరోనా వైరస్‌ విషయంలో అంతర్జాతీయంగానే కాదు, ఆంతరంగికంగా కూడా చైనా ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నది. సమస్యలను పరిష్కరించలేని పరిపాలకులు జాత్యభిమానాన్ని రెచ్చగొడుతూ, ప్రజల దృష్టిని మళ్లించడం పరిపాటి. కొంతకాలంగా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యక్తి ఆరాధనను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆయన అనుచరవర్గం ‘చైనా జాతి పునరుజ్జీవన’ సిద్ధాంతాన్ని ముందుకుతెచ్చింది. గత నాలుగేండ్లుగా జాత్యభిమానాన్ని రెచ్చగొట్టే విధానాలను చైనా ప్రభుత్వం అవలంబిస్తున్నది. తైవాన్‌, హాంకాంగ్‌ సమస్యలను రగిలించడమే కాకుండా, భారతదేశ సరిహద్దులో చిటపటలాడుతున్నది. తమను రెండవ ప్రచ్ఛన్నయుద్ధం వైపు నెడుతున్నదంటూ అమెరికాపై ఆరోపణలు చేసింది. హాంకాంగ్‌లోనే కాదు, చైనాలో మానవహక్కులను గౌరవించేవిధంగా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవడానికి మానవహక్కుల పరిరక్షణను షరతుగా పెట్టాలి.


logo