మంగళవారం 07 జూలై 2020
Editorial - May 24, 2020 , 23:39:59

ధర్మరాజ నీతి

ధర్మరాజ నీతి

మహాభారతంలో అటు సంస్కృతంలోను, ఇటు కవిత్రయం వారి తెలుగు మహాభారతంలో గాని రాజనీతి విషయాలు భీష్ముడు చెప్పినవి, ఇతర మునులు చెప్పినవి కనిపిస్తాయి. ధృతరాష్టునికి చెప్పిన కణిక నీతిని చూస్తే నేటికీ పాలకులు ప్రజాస్వామ్యవ్యవస్థలో చాలా మంది పార్టీరాజకీయాలకు, పాలనకు కణిక నీతిని పాటిస్తున్నట్లు అనిపిస్తుంది. కాని కేసీఆర్‌ శైలి గమనిస్తే ఆయనలో నారదుడు ధర్మరాజుకు చెప్పిన రాజనీతి విషయాలు పాటిస్తున్నారా అని అనిపిస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల అవలంబిస్తున్న పాలనాశైలి, సృజనాత్మకంగా రాజనీతి శాస్త్రజ్ఞులను సైతం అబ్బురపరుస్తున్నది. ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు చూస్తుంటే ఆయన అనుసరిస్తున్న పాలనావిధానాలకు స్ఫూర్తిగా ఏవి ఉంటున్నాయనే ప్రశ్నలు ఉదయిస్తాయి.

మహాభారతం చదివినవారికి నాటి రాజనీతి విషయాలు పరిపాలనలో అనుసరించవలసిన నీతి (అంటే ఇక్కడ పద్ధతులు పథకాలు అనే అర్థం) బాగా తెలుస్తాయి. వీటిని చూసినప్పుడు కేసీఆర్‌ తన పరిపాలనలో మహాభారతం నుంచి  కొంత స్ఫూర్తి పొందుతున్నాడనిపిస్తున్నది. విత్తనాల సరఫరా,  రైతులను ఆదుకోవడం కోసం అనుసరించే విధానాలను చూసినప్పుడు ఆయన మహాభారతం బాగా చదివాడనీ, అందులోని సూత్రాలు కొన్నింటిని పాటిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.

మహాభారతంలో అటు సంస్కృతంలోను, ఇటు కవిత్రయం వారి తెలుగు మహాభారతంలోనూ రాజనీతి విషయాలు భీష్ముడు చెప్పినవి, ఇతర మునులు చెప్పినవి కనిపిస్తాయి. ధృతరాష్ర్టునికి చెప్పిన కణిక నీతిని చూస్తే నేటికీ పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా మంది పార్టీ రాజకీయాలకు, పాలనకు కణిక నీతిని పాటిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ కేసీఆర్‌ శైలి గమనిస్తే ఆయనలో నారదుడు ధర్మరాజుకు చెప్పిన రాజనీతి విషయాలు పాటిస్తున్నారా అని అనిపిస్తుంది. సభాపర్వంలో పాండవులు ఇంద్రప్రస్థంలో పరిపాలన సాగించిన కొత్తలో రాజసూయాన్ని నిర్వహించారు. దానికి  నారదుడు వంటి రుషులు వచ్చి ధర్మరాజుకు సలహాలు ఇస్తారు. ఇందులో నారదుడు యుధిష్ఠిరునికి చెప్పిన పాలనాపరమైన రాజనీతి చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. రైతులకు చేయవలసిన సాయం  గురించి నారదుడు ఇలా చెప్పాడు..

కం. ధరణీనాథ భవద్భుజ/ 

పరిపాలితయైన వసుధ బరిపూర్ణములై

కరమొప్పుచున్నె చెఱువులు/ 

ధరణికవగ్రహ భయంబు దనుకక యుండన్‌. 


కం. హీనులకు కర్షకులకును/

భూనుతధాన్యంబు బీజములు వణిజులకున్‌

మానుగ శతైక వృద్ధి న/ 

నూనముగా ఋణములిత్తె యుత్తమ బుద్ధిన్‌. 

ఇక్కడ నారదుడు ధర్మరాజును అడుగుతున్నాడు. ఏమంటే.. పేదలైన బలహీనులైన కర్షకులకు ధాన్యాన్ని ఇస్తున్నావా (ఆహారం కోసం రేషన్‌), వారికి బీజములు అంటే విత్తనాలు ఇస్తున్నావా అని. వారికి చిన్న వ్యాపారులకు రుణాలు ఇస్తున్నావా, అంతేకాదు శతైక వృద్ధితో అంటే నూటికి ఒక రూపాయి వడ్డీకి ఇస్తున్నవా లేదా అని పైరెండో పద్యంలో అడిగాడు. మొదటి పద్యంలో రైతులకు కరువు అనేది లేకుండా చెరువుల్లో నిండా నీళ్లు ఉండి బాగా కనిపిస్తున్నాయా అని అడిగాడు. రైతులకు విత్తనాలు సమయానికి అందేలా చూడటం, వ్యాపారులకు తక్కువ వడ్డీకి నూటికి రూపాయకే రైతులకు ఇవ్వమని, దానితోనే అభివృద్ధి అని చెప్పాడు.

