ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - May 28, 2020 , 00:16:07

మన ఇంట సిరుల పంట

మన ఇంట సిరుల పంట

ఉమ్మడి రాష్ట్ర వివక్ష పాలనలో ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రధానంగా భూగర్భజలాల మీదనే ఆధారపడిన రైతాంగానికి చాలినంత విద్యుత్‌ అందించేవారు కాదు. సాగు నీరందక, కాలం కాక, కరెంటు రాక తెలంగాణ రైతాంగం అరిగోస పడ్డది. ఎరువులు, విత్తనాలు సకాలంలో దొరుకక రైతులు తల్లడిల్లిపోయారు.

దండుగ అన్న వ్యవసాయం పండుగయ్యింది. బక్కచిక్కిన పేద రైతు భరోసాగా బతుకుతున్నాడు. తెలంగాణ భారతదేశ ధాన్యాగారంగా మారింది. రెండో హరిత విప్లవానికి నాంది పలికింది. 

ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వ్యవసాయరంగం. వ్యవసాయం అభివృద్ధి చెందితే ప్రజలకు కడుపు నిండా తిండి దొరుకుతుంది. వ్యవసాయాధారిత పరిశ్రమలకు ముడిసరుకులు లభ్యమవుతాయి. వ్యవసాయరంగమే అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పించి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి దోహదపడుతుంది. ప్రజల కొనుగోలుశక్తిని పెంచి పారిశ్రామిక, సేవారంగాల వస్తువులకు డిమాండ్‌ను కల్పిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా విదేశీ మారకద్రవ్యం సంపాదించవచ్చు. అందుకే ఒక ప్రాంత సర్వతోముఖాభివృద్ధిలో వ్యవసాయాభివృద్ధి ఇరుసు వంటిది.

ఉమ్మడి రాష్ట్ర వివక్ష పాలనలో ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రధానంగా భూగర్భజలాల మీదనే ఆధారపడిన రైతాంగానికి చాలినంత విద్యుత్‌ అందించేవారు కాదు. సాగు నీరందక, కాలం కాక, కరెంటు రాక తెలంగాణ రైతాంగం అరిగోస పడ్డది. ఎరువులు, విత్తనాలు సకాలంలో దొరుకక రైతులు తల్లడిల్లిపోయారు. పెట్టుబడి ఖర్చులు పెరుగడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు. అప్పుల పాలయ్యారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ కూలీలు ఆకలిచావులకు గురయ్యారు. లక్షల మంది రైతులు, కూలీలు  పొట్టచేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఈ ఆరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ వ్యవసాయ పునర్జీవానికి చేసిన కృషి మహత్తరమైనది. కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసింది. పెండింగ్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బహుళార్థసాధక కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసి లక్షల ఎకరాలకు నీరు అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేసింది. దీంతో సాగునీటి ప్రాజెక్టుల కింద ఏకంగా 40 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. బీడు భూములు 60 శాతం సాగులోకి వచ్చాయి. ఎస్సారెస్పీ మెదటి, రెండో దశల కింద 12 లక్షల ఎకరాల సాగు, సాగర్‌ కింద 6.40 లక్షల ఎకరాలలో పూర్తి సాగు జరిగింది. మిషన్‌ కాకతీయ పథకం వల్ల చెరువులన్నీ నిండి జలకళను సంతరించుకున్నాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాలలో భూగర్భ జల సగటు మట్టం గతేడాది 12 మీటర్లు ఉండగా అది ఈ ఏడాది ఏకంగా 7 మీటర్లకు చేరింది. రైతులు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నీళ్లు పెట్టుకోవడానికి వీలుగా వ్యవసాయానికి 24 గంటలూ నిరంతరం ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త చరిత్రను సృష్టించింది. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు అమలుచేసింది. ఇవన్నీ తెలంగాణ రైతాంగానికి కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఫలితంగా గతేడాది యాసంగిలో మొత్తంగా 18.56 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, అది ఈ ఏడాది ఏకంగా 40 లక్షల ఎకరాలకు పెరిగింది. వ్యవసాయంలో రికార్డు స్థాయిలో పంటల దిగుబడి వచ్చింది. ఒక వరి పంటనే తీసుకుంటే గతేడాదితో పోల్చుకుంటే 66 లక్షల మెట్రిక్‌ టన్నుల అదనపు దిగుబడి సాధించి చరిత్ర సృష్టించింది. 2019-20 సంవత్సరంలో 1.3 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తిని సాధించడం దేశానికే గర్వకారణం. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ రాష్ర్టాన్ని ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’ అని అభివర్ణించింది. వరి పంటే కాకుండా మిగతా ఆహార పంటల దిగుబడి కూడా 42 శాతం పెరిగింది. మిర్చి పంట గతేడాది కంటే 24 వేల మెట్రిక్‌ టన్నులు పెరిగింది. నూనె ఉత్పత్తి పంటలు 42 వేల మెట్రిక్‌టన్నుల మేర పెరిగాయి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ స్థాయిలో పంటలు దిగుబడి కావడం 2019-20 సంవత్సరానికి రికార్డుగా నిలిచింది.

