ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 24, 2020 , 23:39:59

స్త్రీశక్తికి ప్రతీక ద్రౌపది

స్త్రీశక్తికి ప్రతీక ద్రౌపది

మహాకవి భారవి కిరాతార్జునీయ ప్రథమ స్సర్గలో వనేచరుని సంభాషణ తర్వాత ద్రౌపది ప్రవచనాన్ని గొప్పగా చిత్రించి ఆరో శతాబ్దం పూర్వార్థంలోనే ఒక స్త్రీ శక్తిని ధైర్యాన్ని గొప్పనైన రీతిలో చూపినవాడిగా ఆయన రాజనీతిజ్ఞత ప్రశంసాపాత్రమనటంలో సందేహం లేదు.

మొదటి సర్గ మొత్తం 46 శ్లోకాల్లో వనేచరుని భాషణ 25 శ్లోకాల్లో వివరించి మిగిలిన శ్లోకాల్లో కేవలం ద్రౌపదీదేవి పౌరుషమూర్తినే చిత్రించి స్త్రీ శక్తి ఎంత గొప్పదో నిరూపించినాడు. తిక్కనగారు చిత్రించిన ద్రౌపది పాత్రయందు భారవి ప్రభావమే అధికమని పరిశోధకుల భావన. 

గంభీర స్వభావుడు, మితభాషి, యాచన, దైన్యం, పలాయనం అనేవి రుచించని, నచ్చని భారవి మహాకవి ద్రౌపదీదేవిని కూడా అట్లే చిత్రించినాడు. అందుకే ఆమె ధైర్యంగా నిలిచి మాట్లాడుతుంది. ఇంకా అర్జునుని పాత్ర పూర్తిగా ‘భారవి’ని మూర్తీభవించుకున్న రాజనీతి విశారదత్వాన్ని వ్యక్తపరుస్తుంది. 

సహజంగా సత్యమూర్తి, ధర్మస్వరూపుడైన ధర్మరాజు- వనేచర సంభాషణ, దుర్యోధనుని రాజ్యపాలన గూర్చి ద్రౌపదికి సోదరులకు తెలిపిన తర్వాత గంభీర స్వభావయైన ద్రౌపదీదేవి స్త్రీ సహజ మార్దవాన్ని వదిలి ధర్మజుని కోపమూర్తిగా చేయటానికి సన్నద్ధమై ఇట్లా పలుకుతుంది. దీనికి ప్రబల కారణం ధర్మరాజు శత్రువుల అభివృద్ధిని వివరించటం, తాను కౌరవసభలో కేశాపకర్షణాది అవమానాలకు గురికావటం స్మృతికి రాగా లోలోపల అణచుకొని ధర్మరాజును కోపమూర్తిగా- శత్రుసంహార ప్రయత్న దీక్షాదక్షునిగా చేయటానికి తదుద్దీపకవచనాలను పలుకుతున్నది.. 

‘ఓ ధర్మరాజా! మీవంటి పండితులను సంతృప్తిపరుచటానికి స్త్రీ జనం తగినవారు కారు. పైగా వ్యవహార విషయాల్లో స్త్రీలు జోక్యం చేసుకోవటం తగదు. ఐనా ఈ ఆచారాన్ని ఉల్లంఘించి- నా మనోవ్యథ నన్నూరకుండనీయనందువలన నాల్గు మాటలు చెప్పదలిచినాను. దుఃఖానుభూతులైన మావంటివారు చెప్పే మాటల్లో యుక్తాయుక్త వివేకం శూన్యమంటారు. వీటిని శాంతంగా, సావధానంగా నీవు వినటం అవసరం అని నా ప్రార్థన. ఎందుకంటే పురందర సమాన రాజ్యవైభవం మీ వంశజులకున్నది. ఆ వైభవం నీ చేతిలో పడి మదగజం పూలదండను విసర్జించినట్లు నీవా రాజ్యాన్ని వదులుకున్నావు. నీ శత్రువులు మాయావులై వర్ధిల్లుతుంటే నీవు ప్రతిమాయలు చేయక రుజుమార్గంలో వర్తించి శత్రువులకొక అవివేకివైనావు. ఇదంతా కవచం లేకుండా యుద్ధానికి వెళ్లినవానికి వాడియైన బాణాలు తగిలినట్లు ఆ మాయావులు నిన్ను భావించినారు ఈ అనర్థమే ప్రస్తుతం మనకు సంక్రమించింది. దానికి కారణం నీవు కాదా! 

