శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - May 28, 2020 , 00:16:06

ఎందుకీ భ్రమాత్మక ప్యాకేజీ?

ఎందుకీ భ్రమాత్మక ప్యాకేజీ?

మార్చి 26న ప్రకటించిన ప్యాకేజీలో స్టాక్‌మార్కెట్‌ స్టెబిలైజేషన్‌ కోసం 50 వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం కోట్ల మంది వలస కార్మికులు ఈ దేశంలో ఉన్నారనే విషయాన్ని పూర్తిగా విస్మరించింది. వలస కార్మికులు అనుభవించిన కష్టాలు స్వతంత్ర భారతంలో కనీవినీ ఎరుగని విషాదఘట్టాలు. 15 సంవత్సరాల బాలిక తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకొని పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నించేవారు మోదీ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను కూడా పరిశీలించాలి. గత 73 సంవత్సరాలలో భారతదేశం 2,219.37 బిలియన్‌ డాలర్ల అప్పు చేస్తే గత ఆరేండ్లలో మోదీ 1,058.81 బిలియన్‌ డాలర్ల అప్పు చేశాడు. డాలర్‌ విలువ రూపాయితో పోలిస్తే 62 నుంచి 77 వరకు పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పీసీ సర్కార్‌ ఇంద్రజాలాన్ని మరిపిస్తున్నది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడంలో మోదీని మించిన ఇంద్రజాలికుడు ప్రపంచంలోనే లేడు. నికరంగా 1.84 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ప్యాకేజీలో పొందుపరిచి, ఆర్బీఐ ప్రకటించిన ప్రోత్సాహకాలు, కేంద్రబడ్జెట్‌లో ప్రకటించిన అంశాలను, అప్పు తీసుకునే అవకాశాలను పేర్కొంటూ 20 లక్షల ప్యాకేజీ ఇస్తున్నట్టుగా చెప్పడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మాయ, మిథ్య, భ్రమ కలగలిపి, రాష్ర్టాల హక్కులను కబళించే అంశాలను జోడించి 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఆయన ఆర్భాటంగా ప్రకటించాడు. ఈ విపత్కర పరిస్థితులలో కూడా బడా కంపెనీల ప్రయోజనాల పరిరక్షణ కోసమే మోదీ తహతహలాడుతున్నాడు. ప్రజలు కరోనా వైరస్‌తో ఉద్యోగాలు కోల్పోయి, వలస కార్మికులు పనిలేక సొంత గ్రామాలకు దూరమై పస్తులతో అల్లాడిపోతుంటే అప్పు పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కరెంటు కంపెనీల ధనదాహానికి దేశ ప్రజలను అప్పజెప్పాలని, మున్సిపాలిటీలలో ప్రజలపై అధిక పన్నులు విధించాలని ప్రయత్నిస్తున్నాడు. ప్యాకేజీలో డొల్లతనాన్ని కేసీఆర్‌ ప్రశ్నిస్తే దైవదూషణ చేసినట్లుగా బీజేపీ ప్రచారదళాలు ముప్పేటదాడికి దిగాయి. ఊదరదళాల భజనలు శృతిమించి మోదీకి తెలియని విజయాలను ఆయనకు ఆపాదిస్తున్నాయి. 

కరోనా వైరస్‌ ప్రమాదాన్ని గుర్తించిన జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌ దేశాలు జనవరిలోనే సరైన చర్యలు తీసుకొని వైరస్‌ వ్యాప్తిని అరికట్టాయి. చైనా పొరుగుదేశమైన భారతదేశానికి కూడా సమగ్ర సమాచారం అంది ఉండాలి. కానీ కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రమాద తీవ్రతను గుర్తించినట్లుగా లేవు. బయటి దేశం నుంచి వచ్చిన వైరస్‌పై కేంద్రప్రభుత్వం వద్ద ఎక్కువగా సమాచారం ఉండే అవకాశం ఉంది. వైరస్‌పై రాష్ర్టాలు తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. కానీ ఆశ్చర్యకరంగా కేరళ, పంజాబ్‌, అసోం, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత మార్చి 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలుపరిచింది. అప్పటికే వైరస్‌ దేశమంతా వ్యాపించింది. ప్రమాదాన్ని హెచ్చరించడంలో భారత విదేశీ నిఘా వ్యవస్థ విఫలమయ్యిందా లేక కేంద్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించిందా అనే సందేహం కలుగుతున్నది. కేరళ ప్రభుత్వం మార్చి 11న లాక్‌డౌన్‌ అమలుపరిస్తే కేంద్ర ప్రభుత్వం మార్చి 25 వరకు ఎందుకు వేచి చూసింది? మార్చి 22న చప్పట్లు కొట్టే కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తే, 24న ఒక జాతీయ పార్టీ గోమూత్రం సేవించే కార్యక్రమం నిర్వహించింది. జనవరి చివరివారంలో వుహాన్‌ నుంచి వచ్చిన విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించిన వైద్యులకు వ్యాధి తీవ్రత తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మొదటివారంలోనే సరైన చర్యలు తీసుకొని ఉన్నట్లయితే ప్రస్తుత పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

