శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - May 24, 2020 , 23:39:58

బతుకుపోరు

బతుకుపోరు

నడక మళ్ళీ మొదలయ్యింది,

అనాది నుంచి ఇప్పటివరకు

అసలానడక ఆగిందెప్పుడని..?

నిత్యం చేస్తున్న విఫలయత్నమేగా ఈ వలస యుద్ధం

అయినా వాళ్లకు యుద్ధాలేం కొత్త కాదు

యజమానుల తిట్లు ఆత్మగౌరవంపై చేసిన మరో యుద్ధం

ఇలాంటి ఎన్నో యుద్ధాల్లో వాళ్ళ ఆత్మలెప్పుడో మరణించాయి

వాళ్లొట్టి దేహాలతో పోరాడుతున్న సైనికులంతే..!

కరోనా, ఆకలి.. అనే రెండు అదృశ్య శత్రువులు

ఏకకాలంలో చేస్తున్న పోరాటంలో వాళ్ళు నిలవాలి!

కనిపించని పురుగు పరుగెడుతున్న ప్రపంచాన్నే ఆపేస్తే

వలస కాళ్ళు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి..!

రక్తతర్పణ మర్పిస్తున్న వలస కాళ్ళను చూసి

రహదారులు మౌనంగా రోధిస్తున్నాయి

మనలోని మనిషితనాన్ని ఆ కాళ్ళు ప్రశ్నిస్తున్నాయి

మానవత్వాన్ని పాదరక్షలుగా చేసి ఆ కాళ్లకు తొడిగిద్దాం..

వాళ్ళ బతుకుపోరులో అన్నీ విజయం వెక్కిరించిన గాథలే

అందుకే ఈసారైనా వాళ్లను గెలిపిద్దాం..!

ఎముకలు తేలిన దేహాలు మన ముందు నుంచి వెళ్తున్నప్పుడు, 

కలో గంజో పోసి మానవత్వాన్ని నిరూపిద్దాం

కూటికోసం ఎగిరొచ్చిన వలసపక్షుల 

విరిగిన రెక్కలను అతికిద్దాం

క్షేమంగా వాటి గూటికి చేరాలని మనసారా ప్రార్థిద్దాం..!


logo