గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - May 26, 2020 , 22:59:57

జలపుష్పాలతో లబ్ధి

జలపుష్పాలతో లబ్ధి

రిజర్వాయర్లు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన పలు బ్యాక్‌వాటర్‌లలోనూ 64 కోట్లకు పైగా చేపపిల్లలు, సుమారు మూడున్నరకోట్ల రొయ్యపిల్లలను విత్తనాలుగా వేశారు. రాష్ట్రంలోని చాలాచోట్ల వృత్తి మత్స్యకారుల ఆదాయాలు కూడా పెరుగడంతో నూతనోత్సాహం కనిపిస్తున్నది.

ఇపుడు వేసవికాల సీజన్‌లో తెలంగాణలో ఎక్కడ పర్యటించినా రోడ్డుకు ఇరువైపులా విస్తరించి ఉన్న చెరువులు నిండుకుండల్లా జలకళలాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుల ఫలితంగా మన కనులముందు సాక్షాత్కారమైన దృశ్యం!

నాలుగేండ్లుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన చెరువుల్లో స్థానిక మత్స్యసహకార సంఘాల ద్వారా ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను సరఫరాచేసింది. కొన్ని సందర్భాల్లో సరైన మోతాదులో వానలు కురవకపోవడంవల్ల సకాలంలో చేపపిల్లలను చెరువుల్లో వదలడం కుదరలేదు. మరికొన్ని సందర్భాల్లో ఏడాదిలో కనీసం ఆరు నెలలపాటు చెరువుల్లో నీరు నిలువ ఉండకపోవడంవల్ల వేసిన చేప పిల్లలు పెరుగలేదు. ఫలితంగా కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం ఆశించినరీతిలో చేపల ఉత్పత్తిలో ప్రగతిని సాధించలేకపోయింది. కానీ గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నింటిలోనూ నీటిని నింపడంతో చేపల ఉత్పత్తిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. రిజర్వాయర్లు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన పలు బ్యాక్‌వాటర్‌లలోనూ 64 కోట్లకుపైగా చేపపిల్లలు, సుమారు మూడున్నరకోట్ల రొయ్యపిల్లలను విత్తనాలుగా వేశారు. రాష్ట్రంలోని చాలాచోట్ల వృత్తి మత్స్యకారుల ఆదాయాలు కూడా పెరుగడంతో నూతనోత్సాహం కనిపిస్తున్నది.

తెలంగాణ మత్స్యరంగంలో నూతన విధానాల ఫలితంగా చేపల మార్కెటింగ్‌ రంగంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో స్థానిక మత్స్యసహకార సొసైటీ నుంచి కాంట్రాక్టర్లు, వారి నుంచి  హోల్‌సేల్‌ వ్యాపారులు, వారినుంచి స్థానిక పంపిణీదారులు, అక్కడినుంచి రిటెయిల్‌ అమ్మకందారుల ద్వారా అనేక దొంతరలుగా చేపలు వినియోగదారునికి చేరేవి. అనవసరమైన ఈ గొలుసుకట్టు విధానం కారణంగా మూడు, నాలుగు రోజుల తర్వాత మాత్రమే చేపలు వినియోగదారునికి అందేవి. కానీ తాజా పరిణామాలతో స్థానిక మత్స్యకారుల నుంచి  స్థానిక రిటెయిల్‌ వ్యాపారులకు నేరుగా చేరుతుండటంతో తాజా చేపలు ఏ రోజుకారోజు వినియోగదారులకు అందుతున్నాయి. ఇప్పుడు స్థానికులు కిలో వంద నుంచి రూ.150ల వరకు అమ్ముకోగలుగుతున్నారు. మత్స్యకారులు, వినియోగదారులు, చిరు వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతున్నారు.

(వ్యాసకర్త: రాష్ట్ర ఫిషరీస్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు)


logo