మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - May 26, 2020 , 22:59:58

యువతకు సాగు సత్వం

యువతకు సాగు సత్వం

కండ్లసాక్షిగా పొక్కిలయిన తెలంగాణ నేలపైకి కాళేశ్వరం జలాలు జాలువారాయి. పాలమూరు జిల్లా పసిడిపంటల జిల్లాగా పచ్చబడుతుంది. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయపంటల నుంచి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నిర్మాణాల వైపు దృష్టిమళ్లిస్తుంది. రేపటికి తెలంగాణ గ్రామం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.

దేశానికి ధాన్యాగారమైన తెలంగాణ రేపటి వ్యవసాయాధారిత పరిశ్రమలకు కేంద్రంగా నిలువాలన్నదే కేసీఆర్‌ తలంపు. వర్షాకాలంలో కోటీ 35 లక్షల ఎకరాలలో ఏయే పంటలు వేయాలన్నదానిపై తెలంగాణ ప్రభుత్వం వేయబోయే అడుగులు పెద్దఎత్తున వ్యవసాయాధారిత పరిశ్రమలను వృద్ధికి దారితీస్తాయి.

దేశానికే ఆహారభద్రత కల్పిస్తున్నాం. అది కొండంత ధైర్యం. రైతును ప్రాణంగా చూసుకోవటం, ఏయే పంటలు వేయాలి? అందుకు ఏయే భూములు అనుకూలం అన్నదాన్ని నిర్ధారించుకోవాలి. పంటల విషయంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతి నుంచి మరింతగా వ్యవసాయ పంటల అధిక దిగుబడులపై దృష్టిపెట్టాలి. పండించిన పంటలను మన అవసరాలకు ఉపయోగించుకొని ఎగుమతిచేసే దశకు తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారటం రాష్ర్టావతరణ తర్వాత జరిగిన పరిణామం. తెలంగాణ ధాన్యాగారంగా మారటమంటే త్వరలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు విరివిగా వచ్చి భారీగా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. దానివల్ల గ్రామీణ నిరుద్యోగాన్ని చాలావరకు లేకుండా చేసే పరిస్థితి నెలకొంటుంది.

యువతలో కొత్త ఉత్సాహాన్ని కలిగించే శక్తి గ్రామీణ వ్యవసాయరంగానికి ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల రంగం అభివృద్ధి చెందితే అది రాష్ర్టానికి అదనపు సంపదను తెస్తుంది. అదంతా కొత్తతరం యువశక్తి మీదుగానే జరిపించాలన్న తలంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. అందుకే కేసీఆర్‌ పదేపదే చెప్పేమాట ఏమిటంటే వ్యవసాయం వర్ధిల్లాలి. రైతులు ధనవంతులు కావాలి. రైతులు ధనవంతులైతే గ్రామీణ తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది. అందుకోసం రైతాంగం లాభదాయక పంటల వైపు మళ్లాలి. ప్రధానంగా తమ నేలలకు ఏ పంటలు అనుకూలమన్నది చూసుకోవాలి. ఆ పనిని కూడా ప్రభుత్వం తన మీదనే వేసుకుంది. అందుకోసం మొత్తం వ్యవసాయరంగ నిపుణులు, ఆచార్యులు, అధికారులు, అనుభవం ఉన్న రైతులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడి రాబోయే వర్షాకాలపు వ్యవసాయ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వమే రూపొందిస్తుంది. ఇది చాలా పెద్ద మార్పు.

