ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 24, 2020 , 23:39:59

పదాల రాకే భాషకు సంపద

పదాల రాకే భాషకు సంపద

సమాజం నిత్యవ్యవహారాలలో భావ ప్రసారానికి వినియోగపడే మాధ్యమం భాష. భాష సమర్థంగా ఉండే తీరు దాని పదజాలంపై ఆధారపడి ఉంటుంది. ఈ పదజాలం ఆ భాష పుట్టుక, ఇతర భాషలతో దానికిగల సంబంధాలు, ఇచ్చిపుచ్చుకోవడాలపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల పదాల స్వరూపంలోను, పదజాలంలోను తేడాలు కనిపిస్తాయి. దేశంలోని భాషలను పరిశీలిస్తే ఆర్య భాషల మీద ద్రవిడ (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) ప్రభావం కొట్ట్టొచ్చినట్లు కనబడుతుంది. అలాగే ద్రవిడ భాషలపై ఆర్య భాషల ప్రభావం (సంస్కృత భాష) ప్రభావం కనిపిస్తుంది.

తెలుగు భాష స్థితిని గమనిస్తే.. కన్నడం, తమిళం, ఉర్దూ, ప్రాకృతం, సంస్కృతం, డచ్చి, ఫ్రెంచ్‌, పోర్చుగీస్‌, ఇంగ్లీష్‌ భాషలతో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తుంది. తెలుగుభాష పదజాలం గురించి ఆధునిక, ప్రాచీన భాషావేత్తలు కృషిచేశారు. ఆంధ్రశబ్ద చింతామణి గ్రంథంలో పదజాలాన్ని తత్సమ, తద్భవ, దేశ్య, గ్రామ్యాలుగా వర్గీకరించారు.

 సంస్కృత ప్రాకృతాలకు సమానమైన భాష తత్సమమని దానినుంచి పుట్టిన భాష తద్భవమని పేర్కొన్నారు. తెలుగు ప్రజల వ్యవహార సిద్ధమైన భాష దేశ్యమని, వ్యాకరణ విరుద్ధమైన భాష గ్రామ్యమని వ్యాకరణవేత్త పరవస్తు చిన్నయసూరి పేర్కొన్నారు. ఒక భాషావేత్త ఒక వస్తువును, ఒక భావాన్ని సూచించడానికి తగిన పదం లేనప్పుడు  ఆ భాషను మాట్లాడే ప్రజల నుంచి కొత్త పదజాలాన్ని అరువు (ఆదానం) తెచ్చుకుంటాడు. ఏ భాషలోనైనా దేశ్యాలు, అన్యదేశ్యాలు అనేవి ఉంటాయి. ఆ భాషలోనే స్వతఃసిద్ధంగా ఆవిర్భవించి గూడు కట్టుకున్న పదాలను దేశ్యాలు అని, అలాకాకుండా అవసరాల రీత్యా ఇతర భాషల నుంచి బదులు తెచ్చుకునేవాటిని అన్యదేశ్యాలు అని అంటారు.

ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన తెలుగును చారిత్రకంగా పరిశీలిస్తే.. ప్రాచీన దశలోనే తత్సమ, తద్భవ పదాలు తెలుగులోకి ఎక్కువగా ప్రవేశించాయి. మహమ్మదీయ రాజుల పాలనా కాలంలో అరబ్బు, పర్షియన్‌ భాషా పదాలు వచ్చాయి. పోర్చుగీసు, ఇంగ్లిషు మొదలైన యూరప్‌ భాషల ప్రభావం కూడా తెలుగు భాషపై ఎక్కువ పడింది. మహమ్మదీయులు 18వ శతాబ్దంలో దండయాత్ర జరుపకముందే మహాకవి తిక్కన సోమయాజి (13వ శతాబ్దం) మహాభారతంలో తరాజు (త్రాసు) అనే పదాన్ని రెండు సార్లు తన రచనలో వాడారు. 