భారతంలో ఈ రాజనీతి చెప్పి కనీసం మూడు వేల సంవత్సరాలు. అంటే నాటికే రైతులకు చిన్న వ్యాపారులకు ప్రభుత్వం ఎలా సహాయం చేయాలో చెప్పారు. ఆ సంస్కృత మహాభారతాన్నే మన కవిత్రయం తెలుగులోకి  అనువదించారు. పై పద్యాలు సభాపర్వం ప్రథమాశ్వాసంలోనివి (45,46). ఇవి నన్నయ రచితములైనవి. నన్నయ పదకొండో శతాబ్దం వాడు. అంటే వెయ్యేండ్ల నాటివి ఈ పద్యాలు. నాటికే ప్రభుత్వంలో రైతుల కోసం ఏం చేయాలి అని ఆలోచించారు.

కేసీఆర్‌ సంక్షేమ పథకాలు చూస్తే ప్రాచీన సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్న కేసీఆర్‌ అక్కడి పరిపాలన నీతినుంచే స్ఫూర్తిని పొందినట్లు భావించడానికి అవకాశం ఉన్నది.

పైన చెప్పిన రైతు పథకాలే కాకుండా పరిపాలనలో పాలకులు అవలంబించవలసిన విధానాలు నారదుడు చెప్పిన వాటిని కూడా చూడవచ్చు.

కం. అనఘా నీ ప్రస్తవమున/

నని నీల్గిన వీరభటుల యనుపోష్యుల నె

ల్లను బ్రోతె భోజనాచ్ఛా/ 

దనముల వారలకు నెమ్మి దఱుగక యుండన్‌.  

రాజా నీ పాలనలో రాజకార్యం కోసం (యుద్ధంలో) అమరులైన వీరభటులపై ఆధారపడిన కుటుంబసభ్యులకు కూడూ గుడ్డా అన్ని సహాయాలు చేసి పోషిస్తున్నావా, వారిని రక్షిస్తున్నావా అన్నాడు. అంటే వారిని సరిగ్గా పోషించాలని నారదుడు సూటిగా చెబుతున్నాడు. ఇంకా...

కం. తమతమ కనియెడు తఱి జీ/ 

తము గానక నవయు భటుల దౌర్గత్య విషా

దములేని వాని కవ /

శ్యము నెగ్గొనరించు నతడు శక్రుండైనన్‌.. 

 పరిపాలనలో ప్రభుత్వం కోసం పనిచేసే భటులకు (నేటి పోలీసులు అనుకోవచ్చు) సరైన సమయంలో తగిన రీతిని జీతాలు ఇవ్వకపోతే అలాంటివారు పరిపాలకులకు తప్పనిసరిగా నష్టం చేకూరుస్తారు. కాబట్టి చనిపోయినవారినే కాదు, బతికి ఉండి పాలనలో సేవ చేసే భటులను మంచి  జీతం సమయానికే ఇచ్చి పాలించాలని చెప్పాడు. 

కం. చోరభయవర్జితముగా/

ధారుణీ బాలింతె యధికధనలోభమునం

జోరుల లక్షింపరుగా/

వారలచో ధనముగొని భవతభృవరుల్‌.. 

 ఓ రాజా చోరభయం లేకుండా పరిపాలిస్తున్నావా. నీ దగ్గర పనిచేసే సేవకులు అధిక ధనలోభంచేత (లంచాలకు లొంగి) చోరులను కాపాడి వెనుకేసుకొని వచ్చే అవకాశం ఉంది. అలా లేకుండా చూసుకుంటున్నావా లేదా అంటాడు నారదుడు. ఇదే ఆశ్వాసం 36, 37 పద్యాలలో ఉద్యోగులను నియమించే విషయంలో హెచ్చరిక చేస్తాడు. 

కం. ఉపధాశుద్ధులఁబాప/

వ్యపగతబుద్ధుల వినీత వర్తుల సములన్‌

సుపరీక్ష వినియోగించితె/

నిపుణుల నర్థార్జనాది నృపకార్యములన్‌..


ఉ. ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత 

బుద్ధి నెఱింగి వారిన

య్యుత్తమ మధ్యమాధమ నియోగములన్‌ 

నియమించితె నరేం

ద్రోత్తమ భృత్యకోటికి సమానముగాఁ 

దగు జీతంబు లా

యత్తమ సేసి యిత్తె దయ నయ్యయి

కాలము దప్పకుండగన్‌..

పన్నులు, డబ్బు వసూలు చేసే పనులలో నీతితో వర్తించేవారిని, ఉత్తమ, మధ్యమ అథమస్థానాలలో ఉద్యోగులను వారి మెరిట్‌లో ఉత్తమ మధ్యమ అథమ స్థానాలలో నియమిస్తున్నావా లేదా అని అడిగాడు. అంటే ఉద్యోగులను నేటి గ్రూపుల మాదిరి ప్రతిభను పట్టి నియమించు అని చెబుతాడు. ఇందులో ఇంకా చాలా పద్యాలు రాజనీతిని గురించి చెబుతాయి. దక్షులైన మంత్రులను నియమించుకోవాలంటాడు.

కేసీఆర్‌ పాలనావిధానాలు చూస్తే మహాభారతంలోని వేర్వేరు ఆశ్వాసాలలో, పర్వాలలో ఉన్న విషయాలను చదివినట్లుగా వాటినుంచే స్ఫూర్తి పొందినట్లుగా కనిపిస్తుంది. వెయ్యేండ్ల నాటి ఈ పద్యాల రాజనీతి నేటికీ అనుసరణీయంగా ఉండటం గమనార్హం. 

-్ర ఫొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి

9440493604 


logo