ఏ రాజన్యుడైనా రాజ్యలక్ష్మిని కళత్రం కన్నా అధికంగా భావిస్తాడు నీవేమో! భార్యావమానాన్ని రాజ్యలక్ష్మీ అపహారాన్ని అవమానంగా భావించటం లేదా! ఈ స్థితిలో నీవు క్షత్రియత్వాభిమానాన్ని వదిలి పౌరుషహీనుడవై దైన్యాన్ని అవలంబిస్తున్నావు. నీతోపాటు మా అందరిని కష్టపెడుతున్నావు. శత్రువుల అభివృద్ధిని విని మా కష్టాలను చూచి ఇకనైనా నీ యందు కోపం జ్వలించి శుష్కమైన శమీవృక్షాన్ని అగ్ని దహించేవిధంగా నీ పౌరుషాగ్ని జ్వలించి కౌరవాన్వయ శమీవృక్షాన్ని దహింపచేయదా! నీ రాజ్యపాలనలో వీరగంధాన్ని పూసుకొని మహారథాన్నెక్కి సంచారం చేసిన వృకోదరుడు- నేడు పర్వతాల మధ్యన ధూళిధూసరిత శరీరుడై సంచరిస్తున్న నీ తమ్ముని చూస్తే పరితాపం కలగటం లేదా! ఇంకా సత్యపాలనయేనా, దేవేంద్ర సమాన పరాక్రముడైన అర్జునుడు ఎన్నో దేశాలను జయించి ఎంత సంపదనో సమకూర్చి నిన్నధిక భక్తితో ఆరాధించిన అనుజుడు గదా! ఆయన నేడు అడవుల్లో నారబట్టలు ధరించి తిరుగు దుర్దశను చూచైనా నీ మనస్సులో పౌరుషం చెలరేగటం లేదా! ఇక మనకు కవలలైన నకుల సహదేవులు హంసతూలికా తల్పాలపై సుఖశయ్యను అనుభవించిరి గదా! వారు నేడు కఠిన భూస్థలిపై శయనిస్తున్నారు. దీన్ని చూస్తున్న నీ కఠిన హృదయం సత్యవాక్య పరిపాలన ధైర్యం- ఎటువంటిది. 

ఈ స్థితిలో నీవు క్షత్రియత్వాభిమానాన్ని వదిలి పౌరుషహీనుడవై దైన్యాన్ని అవలంబిస్తున్నావు. నీతోపాటు మా అందరిని కష్టపెడుతున్నావు. శత్రువుల అభివృద్ధిని విని మా కష్టాలను చూచి ఇకనైనా నీ యందు కోపం జ్వలించి శుష్కమైన శమీవృక్షాన్ని అగ్ని దహించేవిధంగా నీ పౌరుషాగ్ని జ్వలించి కౌరవాన్వయ శమీవృక్షాన్ని దహింపచేయదా! 

ఈ స్థితిలోను నీ మనస్సు మార్పు చెందటం లేదు. అందుకే ‘చిత్తవృత్తులు విచిత్ర రూపాలు’ అన్నారు. తమరు కూడా స్తుతిగీత మంగళవాద్యాలతో మేలుకునే సౌఖశాయనికుడవైనా ఈనాడు- కోసిన దర్భల మొదళ్లపైన పడుకొని తెల్లవారుజామున అమంగళకరమైన నక్కకూతలచేత మేల్కొనుచున్నారు గదా! అంతేగాక పూర్వం వేలకొలది జనానికి అనవరతం భోజనం పెట్టి భుక్తశేషాన్ని భుజించి సంతోషించిన నీవు నేడు వన ఫలమూలాదులు తిని సంతృప్తి చెందటం ఎంతవరకు తగును? కాబట్టి నీ శరీరాభిమానం చేతగానీ, యశస్సంబంధలోపం చేతగానీ- మళ్లీ పూర్వస్థితిని సంపాదించే యత్నం చేయలేకుంటే ‘సంభావితస్యచా కీర్తిః మరణాదతిరిచ్యతే’ గదా! అందువల్లనే శత్రుసంహారాన్ని చేయవలసిందని చెప్పుచున్నాను. ఓ ధర్మజా! ఒకప్పుడు నీ పాదాలు మణిపీఠాలపైన ప్రకాశించగా నేడు- మృగద్విజాతానములై- నెమళ్లు తినగా మిగిలిన దర్భగడ్డి మొదళ్లపై యుంటున్నవి. 

లోకంలో మానవులు సుఖదుఃఖాలననుభవిస్తారు కానీ- ఈ బాధ కేవలం శత్రుమూలకమైనది; మానవంతులకు మానహాని దుస్సహం కాని ఆపదలు దుస్సహాలు కావు గదా! ఓ రాజా! ఇదం తా గ్రహించి ఇకనైనా శత్రువధార్థం సిద్ధంకమ్మని కోరుతున్న నా మనస్సు ఎంత జ్వలిస్తున్నదో తెలుసుకో! పరాక్రమవంతులకాపదలు నికషోపలముల వంటివి. క్షత్రియోచితమైన తేజశ్శాలురైన మీరు ఉదాసీనులు కాకూడదు. అంతేకాదు- ఈ మార్గం నచ్చకుంటే వైరాగ్యం బూని జటాధారివై ధనుర్భాణాలను వదిలి అడవిలో తపస్సు చేస్తూ అగ్నిని పూజిస్తూ ఆకులలాలను తింటూ జీవిక కొనసాగించు’ అని ధైర్యంగా శాసించిన ద్రౌపది మాటలను వింటున్న భీముడు- ‘ఇవి బృహస్పతికైనా దుర్లభమైన మాటలు- మనందరికీ విస్మయం కలిగించినవి’, అని చివర్లో (భీముని చేత) ఈ మాటలనిపించిన మహాకవి భారవి ద్రౌపది స్త్రీ శక్తిని- భీముని దిషణావైభవాన్ని రాజనీతిమయంగా తెలుపటం విశేషం. అందుకే కిరాతార్జునీయకావ్యం అవశ్య పఠనీయం. 

-డాక్టర్‌ రంగాచార్య, 9299451266


logo