తన కండ్లసాక్షిగా పొక్కిలయిన తెలంగాణ నేలపైకి కాళేశ్వరం జలాలు జాలువారాయి. పాలమూరు జిల్లా పసిడిపంటల జిల్లాగా పచ్చబడుతుంది. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ పంటల నుంచి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నిర్మాణాల వైపు దృష్టి మళ్లిస్తుంది. రేపటికి తెలంగాణ గ్రామం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. రైతు కూలీల సంక్షేమం కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం తెలంగాణ గ్రామీణ సంక్షేమంగా మారింది. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం గల కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలే నేడు అద్భుత ఫలితాలిస్తున్నాయి. రాష్ర్టావతరణ అనంతరం వ్యవసాయరంగం సాధించిన అభివృద్ధిపై పరిశోధనలు చేయవలసి ఉన్నది. మనది వ్యవసాయ దేశం. ప్రధాన దృష్టి వ్యవసాయరంగంపై ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ స్పష్టమైన ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. గుట్టల మీద పర్వత ప్రదేశాల మీద పంటలు పండించిన చరిత్ర చైనాది. ఇప్పుడు తెలంగాణ కరువు నేలపై పసిడి పంటలు పండిస్తుంది. కొన్నేండ్ల తర్వాత ఇజ్రాయెల్‌ వ్యవసాయ పరిశోధనాసంస్థలు మన దగ్గరకు వచ్చి ఈ అభివృద్ధిని చూసి పోయే దశ వస్తుంది. తెలంగాణ యువతను వ్యవసాయాధార పరిశ్రమల రంగంలోకి ఆకర్షించడం తదుపరి దశ అవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పునర్నిర్మాణ పనిని అభివృద్ధికి మెట్లుగానే చూడాలి. ఒక్కొక్క రంగం స్వశక్తితో వేస్తున్న అడుగుల నుంచే సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలన్నీ తొలిగిపోతాయి. రాష్ట్రంలో 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాల జీవితాల్లో స్థిరమైన గుణాత్మక మార్పులకు ఈ చర్యలు దోహదపడుతాయి. తెలంగాణ వ్యవసాయరంగం ఆత్మహత్యల స్థితి నుంచి ఆత్మైస్థెర్యంతో సాగుచేసే దశకు ఎదుగుతుంది. ఇది దక్కన్‌ నేల మీద చూస్తున్న నూతన అభివృద్ధి కోణం. ఇప్పటికీ మన దేశం నూనెలు, పప్పు దినుసులు భారీగా దిగుమతి చేసుకుంటున్నది. విదేశీ దిగుమతులకు అలవాటుపడిపోయాం. దేశంలో పత్తి, వరి, గోధుమ, హైబ్రీడ్‌ పొద్దుతిరుగుడుకు ప్రాధాన్యమున్నది. మన నీళ్లను ఎక్కువగా వీటికే ఉపయోగిస్తున్నాం. రైతాంగం ఇతర అపరాల పంటల వైపు పోవటం లేదు.

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో గ్రామీణ తెలంగాణ బీడు భూములపైకి నీళ్లు తెచ్చి హరిత తెలంగాణ స్వప్నం సాకారం చేసుకుంటున్న తరుణంలో రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, జేఎన్టీయూలు, పేరుపొందిన అగ్రశ్రేణి ఇంజినీరింగ్‌ కాలేజీలు, ఇక్కడున్న డీవ్‌ యూనివర్సిటీలు, సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, ఆచార్యులు, ప్రొఫెసర్లు, విస్తృతంగా పరిశోధనలు చేయవలసి ఉన్నది. ప్రతి నియోజకవర్గానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. హైదరాబాద్‌ ఐటీ రంగానికి కేంద్రంగా మారింది. యువత వ్యవసాయరంగం వైపు, వ్యవసాయ పరిశ్రమల వైపు చూసేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి మొదలుపెట్టింది. దేశానికి ధాన్యాగారమైన తెలంగాణ రేపటి వ్యవసాయాధారిత పరిశ్రమలకు కేంద్రంగా నిలువాలన్నదే కేసీఆర్‌ తలంపు. వర్షాకాలంలో కోటీ 35 లక్షల ఎకరాలలో ఏయే పంటలు వేయాలన్నదానిపై తెలంగాణ ప్రభుత్వం వేయబోయే అడుగులు పెద్దఎత్తున వ్యవసాయాధారిత పరిశ్రమలను వృద్ధికి దారితీస్తాయి. ఇందుకు తెలంగాణ యువతను నైపుణ్యం గల సైన్యంగా మలచాల్సి ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్ర అనంతరం జరుగుతున్న పునర్నిర్మాణం. ఇదే తెలంగాణ అభివృద్ధి దశదిశను నిర్ణయిస్తుంది.


logo