మంగళవారం 26 మే 2020
Editorial - May 23, 2020 , 22:29:10

విష క్రిమి ‘ప్రాణ’ రహస్యం?

విష క్రిమి ‘ప్రాణ’ రహస్యం?

మాయల మాంత్రికుడి ప్రాణాలు రామచిలుకలో ఉన్నట్టు, కరోనా విషక్రిమి ‘కోరలు’ ఎక్కడున్నాయో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు అవశమైపోతున్నది. దీనికి ప్రధాన కారణం, ‘కొవిడ్‌-19’ (కరోనా వైరస్‌) నిర్మాణం, స్వాభావికత, పనితీరు, తత్తం, బలహీనతల (దుర్భర ప్రదేశాలు)ను వారు తెలుసుకోలేక పోతుండటమే. ఇదే కనుక జరిగితే, దానిని కట్టడి చేసే మందు తయారుచేయడం వారికి తేలికవుతుంది. ఒకవైపు ఎలాగైతే వ్యాధి బాధితుల ప్రాణాలను రక్షించడానికి వైద్యులు ఎంతగా శక్తివంచన లేకుండా నిరంతరం పోరాడుతున్నారో.. మరోవైపు టీకా, విరుగుడు మందుల ఆవిష్కరణలకు ప్రపంచ శాస్త్రవేత్తలూ అదేలా, అంతేస్థాయిలో నిద్రాహారాలు మాని పరిశోధనల్లో నిమగ్నమవుతున్నారన్నదీ నిజం.

ఒక జీవకణాన్ని కబళించిన తర్వాత ఈ కరోనావైరస్‌ అప్రతిహతంగా పెరుగుతున్న ‘విధానం’ బోధపడుతున్న రీతిలో దాని‘నిర్మూలనా వ్యూహం’ మాత్రం శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. ‘కొవిడ్‌-19’కు టీకా, విరుగుడు మందులు కనిపెట్టడానికి మూలమైన ‘శత్రు స్వాభావికత’ను తెలుసుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. 

అమెరికాలోని సాన్‌ డీగో నగరానికి చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం ‘కొవిడ్‌-19’ తాలూకు ఒక కదిలే ‘త్రిమితీయ డిజిటల్‌ ప్రతిరూపాన్ని’ (replica) తాజాగా అభివృద్ధి పరుస్తున్నారు. దీనిద్వారా ఈ విషక్రిమి అసలు స్వరూప, స్వభావాలు, బలహీనతలు కొంతవరకు వారికి అవగాహనకు వస్తున్నాయి. కానీ, పూర్తిస్థాయిలో టీకా (vaccine), విరుగుడు మందు (antidote) ఆవిష్కరణలకు మరిన్ని లోతైన పరిశోధనలు అవసరమనీ వారంటున్నారు. అసలే ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌, మరోవైపు అంటువ్యాధి గురించిన భయాందోళనలు రెండింటి నడుమ కూడా అనేక దేశాలకు చెందిన ఎందరో ప్రముఖ శాస్త్రవేత్తలు యుద్ధప్రాతిపదికన ప్రాణాలకు తెగించి పరిశోధనలనైతే కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే పై పరిశోధకులు ‘వైరస్‌ డిజిటల్‌ నమూనా’ను సిద్ధం చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇది అసలు వైరస్‌ కదిలినట్లుగానే కదులుతున్నదని, దీనిద్వారా దాని తత్తం, దుర్భర (దాడి చేయడానికి అనువైన) ప్రదేశాలూ తెలుస్తాయని వారు ఆశిస్తున్నారు. వ్యాక్సిన్‌, ఔషధాల తయారీలో ఇదొక ముందడుగుగా భావిస్తున్నారు.