విజయనగర రాజుల కాలంలో మహమ్మదీయ సైనికులు హిందువులతో సఖ్యంగా ఉండటం వల్ల వారు మాట్లాడే పంజాబీ, అరబిక్‌, పర్షియన్‌ పదాలు తెలుగువారి పదాలుగా మారిపోయాయి. మహమ్మదీయుల పరిపాలన కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు, పాలకులు కూడా పర్షియన్‌ భాషను నేర్చుకున్నారు. దివాన్‌, కొత్వాల్‌ మొదలైన పదాలను పాలనా సౌలభ్యం కోసం 1580లో మహమ్మద్‌ కులీకుతుబ్‌షా కాలంలో దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. సామాన్య ప్రజలు కూడా మాతృభాష అయిన తెలుగునే కాకుండా కుతుబ్‌ షా కాలం నుంచి పర్షియన్‌, ఉర్దూ పదాలను విరివిగా నేర్చుకోవాల్సిన అవసరం నాటి పాలకులు కల్పించారు. గసగసాలు, కిస్‌మిస్‌లు అనే పర్షియన్‌ పదాలు తెలుగులో కలిసిపోయాయి. 1766లో నైజాం పాలనలో ముస్లింల సంపర్కం వల్ల తెలుగు భాషలోకి కొత్త కొత్త అరబిక్‌, పర్షియన్‌, ఉర్దూ పదాలు వచ్చి చేరాయి. 

ఆ భాషలను నేర్చుకున్నవారికే పెద్ద ఉద్యోగాలు, ప్రమోషన్లు లభించేవి. 1830లో ఆంగ్లేయులు ఉర్దూ భాషను రాజభాషగా ప్రకటించి తెలుగు భాషను నిర్లక్ష్యం చేశారు. 15వ శతాబ్దంలో న్యాయశాస్త్ర గ్రంథాలలో రెండువేల పర్షియన్‌, అరబిక్‌ పదాలు వచ్చిచేరాయి. సిపాయి, తుపాకీ, బందూకు, బందోబస్తు వంటి సైనికపరమైన అరబిక్‌, పర్షియన్‌ పదాలు వచ్చాయి. కౌలు, కుష్కీ వంటి పదాలు తెలుగు కాకపోయినప్పటికీ గ్రామాల్లో సామాన్యులు సైతం వాడుతుంటారు. వ్యాపారానికి సంబంధించిన త్రాసు, దుకాణం బట్టలకు సంబంధించిన జంబుఖానా, జలతారు, కలంకారీ కూడా అన్యదేశాలలో కనిపిస్తాయి. అనాస, గోబి (క్యాబేజి), బొప్పాయి, టమాటో వంటి పదాలను 1498లో పోర్చుగీసువారు తమతోపాటు మనదేశానికి తీసుకొచ్చారు. కమీజు, బొత్తాం, అల్మార, మేస్త్రీ మొదలైనవి పోర్చుగీసు భాష నుంచి వచ్చి కలిసినవే. ఆంగ్లేయుల పరిపాలన వలన లైటు, కాఫీ, రోడ్డు, బస్సు, కోర్టు, ఆఫీసు, సినిమా, డ్యాన్సు, క్లబ్‌ తదితర పదాలు అలవాటై పోయాయి. 

 ఏయే భాష నుంచి ఏయే పదాలు తెలుగు భాషలోకి వచ్చిచేరాయో ఇంకా లోతైన పరిశోధన జరుగాలి. పాఠశాలలు, కళాశాలల్లో భాషా బోధ కులు ఆయా పదాల పుట్టుపూర్వోత్తరాలు విద్యార్థులకు వివరిస్తున్నప్పటికీ తెలుగు భాషాభివృద్ధికి మరింత కృషి జరుగాల్సి ఉన్నది. 

- రావుల రాజేశం, 9848811424


logo