మంగళవారం 26 మే 2020
Editorial - May 23, 2020 , 22:29:09

భరోసానిచ్చే నేత

భరోసానిచ్చే నేత

రాష్ర్టావతరణ తర్వాత చేనేత రంగాన్ని సంరక్షించటం కోసం తెలంగాణ ప్రభుత్వం అవిరళ కృషిచేస్తున్నది. ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నది, అండగా నిలుస్తున్నది. అరువై రోజులుగా కరోనా, లాక్‌డౌన్‌తో చేనేత బతుకుల్లో కరువు కాలం వచ్చింది. దీనాతి దీనంగా దైన్యం నిండిన తెలంగాణ నేతన్న కండ్లల్లో కేటీఆర్‌ కాంతి నింపారు.

‘నేతరా చేనేతరా చేతివృత్తిలో మేటిరా..’ అని గర్వంగా వస్త్ర తయారీతో జీవనం సాగించే కుల, వృత్తి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని గురించి గొప్పగా చెప్పుకునేలా రాశారు ఈ పాట. ‘యూ ట్యూబ్‌'లో జయహో చేనేత అని టైప్‌ చేస్తే ఈ పాటే వీనులవిందుగా వినిపిస్తుంది. కళాఖండాల వంటి బట్టలు నేయడంలో చేనేత మగ్గాలు దిట్ట. అందానికే అందం ఈ పుత్తడి బొమ్మా అని సుందరాంగులు ముస్తాబుకు ముచ్చటపడేలా తయారయ్యే చీరలు చేనేతతో మాత్రమే సాధ్యం.

మానవ వికాస చరిత్రలో  చేనేతది విశిష్ట స్థానం. నాగరికతకు ఆకృతి అద్ది, మనిషి ఔన్నత్యాన్ని నిలుపటంలో చేనేత పాత్ర అద్వితీయం. మరో మాటలో చెప్పాలంటే.. చేనేత వస్ర్తాలే మనిషి ఉనికిని, ఉన్నతిని తెలియజేస్తాయి. కట్టుకున్న బట్టలతోనే మనిషి సామాజిక స్థితిని తెలుసుకునే పరిస్థితి ఉన్నది. అట్లాంటి ప్రాధాన్యం కలిగిన చేనేతరంగం కష్టాలకు, కడగండ్లకు నెలవయ్యింది. మగ్గం గుంటనే నేత కార్మికుని బొందలగడ్డగా మారిన దుస్థితి ఏర్పడింది. దీనికి చేనేత పట్ల పాలకుల నిర్లక్ష్యానికి తోడు, ప్రపంచీకరణలో బహుళజాతి కంపెనీల వస్త్ర దాడి నేతన్నలకు ఉరితాడు పేనింది.

ఇలాంటి పరిస్థితిలో రాష్ర్టావతరణ తర్వాత చేనేత రంగాన్ని సంరక్షించటం కోసం తెలంగాణ ప్రభుత్వం అవిరళ కృషిచేస్తున్నది. ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నది, అండగా నిలుస్తున్నది. అరువై  రోజులుగా కరోనా, లాక్‌డౌన్‌తో చేనేత బతుకుల్లో కరువు కాలం వచ్చింది. దీనాతి దీనంగా దైన్యం నిండిన తెలంగాణ నేతన్న కండ్లల్లో కేటీఆర్‌ కాంతి నింపారు. కరోనా కాలంలో రాకపోకలతో సిరిశాలకు ధైర్యం కలిగింది. అలాగే ఇటీవల సీఎం కేసీఆర్‌ సిరిసిల్ల సెల్లతో కనపడుతున్న దృశ్యం చేనేతకు ఫ్యాషన్‌ తెచ్చిపెట్టింది. యువనేత కేటీఆర్‌ సైతం తాను చేనేత మాస్కునే వాడుతున్నట్లు చెప్పడంతో పాటు, హ్యాండ్‌లూం సోమవారంను కొనసాగిస్తున్నట్లు చేసిన ట్వీట్‌కు ఎంతోమంది స్పందించారు. ఇవ్వాళ సిరిసిల్ల సెల్ల ఫ్యాషన్‌ బ్రాండ్‌ కావటం ముదావహం.

లాక్‌డౌన్‌ తర్వాత చేనేత కోసం ఏం చేయాలో, ఎలా చేయాలో మాట్లాడుదామనడంతో ఏం చేయాలో తోచని చేనేత చేతులకు చేవ వచ్చింది. పోగు పోగు అతికే బతుకులకు భరోసా కలిగింది. నేత కార్మికుల కండ్లల్లో ఆశలు నింపారు. దేశంలోనే అతిపెద్ద చేనేత సంద్రం వంటి కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను వరంగల్‌లో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. దీంతో వేలమంది చేనేత కార్మికుల బతుకుకు కేటీఆర్‌ ఒక భరోసా ఇచ్చారు. నేతన్నలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం తరపున పెద్దఎత్తున ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిపారు. మగ్గం మీద జీవనోపాధి మృగ్యమనుకుంటున్న తరుణంలో ఈ చేయూత, బలమైన ఆలంబన నేతన్నలో కొండంత ధైర్యాన్నిచ్చింది. రూ.14.50 కోట్లతో టెక్స్‌టైల్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రభుత్వం తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చాటిచెప్పింది. ఏ ప్రభుత్వం చేయనివిధంగా సీఎం కేసీఆర్‌ చేనేతరంగ సంక్షే మం కోసం చేస్తున్న  కృషి చేనేతకు మాత్రమే గాక, రాష్ర్టానికీ బంగారు భవిష్యత్తును ఇస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 

(వ్యాసకర్త: తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి)

Previous Article కోనేరులో
Next Article వాస్తు

logo