‘వైరస్‌' అసలు ‘జీవి’ కాకపోవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు అనుకొంటున్నప్పటికీ, అది జీవకణాలతోపాటు సూక్ష్మజీవులనూ ఆశ్రయించుకుని మనుగడ సాగిస్తున్నందున, వాటికి ప్రాణం (జీవశక్తి) లేదనుకోవడానికి వీల్లేదు. అందుకే వాటిని రోగకారకమైన ‘విషక్రిముల’ కిందనే అనేకమంది పరిశోధకులు పరిగణిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఒకవైపు అంతర్జాతీయంగా రాజకీయ నాయకులు తమ దేశాల భౌగోళిక సరిహద్దులను మూసేస్తూ రాకపోకలను నిలిపి వేస్తున్నప్పటికీ అత్యధిక శాస్త్రవేత్తలు సాహసోపేతంగా ప్రస్తుత ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’లోనూ దీనినే ఏకైక లక్ష్యంతో పరిశోధనలు జరుపుతుండటం అభినందనీయం. ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చెందిన ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్లుహెచ్‌ఓ) స్వయంగా ఆయా దేశాలలో జరుగుతున్న వివిధ కరోనా పరిశోధనల పట్ల ప్రత్యక్ష పర్యవేక్షణను కూడా జరుపుతున్నది. అంటువ్యాధులకు చెందిన వందలాది జన్యుక్రమాల (జినోమ్‌ సీక్వెన్సెస్‌)ను శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించడమేకాక పరస్పరం పంపిణీ (ఆన్‌లైన్‌లోనే) చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా గల ఆయా దవాఖానలు, ప్రయోగశాలలో సుమారు 200కు పైగా వైద్య ప్రయోగాలు (క్లినికల్‌ ట్రయల్స్‌) కూడా ఇప్పటికే పూర్తయినట్లు వారు చెబుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా వికృతంగా కోరలు చాస్తూ, లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న ఈ వైరస్‌ ‘ప్రాణం’ (బలహీన ప్రాంతం) దానిలో ఎక్కడుంది? ఇది అర్థం కావడానికే దాని నిర్మాణ తీరుతెన్నులు తెలియాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉదాహరణకు అదుపు లేకుండా పిచ్చి పట్టినట్టు దూసుకెళుతున్న ఒక కారును నిలువరించాలంటే దాని ఇంజిన్‌కు సరఫరా అవుతున్న చమురును ఆపడమో లేదా టైర్లలో గాలి తీసేయడమో చేయాలి. ఈ వైరస్‌ను అణువుల స్థాయిలోనే ఒక్కొక్క దానినీ సమగ్రంగా పరిశీలిస్తూ, ‘ఎక్కడ దాని బలహీనతలు ఉన్నదీ’ తెలుసుకోవడానికే తాము ప్రస్తుత ‘అనుకరణ విధానాన్ని’ (సిమ్యులేషన్‌) రూపొందిస్తున్నట్టు పైన పేర్కొన్న సాన్‌ డీగో పరిశోధకులు చెబుతున్నారు. దీనికిగాను వారు టెక్సాస్‌ (అమెరికా) రాజధాని                     ఆస్టిన్‌లోని ‘టెక్సాస్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ సెంటర్‌'కు చెందిన ‘ఫ్రంటెరా’ (Frontera) సూపర్‌ కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే 5వ అతిశక్తివంతమైన మహా కంప్యూటర్‌.

యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాలోని నేషనల్‌ బయోమెడికల్‌ కంప్యూటేషనల్‌ రీసోర్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రోమీ అమెరో (Rommie E. Amaro) నాయకత్వంలో సాన్‌ డీగో                  పరిశోధకులు మొత్తం సుమారు 200 మిలియన్‌ అణువులపై ‘కొవిడ్‌-19’ వైరస్‌ కదలికలను పరిశీలించారు. ఎలక్ట్రాన్లు, ఎక్స్‌ కిరణాల పుంజాలతో వాటి త్రిమితీయ (త్రీడీ) నమూనాలను వారు సృష్టించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒక వైరస్‌ కణంతో మరో వైరస్‌ కణానికి అసలు పోలికే ఉండకపోవడం. కొన్ని వైరస్‌ అణువులు గోళాకారం (గుండ్రం)లో ఉంటే, మరికొన్ని అండాకారంలో ఉన్నాయి. వాటి పరిమాణాలూ 80 నుంచి 160 నానోమీటర్ల చుట్టుకొలతను కలిగి వున్నాయి. ఈ వైరస్‌లను వరుసగా ఒకదాని తర్వాత మరొకటి నిలబెడితే మన కనుపాప మీది వెంట్రుక వెడల్పుపైనే 1000 వరకూ చోటు చేసుకొంటాయని అంచనా. పై పరిశోధకులు ఈ వైరస్‌లను సుమారు 40,000 రెట్లు పెద్దవి చేసి మరీ వాటి నిర్మాణ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. 