యాసంగిలో పండిన మొత్తం పంటను, ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్టు ప్రభుత్వం రైతుకు భరోసా ఇచ్చింది. కరోనా సంక్షోభం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్య సేకరణకు పూనుకున్నది. అందుకుగాను 30 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని సాహసం ఇది. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమైనాయి. 2020 మే 24 నాటికి 6,385 కొనుగోలు కేంద్రాల ద్వారా 53 లక్షల 60 వేల 989 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దాని విలువ 9,827 కోట్లు. 1,097 కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల 77 వేల 827 మెట్రిక్‌ టన్నుల మక్కజొన్న, 88 కేంద్రాల ద్వారా 82,941 మెట్రిక్‌ టన్నుల శనగలు, 14 కేంద్రాల ద్వారా 6,293 మెట్రిక్‌ టన్నుల పొద్దుతిరుగుడు, 23 కేంద్రాల ద్వారా 4,264 మెట్రిక్‌ టన్నుల జొన్న కొనుగోలు చేశారు. ఇప్పటికే మొత్తం 61 లక్షల 32 వేల 214 మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను కొనుగోలు చేసింది.

సాగునీరు, పెట్టుబడి, మద్దతు ధర ఈ మూడింటిని ప్రభుత్వం రైతాంగానికి అందజేయడం వ్యవసాయంలో గణనీయమైన పురోగతికి దారితీసింది. పంటల దిగుబడి పెరిగింది. ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాం. మన ధాన్యాన్ని ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. దండుగ అన్న వ్యవసాయం పండుగయ్యింది. బక్కచిక్కిన పేద రైతు భరోసాగా బతుకుతున్నాడు. తెలంగాణ భారతదేశ ధాన్యాగారంగా మారింది. రెండో హరిత విప్లవానికి నాంది పలికింది. ఇవన్నీ ఆరేండ్లపాటు కేసీఆర్‌ వ్యవసాయరంగం మీద చేసిన అనితరసాధ్యమైన కృషి ఫలితమే. నేడు వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధిని సుస్థిరపరుచడానికి, విస్తృతపరుచడానికి కొత్త వ్యవసాయ విధానాన్ని రూపొందించారు.

రాష్ట్రంలో ఈ వానకాలంలో నేలల స్వభావం, ఆహార అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలను వేయాలో నిర్ణయించారు. ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా నిర్ణయించి ఆ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో రైతు అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తున్నారు. ఎల్లప్పుడూ రైతు తన ఉత్పత్తికి లాభసాటి ధరను పొందేవిధంగా కృషి సలుపుతున్నారు. దేశంలోనే ధనిక రైతాంగానికి తెలంగాణ నిలయంగా మారాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం.


logo