శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - May 26, 2020 , 22:59:59

తాలిబన్‌తో స్నేహం

తాలిబన్‌తో స్నేహం

కశ్మీర్‌ విషయంలో తాలిబన్‌ మన దేశానికి అనుకూల ప్రకటన చేయడం కీలక పరిణామం. కశ్మీర్‌పై తమ వైఖరిని వెల్లడిస్తూ ‘మేము ఏ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోబోము’ అంటూ తాలిబన్‌ నాయకత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కానంతవరకు భారతదేశంతో స్నేహంగా ఉండే ప్రసక్తి లేదంటూ మొదట తాలిబన్‌ పేర ఒక తప్పుడు వార్త ప్రచారమైంది. దీంతో తాలిబన్‌ నాయకత్వం ఈ స్పష్టత ఇవ్వవలసి వచ్చింది. తప్పుడు వార్త ప్రచారం వెనుక పాకిస్థాన్‌ ఉన్నట్టు ఆ తర్వాత వెల్లడైంది. కశ్మీర్‌పై తాలిబన్‌ ప్రకటన మూలంగా భారతదేశ వైఖరిలో కూడా మార్పు కనిపిస్తున్నది. రంజాన్‌ సందర్భంగా తాలిబన్‌ మూడురోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించడాన్ని హర్షిస్తూ, ఈ సుహృద్భావం అఫ్ఘానిస్థాన్‌లో శాశ్వత శాంతికి దారితీయాలని భారతదేశం ఆకాంక్షించింది. తాలిబన్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలంటూ అమెరికా ఇటీవలే భారతదేశానికి సూచించింది. ఆ తర్వాత ఇరుపక్షాల నుంచి ఈ సౌహార్ద ప్రకటనలు వెలువడ్డాయి.

తాలిబన్‌తో పోరాడుతున్న తమకు మద్దతుగా అఫ్ఘానిస్థాన్‌కు సైన్యాన్ని పంపవలసిందిగా భారతదేశాన్ని అమెరికా కొద్దికాలం కిందట కోరింది. కానీ మన దేశం ఆ ఊబిలోకి దిగకుండా జాగ్రత్తపడింది. ఆ తర్వాత తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నది. భారతదేశం సైన్యాన్ని దింపకపోవడం ద్వారా, తాము సూత్రరీత్యా ఉగ్రవాదానికి వ్యతిరేకమే తప్ప తాలిబన్లతో విరోధమేమీ లేదనే సందేశాన్ని ఇచ్చినట్టయింది. అఫ్ఘానిస్థాన్‌లో ఏ ప్రభుత్వం ఏర్పడినా తమ పెద్దరికం నడువాలనేది పాకిస్థాన్‌ ధోరిణి. కానీ పాకిస్థాన్‌ సహాయం పొందినవారే అఫ్ఘానిస్థాన్‌లో అధికారం చేపట్టినప్పటికీ, ఇతర దేశం జోక్యాన్ని సహించకుండా స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. పాకిస్థాన్‌ను కట్టడి చేసే క్రమంలో అఫ్ఘానిస్థాన్‌ పాలకులు భారతదేశానికి ప్రాధాన్యం ఇవ్వకతప్పదు. తాలిబన్‌ ఇంకా అధికారం చేపట్టనప్పటికీ, పాకిస్థాన్‌ మనోభావాలతో నిమిత్తం లేకుండా భారత్‌తో సఖ్యంగా ఉండటానికే సిద్ధపడుతున్నది.

పాకిస్థాన్‌తో సత్సంబంధాలు లేవు కనుక, ఇరాన్‌లోని చాబహార్‌ రేవు ద్వారా అఫ్ఘానిస్థాన్‌తోపాటు, మధ్య ఆసియాదేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలనేది భారతదేశ లక్ష్యం. ఇప్పటికే  అఫ్ఘానిస్థాన్‌ పునర్నిర్మాణంలో మన దేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ ఆ దేశ పరిస్థితులు వేగంగా మారుతున్నాయనేది గమనించాలి. తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి . ఇరాన్‌, చైనా, రష్యా పావులు కదుపుతున్నాయి. మరోవైపు పాకిస్థాన్‌ సైంధవ పాత్ర వహిస్తున్నది. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఇంకా వేచిచూసే ధోరణిని ప్రదర్శించకూడదు. భౌగోళికంగా అఫ్ఘానిస్థాన్‌కు ఉన్న కీలకపాత్రను గుర్తించాలి. తాలిబన్‌ ఏకశిలా స్వరూపం కాదు. అందులోనూ అనేక వర్గాలున్నాయి. వృద్ధ నాయకులకు పాకిస్థాన్‌తో సాన్నిహిత్యం ఉన్నది. అందువల్ల తాలిబన్‌తో చర్చలు జరుపడమే కాకుండా అడుగడుగునా చతురతతో వ్యవహరించాలి.  


logo