ప్రపంచమంతా కరోనా వైరస్‌ ప్రభావంతో అల్లకల్లోలం అవుతుంటే ఢిల్లీలో మార్చి 13 నుంచి 15 వరకు వేలమంది గుమిగూడే తబ్ల్లిగీ జమాత్‌ సమావేశాలకు అనుమతివ్వడం కేంద్రం అసమర్థతకు పరాకాష్ఠ. మలేషియాలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశాల వల్ల వందల మందికి కరోనా వైరస్‌ సోకిందని అంతర్జాతీయ పత్రికలు తెలియజేశాయి. ఈ సంస్థ కార్యక్రమాలు కేంద్ర హోంశాఖ నిఘాలో కూడా ఉన్నవే. అలాంటి పరిస్థితులలో విదేశాల నుంచి వచ్చే వందల మందికి వీసా ఇవ్వడం, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చినవారిని ఢిల్లీలో సమావేశానికి అనుమతించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇండోనేషియా పర్యాటకుల గురించి తెలియజేసింది. కానీ కేంద్రప్రభుత్వం మార్చి 22 వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తబ్లిగీ జమాత్‌ కేంద్ర కార్యాలయాన్ని మూసివేసినరోజు 2,500 మంది కార్యాలయంలోనే ఉన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఎనిమిదివేల మంది కార్యాలయాన్ని సందర్శించారు. వైరస్‌ విస్ఫోటానికి ఈ సమావేశాలు దోహదం చేశాయి. ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారనేది ఈ ఉదంతంలో సుస్పష్టం. ఆ సమావేశాల తర్వాతనేమో మైనారిటీ ప్రజలపై అనేక వదంతులను వ్యాప్తిలో పెట్టి మత వైషమ్యాలకు ప్రయత్నించారు.

130 కోట్ల మంది గృహాలకు పరిమితం కావాలని తీవ్రమైన నిర్ణయం తీసుకున్నప్పుడు పరిణామాల గురించి సమగ్రంగా చర్చించి ఉండాల్సింది. అర్ధరాత్రి డిమానిటైజేషన్‌ పథకం ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు పడిన ఇబ్బందుల నుంచి అయినా గుణపాఠాలు నేర్చుకొని ఉండాల్సింది. మార్చి 26న ప్రకటించిన ప్యాకేజీలో స్టాక్‌మార్కెట్‌ స్టెబిలైజేషన్‌ కోసం 50 వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం కోట్ల మంది వలస కార్మికులు ఈ దేశంలో ఉన్నారనే విషయాన్ని పూర్తిగా విస్మరించింది. వలస కార్మికులు అనుభవించిన కష్టాలు స్వతంత్ర భారతంలో కనీవినీ ఎరుగని విషాదఘట్టాలు. 15 సంవత్సరాల బాలిక తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకొని పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఇవాంక ట్రంప్‌ దృష్టిని ఆకర్షించిన ఈ ఘటన అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. లాక్‌డౌన్‌ను ప్రకటించి, రహదారులను మూసివేసి, రెక్కాడితేగానీ కడుపునిండని కోట్ల మంది వలస కార్మికుల పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. గర్భిణులు, పిల్లలు వేల కిలోమీటర్లు నడిచి మార్గమధ్యంలో నీళ్లు, తిండిలేక మిడతలవలె రాలిపోయారు. అంతర్రాష్ట్ర ప్రయాణికుల సంక్షేమం చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం దారుణం. అందువల్ల పేదలు రహదారులపైనే ప్రాణాలు విడిచారు. దేశ విభజన తర్వాత జరిగిన ఘోర విషాదమిది. 

వలస కార్మికులు స్వగ్రామాలకు చేరేందుకు కేంద్ర ప్రభుత్వం 85శాతం టికెట్‌ ఖర్చులు భరిస్తున్నామని అసత్య ప్రచారం చేసుకోవడం విచారకరం. కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయాణ ఖర్చులను భరించడం లేదని సూరత్‌ కలెక్టర్‌ చెప్పడమే ఇందుకు నిదర్శనం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నించేవారు మోదీ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను కూడా పరిశీలించాలి. గత 73 సంవత్సరాలలో భారతదేశం 2,219.37 బిలియన్‌ డాలర్ల అప్పు చేస్తే గత ఆరేండ్లలో మోదీ 1,058.81 బిలియన్‌ డాలర్ల అప్పు చేశాడు. డాలర్‌ విలువ రూపాయితో పోలిస్తే 62 నుంచి 77 వరకు పెరిగింది. అభివృద్ధి రేటు 8 శాతం నుంచి ఎంత శాతానికి పడిపోయిందో తెలుసుకోవడానికి ఆర్థికవేత్తలు మదింపు చేస్తున్నారు. కాళేశ్వరానికి వెయ్యి రూపాయలు కూడా ఇవ్వని కేంద్రం పారిశ్రామికవేత్తలకు 1.45 లక్షల కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చింది. అందులో 1.05 లక్షల కోట్లు 20 పెద్ద కంపెనీలకు వెళ్ళాయి. కరోనా వైరస్‌ సంక్షోభంలో ఎగవేతదారులకు 68వేల కోట్ల రూపాయల అప్పు రైట్‌ ఆఫ్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 2024లో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటూ చెప్పుకోవడం కేవలం ప్రచార ఆర్భాటమే గానీ ఎంతమాత్రం సాధ్యమయ్యేది కాదు.

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు, వాషింగ్టన్‌ డీసీ)


logo