బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - May 25, 2020 , 22:50:48

కేంద్రం బాధ్యతారాహిత్యం

కేంద్రం బాధ్యతారాహిత్యం

లాక్‌డౌన్‌ విషయంలో, వలస కార్మికుల అంశంలో కేంద్ర ప్రభుత్వ విధానం మొదటినుంచికేంద్రం బాధ్యతారాహిత్యం విమర్శలకు గురవుతున్నది. లాక్‌డౌన్‌ పరిస్థితులను, అనంతర పరిణామాలను, ఫలితాలను కేంద్రం ఏమాత్రం అంచనా వెయ్యలేకపోయిందని సామాన్యులు కూడా అభిప్రాయపడుతున్నారు.

వలస కార్మికులు ఎక్కడివాళ్లక్కడే నిలిచిపోవాలి అని మోదీ ఇచ్చిన పిలుపు పెద్దనోట్ల రద్దును గుర్తుకు తెచ్చింది. ముందుచూపు ప్రదర్శించి వారిని స్వస్థలాలకు చేర్చిన తరువాత లాక్‌డౌన్‌ను ప్రకటిస్తే బాగుండేది. 

అరవైరోజులపాటు దేశాన్ని స్తంభింపజేసిన లాక్‌డౌన్‌ నుంచి జనం మెల్లగా కోలుకుంటున్నారు. ఇపుడిపుడే పూర్వస్థితివైపుగా మళ్లుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఏమైనా సత్ఫలితాలు వచ్చాయా అని పరిశీలన చేసుకోవడం అవసరం. దేశంలో సుమారు నాలుగువందల పాజిటివ్‌ కేసులు ఉన్నప్పుడు లాక్‌డౌన్‌ విధించారు. ఆ తరువాత మూడుసార్లు కొద్దికొద్ది రోజుల చొప్పున పొడిగించుకుంటూ పోయారు. రవాణా వ్యవస్థలను బందుపెట్టారు. పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసు శాఖ తప్ప మిగిలిన అన్ని శాఖలు మూతపడ్డాయి. ఇంత కఠినంగా అమలుచేసినప్పటికీ, అరవై రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షను దాటిపోయింది. మృతుల సంఖ్య వేలల్లోకి చేరింది. మరి లాక్‌డౌన్‌ ఫలితం ఇచ్చినట్లా ఇవ్వనట్లా?.. 

ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈమాత్రం కూడా లాక్‌డౌన్‌ను అమలు చెయ్యనట్లయితే ఇండియా కూడా అమెరికా, ఇటలీలను మించిపోయేదని, మనం లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుచెయ్యడం కారణంగానే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నదని ఒక వాదన వినిపిస్తున్నది. మరొక వాదన ఏమిటంటే.. లాక్‌డౌన్‌ నుంచి భారీస్థాయిలో సడలింపులు ఇచ్చిన తరువాత, మద్యం దుకాణాలు, మిగిలిన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత కూడా కేసుల సంఖ్య ముందు ఎలా ఉన్నదో ఆ తరువాత కూడా అలాగే ఉన్నది. కాబట్టి భౌతికదూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, స్వీయనియంత్రణను పాటిస్తూ మొదటిదశలోనే లాక్‌డౌన్‌ను సడలించినట్లయితే దేశానికి ఇంత పెద్ద ఎత్తున ఆర్థికనష్టం సంభవించేది కాదని మరికొందరి అభిప్రాయం. 

ఇక లాక్‌డౌన్‌ విషయంలో, వలస కార్మికుల అంశంలో కేంద్ర ప్రభుత్వ విధానం మొదటినుంచి విమర్శలకు గురవుతున్నది. లాక్‌డౌన్‌ పరిస్థితులను, అనంతర పరిణామాలను, ఫలితాలను కేంద్రం ఏమాత్రం అంచనా వెయ్యలేకపోయిందని అనేకమంది సామాన్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. మర్కజ్‌ యాత్రికుల వల్లనే వైరస్‌ వ్యాప్తి చెందిందని తొలినాళ్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. నెల తరువాత కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో కేవలం వాళ్లే కారణం కాదని అర్థమై కేంద్రం సైలెంట్‌ అయింది. 

వలస కార్మికులు  ఎక్కడి వాళ్లక్కడే నిలిచిపోవాలి అని మోదీ ఇచ్చిన పిలుపు పెద్దనోట్ల రద్దును గుర్తుకు తెచ్చింది. ముందుచూపు ప్రదర్శించి వారిని స్వస్థలాలకు చేర్చిన తరువాత లాక్‌డౌన్‌ను ప్రకటిస్తే బాగుండేది. కేసులు, మరణాలు కార్మికులను భయకంపితులను చేశాయి. ఇక్కడే చనిపోతే తమ శవాలు అనాథ ప్రేతలుగా మిగిలిపోతాయేమో,  కడసారి చూసేవారూ  ఉండరేమో అని వణికిపోయారు. ఆ చావేదో స్వగ్రామంలో, స్వజనుల మధ్య చావాలి అని నిర్ణయించుకున్నారు. జన్మభూమి పట్ల మనిషికున్న పేగుబంధం అది. 

నలభై యాభై కిలోల బరువును తలపై పెట్టుకుని, ఇద్దరు ముగ్గురు పసిపిల్లలను మోస్తూ, దారిలో కనీసం మంచినీళ్లు కూడా దొరకవని తెలిసీ నడకను సాగించారంటే వారి సెంటిమెంటును మన ప్రభుత్వాలు సరిగా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. రోళ్ళు పగిలిపోయే ఎండల్లో వేల కిలోమీటర్ల దూరం నడిచిపోయేవారిలో కొందరు దారిలోనే విగతజీవులు అయిన హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదాలబారిన పడి కొందరు దుర్మరణం పాలయ్యారు. పోలీసులను తప్పించుకోవడానికి రైల్వేట్రాక్‌ మీదుగా నడుచుకుంటూ గూడ్స్‌ రైలు దూసుకు వెళ్లడంతో దుర్మరణం పాలయిన దుస్సంఘటనలు జరిగాయి. 

కార్మికులు చెల్లాచెదురై నడకబాటలో ఉన్న సమయంలో కేంద్రం రైళ్లను ఏర్పాటుచేసింది. ఇదేదో మొదటే చేసి ఉంటే వేలమంది కార్మికులకు నడకబాధ, చావుగండం తప్పేవి కదా! ఇప్పుడు ఇంకా ఎంతమందికి సోకుతుందో తెలియదు. చార్జీలను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్రం షరతు విధించడం క్రూరపరిహాసం. 

ఒక విపత్కర సమయంలో కేంద్రం సరైన రీతిలో స్పందించకపోవడం శోచనీయం. రాష్ట్రప్రభుత్వాలే కార్మికుల పట్ల జాలీ దయా చూపించాయి. వారికి భోజన వసతులను కల్పించాయి. వలస కార్మికులు మా అభివృద్ధిలో భాగస్వాములు అని ప్రకటించి తన సహృదయాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. లాక్‌డౌన్‌ ప్రభావం ఇక మీదట ఏమీ ఉండదు. లాక్‌డౌన్‌ లేనప్పటి పరిస్థితి, ఉన్నప్పటి పరిస్థితిలో పెద్ద తేడా ఏమీ లేదు. మిగిలిన అనేక వైరస్‌ల మాదిరిగా కరోనా కూడా మానవ జీవితంలో ఒక భాగం కానుంది. వ్యాక్సిన్‌ వచ్చేదాకా జాగ్రత్తలు పాటిస్తూ జీవితాన్ని పునఃప్రారంభించడమే మార్గం. 

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు)


logo