శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - May 25, 2020 , 22:50:49

ప్రచ్ఛన్న యుద్ధం సాధ్యమా?

ప్రచ్ఛన్న యుద్ధం సాధ్యమా?

కష్టకాలంలో శత్రువులు కూడా దగ్గరవుతారు. కానీ కరోనా వైరస్‌ సృష్టించిన సంక్షోభంలో అమెరికా, చైనా వైరం అంతకంతకూ పెరిగిపోతున్నది. తమ దేశాన్ని అమెరికా మరో ‘కొత్త ప్రచ్ఛన్న యుద్ధం’ వైపుగా నెట్టుతున్నదని చైనా ఆరోపించింది. కొవిడ్‌ -19 అనంతర ప్రపంచంలో తన పాత్ర పెంచుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నది. మరోవైపు చైనా చుట్టూ ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తున్నది. కరోనా వైరస్‌ చైనా నుంచే వ్యాపించిన నేపథ్యంలో ఆ దేశంతో మొత్తం సంబంధాలను తెగతెంపులు చేసుకుంటామని అమెరికా హెచ్చరించింది. చైనా పాత్రికేయులపై ఆంక్షలు విధించింది. తమ కంపెనీలు చైనా టెలికం పరికరాలను వాడకుండా నిషేధాన్ని పొడిగించింది. అధ్యక్ష ఎన్నికల తరువాత కూడా అమెరికా ఇదే స్థాయిలో చైనా వ్యతిరేకతను ప్రదర్శిస్తుందా అనేది తెలియదు. చైనా పాలకవర్గం కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి మూలంగా ఏర్పడిన మచ్చను తుడిచేసుకునే ప్రయత్నంలో ఉన్నది. ప్రజల అసంతృప్తిని అధిగమించడానికి అమెరికాకు వ్యతిరేకంగా జాత్యభిమానాన్ని తీవ్ర స్థాయిలో రెచ్చగొడుతున్నది. 

తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణ చైనా సముద్రం తదితర ప్రాంతాలలో అమెరికా, చైనా ఘర్షణ పడుతున్నాయి. హాంకాంగ్‌ విషయంలో అమెరికా వైఖరి చైనా ఆగ్రహానికి తక్షణ కారణం. అయినప్పటికీ ఈ ఘర్షణలు ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తాయా అనేది అనుమానమే. ప్రచ్ఛన్నయుద్ధానికి ఎన్నో కోణాలున్నాయి. సోవియెట్‌ యూనియన్‌, అమెరికా ప్రాబల్య ఘర్షణ ప్రధానమైనది అయినప్పటికీ, సైద్ధాంతిక విభజన కూడా ప్రాధాన్యం పొందింది. భౌగోళిక రాజకీయాలు, జాతి విముక్తి ఉద్యమాల నేపథ్యంలో అగ్రరాజ్యాలు ప్రత్యక్షంగా తలపడకుండా, పలు చోట్ల తమ అనుకూల దేశాలను, వర్గాలను పావులుగా చేసుకొని పరోక్షంగా ఘర్షణ పడ్డాయి. ఇరుపక్షాలు నాటో, వార్సా పేర సైనిక కూటములను ఏర్పాటు చేసుకున్నాయి. క్షిపణులను భారీగా మోహరించుకున్నాయి.  ఏ పక్షమూ మరో పక్షాన్ని దెబ్బతీయలేని స్తబ్ధత ఏర్పడింది. ఆనాటి పరిస్థితిని ప్రాబల్య సమతుల్యం అనే కన్నా రాజనీతివేత్తలు ‘భయ సమతుల్యం’గా అభివర్ణించారు. 

ఆనాడు ద్విధ్రువ వ్యవస్థలో అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ జోరుమీదున్నాయి. ఇప్పుడు అమెరికా క్షీణిస్తున్న అగ్రరాజ్యం. చైనా ఎదుగుతున్న దేశమే అయినప్పటికీ, అమెరికా కన్నా చాలా దిగువన ఉన్నది. అమెరికాను ఇబ్బంది పెట్టగలదేమో కానీ, ఇప్పట్లో అయితే సరితూగలేదు. రష్యా, జర్మనీ తదితర దేశాలు బలంగా ఉండటంతో బహుళ ధ్రువ ప్రపంచం వైపుగా గమనం సాగుతున్నది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భారత్‌, వర్ధమాన దేశాలను కూడగట్టి అలీన విధానాన్ని అనుసరించగలిగింది. ఇప్పుడిక కొత్త అంతర్జాతీయ వ్యవస్థకు అనుగుణంగా తన పాత్రను నిర్వచించుకోవలసి ఉంటుంది. అమెరికా, చైనా వైరం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రెండు దేశాల వాణిజ్య ఘర్షణ ఇతర దేశాలపై ప్రభావం చూపుతుంది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో రెండు దేశాల ఎత్తుగడలు మన దేశానికి తలనొప్పిని తెచ్చిపెట్టవచ్చు. అయినప్పటికీ ఈ రెండు దేశాల వైరాన్ని భారత దేశం సమస్యగా కాకుండా, అవకాశంగా భావించి తన ప్రయోజనాలను కాపాడుకుంటూ, అంతర్జాతీయ శాంతిని పరిరక్షించడానికి ప్రయత్నించాలి. 


logo