ఒక జీవకణాన్ని కబళించిన తర్వాత ఈ కరోనావైరస్‌ అప్రతిహతంగా పెరుగుతున్న ‘విధానం’ బోధపడుతున్న రీతిలో దాని

‘నిర్మూలనా వ్యూహం’ మాత్రం శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. ‘కొవిడ్‌-19’కు టీకా, విరుగుడు మందులు కనిపెట్టడానికి మూలమైన ‘శత్రు స్వాభావికత’ను తెలుసుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. కనుకే, ఇప్పుడు ఇదే వారికి ప్రధాన లక్ష్యంగా ఉన్నది. ‘కొవిడ్‌-19’ వైరస్‌ను బాహ్యవాతావరణంలో హతమార్చడం పెద్ద పని కాదు. అది అంతటి అతిసూక్ష్మస్థాయిలోనూ మనకు కనిపించకుండా ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా, దానిని వదుల్చుకోవడం చిటికెలో పని. సబ్బునీళ్ల నుంచి శానిటైజర్‌ వరకూ దేనిని వాడినా సరిపోతుంది. అంత చిన్న ‘పిచ్చుక’ ప్రాణం (?) తీయడం అత్యంత సులభం. కానీ, వాయు-జల-ఆహార పదార్థాల రూపాలలో లేదా తలవెంట్రుకలు, వస్ర్తాలు, ఇతరేతర వస్తువుల ఆధారంగా అది మన శరీరంలోకి ప్రవేశించి జీవకణాలను ఆశ్రయిస్తేనే.. అసలు సమస్య మొదలవుతుంది. అంత సూక్ష్మాతిసూక్ష్మ స్థాయిలో దాని మనుగడ వ్యవస్థను తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు ఇప్పటికింకా సాధ్యం కావడం లేదంటే పరిశోధనలు, శాస్త్ర సాంకేతికాభివృద్ధిలో మానవుడు ఇంకెంత ప్రగతిని సాధించవలసి ఉందో అర్థమవుతున్నది. 

దీనికోసమే, మానవ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ పరిశోధకులంతా అత్యవసరంగా ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తున్నారు. ఏ దేశానికి ఆ దేశం పరిశోధనల్లో ముందుండాలనుకోవడం సహజమే. కానీ, వైరస్‌ను ఎదుర్కొనే శక్తివంతమైన ఔషధావిష్కరణకు ఈ సంక్లిష్టవేళ వారంతా తమకు అందిన సమాచారాన్ని పరస్పరం పంచుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలందరిలోనూ కరోనా పరిశోధనలపట్ల ఈ ‘ఏకీకృత భావన’ పొడసూపడం ప్రశంసనీయమే. ఐతే, పలు దేశాల ప్రభుత్వాలు మరొక అడుగు ముందుకు వచ్చి, యుద్ధప్రాతిపదికన ఆన్‌లైన్‌లోనైనా వారిని ఒక్కతాటిపైకి తెచ్చి, పరిశోధనలకు పూర్తి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పరచగలగాలి. కానీ, ఇది జరగడం లేదు. కరోనా మరణాలు లక్షలనుంచి కోట్లకు చేరక ముందే తక్షణం ప్రపంచ దేశాలన్నీ మేల్కొనాలి. ‘కొవిడ్‌-19’పై పోరాటానికి ఒక్కటై, పరిశోధనలను వేగవంతం చేయాలి. ప్రజలు వైరస్‌ బారిన పడకుండా చూడటంతోపాటు దాని నిర్మూలన, నివారణలకు ఈ బాధ్యతను తలకెత్తుకోగలగాలి. అప్పుడే కరోనా కోరలు పీకగలం.


logo