మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - May 25, 2020 , 22:50:47

తెలంగాణ ఆపన్నహస్తం

తెలంగాణ ఆపన్నహస్తం

నాలుగు విడతల లాక్‌డౌన్‌లో వలస కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రకరకాల సవాళ్లు ఎదురయినయి. సహాయ కార్యక్రమాల్లో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు అయో మయానికి గురిచేశాయి.. రైల్వే చార్జీలకు సంబంధించి సుప్రీంకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానం చెప్పడానికి నిరాకరించారు.

కొవిడ్‌ను ఎదుర్కోవడంలో, లాక్‌డౌన్‌ అమలులో తన నాయకత్వ లక్షణాలను, మానవీయ కోణాన్ని చూపించి రాజకీయాలకు తావివ్వకుండా పాలనపై దృష్టి సారించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌. ఆర్థిక ఇబ్బందులున్నా మానవీయ కోణాన్ని మరువలేదు. 

ధన్యవాదాలు కేసీఆర్‌ సార్‌

..తమ సొంత ఊర్లకు ప్రత్యేక శ్రామిక రైళ్ళలో బయలుదేరేముందు వలస కార్మికుల నుంచి వచ్చిన చివరి మాట ఇదే. ఒకవైపు కంటతడి మరోవైపు ముఖంపై చిరునవ్వు, చివరాఖరికి తమ సొంత రాష్ర్టాలకు వెళ్ళి కుటుంబాలను కలిసే ఆనందం స్టేషన్‌ వద్ద ఒక చూడతగ్గ సన్నివేశం. అక్కడున్న మీడియాతో మాట్లాడిన వలస కార్మికులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ లాక్‌డౌన్‌ నిబంధలను ఎత్తివేయంగనే, పరిస్థితులు కుదుటపడగానే తిరిగి తెలంగాణ రాష్ర్టానికి వచ్చేస్తాం అని చెప్పారు. 

లాక్‌డౌన్‌ అమలుకు ముందునుంచే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వలస కార్మికులకు విశ్వాసం కలిగిస్తూ, వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా వర్ణించారు. 500 రూపాయలు, 12 కిలోల బియ్యం ఇవ్వాలనే నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమయింది. పార్టీలకు అతీతంగా వలస కార్మికులకు కేసీఆర్‌ ఇచ్చిన గౌరవాన్ని కొనియాడారు.

నాలుగు విడతల లాక్‌డౌన్‌లో వలస కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రకరకాల సవాళ్లు ఎదురయినయి. సహాయ కార్యక్రమాల్లో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు అయోమయానికి గురిచేశాయి. వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే వలసకార్మికులవద్ద టికెట్‌ రుసుం జమచేసి రైల్వే విభాగానికి అప్పజెప్పాలని కేంద్రం ఆదేశించింది. విమర్శల అనంతరం కేంద్ర ప్రభుత్వం 85 శాతం సబ్సిడీ రూపంలో మిగితా 15 శాతం ప్రయాణికులను కట్టుకోవాలని సూచించింది. మరుసటి దినమే మాట మార్చింది. సుప్రీంకోర్టులో విచారణలో భాగంగా టికెట్‌ ధరపై న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా ప్రత్యేక శ్రామిక రైళ్ళను రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకే నడుపుతామని, ఏర్పాట్లు చేసేది రాష్ట్ర ప్రభుత్వమే అని ఉంది. 

తెలంగాణ ప్రభుత్వం  ఎలాంటి సంకోచంగానీ రెండో ఆలోచనగానీ లేకుండా వలస కార్మికుల నుంచి ఎలాంటి డబ్బును వసూలు చేసేదిలేదని, ప్రభుత్వమే భారాన్ని భరిస్తుందని స్పష్టం చేసింది. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో, లాక్‌డౌన్‌ అమలులో తన నాయకత్వ లక్షణాలను, మానవీయ కోణాన్ని చూపించి రాజకీయాలకు తావివ్వకుండా పాలనపై దృష్టి సారించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌. ఆర్థిక ఇబ్బందులున్నా మానవీయ కోణాన్ని మరువలేదు. అందుకే వలస కార్మికుల ఖర్చు భారాన్ని తెలంగాణ తనమీద వేసుకొని 6 కోట్లు చెల్లించింది. వలస కార్మికులు దీనిని గుర్తించారు. అందుకు ఓ దృష్టాంతం.. దేశమంతా వలస కార్మికులు స్వస్థలాలకు తిరిగి వెళుతుంటే బీహార్‌ నుంచి 225 మంది వలస కార్మికులు ఇక్కడి రైస్‌మిల్లుల్లో పనిచేయడానికి రావడం. ఇది తెలంగాణ రాష్ట్రం మీద, ఇక్కడి ప్రభుత్వం పట్ల, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద ఉన్న విశ్వాసం.

(వ్యాసకర్త: రీసెర్చ్‌ స్కాలర్‌, ఓయూ)


logo